English | Telugu

భగత్ సింగ్ పాత్రను చెయ్యాలనేది కలగానే మిగిలిపోయింది: చిరంజీవి

on Sep 22, 2019

 

"ఈ రోజు సెప్టెంబర్ 22. నా జీవితంలో ఒక అత్భుతమైన ల్యాండ్ మార్క్. 1978 సెప్టెంబర్ 22 నా మొట్టమొదటి సినిమా 'ప్రాణం ఖరీదు' రిలీజైన రోజు. ఆ రోజు 'నా సినిమా ప్రజల ముందు వెళ్తోంది, వాళ్లు చూస్తున్నారు.. ఎలా ఉంటుంది.. నా గురించి వాళ్లు ఏమనుకుంటారు.. నా భవిష్యత్తు ఎలా ఉంటుంద'నే మీమాంసతో నాలో ఒక మిశ్రమ భావన.. ఒక పక్క టెన్షన్.. ఒక పక్క ఎగ్జైట్‌మెంట్.. ఒక పక్క ఏదో తెలీని ఉద్విగ్నత.. ఇలా రకరకాల ఫీలింగ్స్‌తో నేనీ నేలమీద లేనంటే.. ఒట్టు. అలాంటి టెన్షన్.. అలాంటి ఎగ్జైట్‌మెంట్.. అలాంటి ఉద్విగ్నత.. 41 ఒక్క సంవత్సరాల తర్వాత ఈ 2019 సెప్టెంబర్ 22న నేను ఫీలవుతున్నాననేది వాస్తవం. దానికి కారణం.. 'సైరా.. నరసింహారెడ్డి'. 

ఒక పుష్కర కాలం నుంచీ ఈ కథ నాలో మెదులుతూ ఉంది. దానికంటే 20 సంవత్సరాల ముందు "మీరు చెయ్యాలనుకుంటున్న అద్భుత పాత్రలేవైనా ఉన్నాయా?" అనడిగితే, ఎప్పుడూ అంటుంటాను - "నాకు స్వాతంత్ర్య సమరయోధుడి పాత్ర చెయ్యాలని ఉంది. అది ప్రజల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయే పాత్ర అవ్వాలి. నా కెరీర్‌కి అది బెస్ట్ కేరెక్టర్ అవ్వాలి. ఆ పాత్ర.. భగత్ సింగ్" అని. కానీ ఎందుకో భగత్ సింగ్ కథను ఏ కథకుడూ తీసుకు రాలేదు. ఏ నిర్మాతా, ఏ దర్శకుడూ తీసుకు రాలేదు. అలా ఆ కోరిక, ఆ కల అలాగే ఉండిపోయింది. పుష్కర కాలం ముందు పరుచూరి బ్రదర్స్‌లో ఒకరైన పరుచూరి వెంకటేశ్వరరావు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురించి చెప్పారు. కర్నూలు జిల్లా ఉయాలవాడలోని నొస్సం దగ్గర ప్రాంతానికి చెందిన తొలి స్వాతంత్ర్య సమరయోధుడనీ, ఆ పాత్ర నాకు బాగుంటుందనీ, అందులో ఎన్నో డైమెన్షన్స్ ఉన్నాయనీ చెప్పారు. 'సినిమాగా ఎంత సక్సెస్ అవుతుందనేది పక్కనపెడితే, ఒక యోగి లాంటి స్వాతంత్ర్య సమరయోధుడి కథని మన తెలుగువారికి, భారతీయులందరికీ తెలియజెప్పినట్లు ఉంటుంది.. అలాంటి హీరో ఆయన.. అది మీరు చెయ్యాలి' అంటూ అప్పట్నుంచీ అడుగుతూనే ఉన్నారు.  అక్కడి రెండు మూడు జిల్లాల్లోని చరిత్ర పరిశోధకులకో, ఏ కొంతమందికో తప్ప ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. ఆ టైంలో నాకూ తెలీదు. నా చుట్టుపక్కల వాళ్లని అడిగినా తమకూ తెలియదన్నారు. ఏవో నలభై, యాభై పేజీల పుస్తకాలు, స్థానికంగా బుర్రకథలు, కొన్ని ఒగ్గు కథలు.. వంటివి ఉన్నాయి తప్ప, ఆయన గురించిన ప్రాచుర్యం ఏ ప్రాంతానికీ పాకలేదు. కానీ ఆయన కథ విన్నప్పుడు ఒక అన్‌సంగ్ హీరో స్టోరీ, తెరమరుగైపోయిన ఒక యోధుడి కథ అనిపించింది. 

మనకు 1857 సిపాయిల తిరుగుబాటు, అప్పటి మంగళ్ పాండే, ఝాన్సీ లక్ష్మీబాయి గురించి తెలుసు. ఆ తర్వాత కాలానికి చెందిన చంద్రశేఖర అజాద్, భగత్ సింగ్, నేతాజీ, మహాత్మా గాంధీ వంటి ఎంతోమంది యోధుల గురించి మనకు తెలుసు. కానీ తెరమరుగైపోయిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథను జనం ముందుకు తీసుకురావాలి. ఆయన తెలుగువాడు.. అనేది మైండ్‌లో గట్టిగా ఉండిపోయింది. ఈ సినిమా చెయ్యాలని ఎప్పుడైతే పరుచూరి బ్రదర్స్ సంకల్పించారో, నన్ను ఒప్పించడానికి ప్రయత్నం చేశారో, యెస్.. చెయ్యాలి.. అనే బలమైన కోరిక నాలో ఏర్పడిపోయింది. ఇలాంటి కథ కోసమే ఎదురుచూస్తున్నాను అనిపించింది. అయితే - ఇలాంటి కథకు న్యాయం చెయ్యాలంటే బడ్జెట్ ప్రాబ్లెం అనిపించింది. పది, పదిహేనేళ్ల క్రితం నాపై ముప్పై, నలభై కోట్లు పెట్టి సినిమా తీసే రోజుల్లో ఇది.. అరవై, డెబ్భై కోట్ల పైన అవుతుంది.. ఏ నిర్మాతా ముందుకు రాలేడు.. ఏ నిర్మాతనీ చెయ్యమని అడగలేం. నష్టపోయే పరిస్థితి. అలా బడ్జెట్ సపోర్ట్ లేక, ఏ నిర్మాతా ముందుకు రాక.. ఆగిపోయింది." అని ఆయన చెప్పారు.


Also ReadLatest NewsCustomer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here