కరోనాతో కన్నుమూసిన బ్రాడ్‌కాస్టింగ్ లెజెండ్ లారీ కింగ్
on Jan 23, 2021
ముక్కుసూటిగా, కుండబద్దలు కొట్టినట్లు నిజాయితీగా ఇంటర్వ్యూలు చేస్తారని మనందరికీ తెలిసిన వరల్డ్ ఫేమస్ లెజెండరీ బ్రాడ్‌కాస్టర్ లారీ కింగ్ కన్నుమూశారు. ఆయన వయసు 87 సంవత్సరాలు. లారీ మృతి వార్తను ఆయన కంపెనీ ఓరా మీడియా ఓ ప్రకటనలో వెల్లడించింది. లాస్ ఏంజెల్స్‌లోని సెడార్స్-సినాయ్ మెడికల్ సెంటర్‌లో అమెరికన్ కాలమానం ప్రకారం శనివారం ఉదయం ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ నెల మొదట్లో కొవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయిన కింగ్ అప్పట్నుంచీ ఆ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు.
1933లో న్యూయార్క్‌లో లారీ కింగ్ జన్మించారు. ఆయన అసలు పేరు లారెన్స్ జీగర్. 1950లలో ఒక మియామి రేడియో స్టేషన్‌లో చేరడం ద్వారా బ్రాడ్‌కాస్ట్ మీడియాలో తన సుదీర్ఘ కాల కెరీర్‌ను ఆయన ప్రారంభించారు. అక్కడ ఆయన న్యూస్, స్పోర్ట్స్‌ను కవర్ చేయడంతో పాటు డీజేగా కూడా పనిచేశారు. 1970లలో మియామీ నుంచి జాతీయ స్థాయి నైట్‌టైమ్ రేడియో షో చేసే స్థాయికి ఎదిగారు. ఆ తర్వాత తనకెంతో పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చిన ఇంటర్వ్యూ సిరీస్ "లారీ కింగ్ లైవ్"ను సీఎన్ఎన్‌లో చేశారు.
ఈ సిరీస్‌లో కింగ్ 1985 నుంచి 2010 సంవత్సరాల మధ్య అప్పటి ప్రముఖ పొలిటికల్, ఫిల్మ్, బిజినెస్ సెలబ్రిటీలనెందరినో ఇంటర్వ్యూలు చేశారు. వారిలో దేశాధ్యక్షులు కూడా ఉన్నారు. రేడియో, టెలివిజన్ రంగాలకు చేసిన సేవలకు గాను రెండు సార్లు ఆయన పీబడీ అవార్డ్స్ అందుకున్నారు.
Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
