సింగిల్‌గా వెళ్తా!
on Feb 5, 2018
సినిమాలు చూడని సినిమావాళ్ల గురించి మీకు తెలుసా? ఈ లిస్ట్ లో ఎంతమంది ఉన్నారో చెప్పలేం కానీ.. ఓ ఇద్దరు పేర్లు మాత్రం ఈజీగా చెప్పొచ్చు. వాళ్లే... ఉత్తరాదిన నానాపటేకర్. దక్షిణాదిన బ్రహ్మానందం.
అవును... వీరిద్దరూ సినిమాలు చూడరు. కనీసం... వారు చేసిన పాత్రలనైనా చూసుకోరు. అదేం విడ్డూరం అనుకుంటున్నారా? ఈ సందేహాన్ని ఇటీవల బ్రహ్మానందం ముందుంచితే... ఆయన భలే ఆసక్తికరమైన సమాధానాలిచ్చాడు.
ఇద్దరు మనుషులు మాట్లాడుకుంటుంటే... వెనుక మ్యూజిక్ రావడం ఏంటండీ...?’
ఎక్కడైనా వీధుల్లోకొచ్చి ఆడామగా డాన్సులేస్తారా? ఒకవేళ పిచ్చేక్కి డాన్సులు వేశారే అనుకుందాం... ఒకే రకం బట్టలేసుకొని వెనకాలే... అంతమంది ఎగరడం ఏంటండీ?
సినిమాలు చూస్తుంటే నాకిలాంటి సందేహాలే వస్తుంటాయ్. అందుకే చూడ్డం మానేశా. అని చెప్పారు బ్రహ్మీ. ఇంకా చెబుతూ... పాతికేళ్ల క్రితం ఓ సారి ఓ సినిమాకెళ్లానండీ... సినిమా పేరు అప్రస్తుతం. మన తెలుగు సినిమానే. తెరపై హీరోగారి ప్రేమ విఫలమైంది. దాంతో ఆయన మందు తాగుతూ విషాద గీతం ఆలపిస్తున్నాడు. మధ్య మధ్యలో దగ్గుతున్నాడు. నేను సీరియస్ గా చూస్తున్నాను. ఇంతలో నా వెనకాల నుంచి.... ‘ఆ రకంగా దగ్గొస్తున్నప్పుడూ... పాట దేనికట?’ అనే మాట వినిపించింది. అంతే... అంతటి విషాద సన్నివేశంలో కూడా నాకు నవ్వు ఆగలేదు. సరిగ్గా అప్పట్నుంచే సినిమాలు చూడ్డం ఆపేశా. అని చెప్పాడు కామెడీకింగ్.
అయితే.... బ్రహ్మీ ఎంటర్టైన్మెంట్ ఏంటా? అనుకుంటున్నారా? అదే మాట అడిగితే... ‘మంచి నాటకం వేస్తున్నారని తెలిస్తే... ఎవరికీ చెప్పకుండా సింగిల్ గా రవీంద్రభారతికి వెళ్లిపోతా. ఓ మూల కూర్చొని నాటకం చూస్తా. నాటకం అయిపోతోంది... అనే సమయంలో... ఎవరికీ కనిపించకుండా బయటకొచ్చేస్తా. ఇదే నా ఎంటర్టైన్మెంట్’ అని అసలు విషయం చెప్పాడు బ్రహ్మానందం.