English | Telugu

బాక్సాఫీస్ భీకర యుద్ధం: 'సరిలేరు నీకెవ్వరు' వర్సెస్ 'అల వైకుంఠపురములో'

on Jan 17, 2020

 

సంక్రాంతి పందెం కోళ్లు 'సరిలేరు నీకెవ్వరు', 'అల వైకుంఠపురములో' ఒకదానితో ఒకటి బాక్సాఫీస్ దగ్గర భీకరంగా ఢీకొంటున్నాయి. సూపర్ స్టార్ మహేశ్, అనిల్ రావిపూడి కాంబినేషన్ మూవీ 'సరిలేరు నీకెవ్వరు'కి క్రిటిక్స్ మిక్స్డ్ రివ్యూస్ ఇవ్వగా, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుండు త్రివిక్రమ్ కాంబినేషన్ ఫిల్మ్ 'అల వైకుంఠపురములో'కు క్రిటిక్స్ బ్రహ్మరథం పట్టారు. దేశభక్తి మేళవించిన యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా 'సరిలేరు నీకెవ్వరు' సినిమా రూపొందిందితే, 'అత్తారింటికి దారేది' తరహాలో అమ్మవారింటికి కొడుకు వచ్చే కథతో 'అల వైకుంఠపురములో' సినిమా తయారైంది. ఈ రెండు సినిమాలతో పాటు సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా 'దర్బార్', నందమూరి కల్యాణ్ రామ్ మూవీ 'ఎంత మంచివాడవురా' సినిమా సైతం సంక్రాంతి బరిలో నిలిచాయి.

'దర్బార్' మూవీ తెలుగు వెర్షన్ హక్కులు 15 కోట్లకు అమ్ముడుపోగా తొలివారం ఆ సినిమా సాధించిన షేర్ 8.25 కోట్ల రూపాయలుగా పేరుపొందిన బాక్సాఫీస్ ట్రాకింగ్ సైట్ తెలియజేసింది. అంటే 55 శాతమే రికవర్ అయ్యిందన్న మాట. ప్రస్తుతం దానికి వస్తున్న వసూళ్ల సరళిని పరిగణనలోకి తీసుకుంటే, బయ్యర్లు నష్టపోవడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. 'రోబో' తర్వాత రజనీకాంత్ హవా తెలుగు రాష్ట్రాల్లో క్రమేపీ తగ్గిపోతూ వస్తున్నదని వాళ్లు తెలియజేస్తున్నారు. పైగా 'సరిలేరు నీకెవ్వరు', 'అల వైకుంఠపురములో' సినిమాలు 'దర్బార్'ను బాగా దెబ్బకొట్టాయి.

అలాగే కల్యాణ్ రామ్ సినిమా 'ఎంత మంచివాడవురా'కు ఓపెనింగ్స్ ఫర్వాలేదనిపించే స్థాయిలో వచ్చాయి. తక్కువ బడ్జెట్‌తో తయారైన ఈ సినిమా వరల్డ్ వైడ్ ప్రి బిజినెస్ విలువ సుమారు 10 కోట్ల రూపాయలు కాగా, మొదటి రోజు దీనికి 2 కోట్ల 5 లక్షల రూపాయల షేర్ వచ్చింది. జనవరి 15న ఈ సినిమా విడుదలవడం వల్ల సంక్రాంతి సెలవుల్ని క్యాష్ చేసుకోవడంలో ఈ సినిమా వెనుకబడిందనే చెప్పాలి.

ఇక ఒకరోజు తేడాతో విడుదలైన 'సరిలేరు నీకెవ్వరు', 'అల వైకుంఠపురములో' సినిమాలు అత్యధిక సంఖ్యలో థియేటర్లకు ప్రేక్షకుల్ని రప్పిస్తున్నాయి. మహేశ్ మూవీ బీ, సీ సెంటర్లలో భారీ వసూళ్లను సాధిస్తుంటే, అర్బన్ ఏరియాల్లో అల్లు అర్జున్ మూవీ ఎదురులేని రీతిలో దూసుకుపోతోందని వసూళ్లు తెలియజేస్తున్నాయి. జనవరి 11న రిలీజైన 'సరిలేరు నీకెవ్వరు' సినిమా నమ్మదగ్గ బాక్సాఫీస్ ట్రాకింగ్ సైట్ల ప్రకారం తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా 33.38 కోట్ల రూపాయల షేర్ సాధించి మహేశ్ సినిమాల్లో సరికొత్త రికార్డ్ సృష్టించింది. అందులో రెండు తెలుగు రాష్ట్రాల వాటా 25.32 కోట్లు. అయితే నిర్మాతలు దీనికి భిన్నంగా ఈ సినిమా తొలి రోజు వరల్డ్ వైడ్‌గా 46.77 కోట్ల రూపాయల షేర్ సాధించిందని అధికారికంగా ప్రకటించారు. ఈ నంబర్లకు మహేశ్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకోగా, ట్రేడ్ విశ్లేషకులు మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. వాళ్ల లెక్కల ప్రకారం ఈ మూవీ మూడు రోజులకు ప్రపంచవ్యాప్తంగా 52.01 కోట్లు, 5 రోజులకు 69.21 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్త ప్రి బిజినెస్ విలువ 103 కోట్ల రూపాయలు. అంటే ఐదు రోజుల్లో 67 శాతం పెట్టుబడిని వసూలు చేసింది. మిక్స్డ్ టాక్‌లోనూ ఈ మూవీ ఈ రేంజ్ కలెక్షన్లు సాధించడం గొప్ప విషయంగా చెప్పుకోవాలి. ఎంటర్‌టైన్‌మెంట్ మేళవించిన పాత్రలో మహేశ్, ఎమోషనల్‌గా కొనసాగే క్యారెక్టర్‌లో విజయశాంతి ప్రదర్శించిన పర్ఫార్మెన్సెస్ ఈ సినిమాని నిలబెట్టాయి. మరోవైపు నిర్మాతలు ఈ సినిమా ఆరు రోజులకు ఏపీ, తెలంగాణలోనే 77.94 కోట్ల రూపాయల షేర్ సాధించిందని అధికారికంగా ప్రకటించడం గమనార్హం. వాళ్లు తమ ప్రకటనల్లో 'బ్లాక్‌బస్టర్స్ కా బాప్' అంటూ ఈ మూవీని పేర్కొంటూ వస్తున్నారు.

మరోవైపు జనవరి 12న విడుదలైన బన్నీ సినిమా 'అల వైకుంఠపురములో' తొలిరోజు మహేశ్ సినిమా కంటే తక్కువ వసూలు చేసినా, ఆ తర్వాత సూపర్బ్ మౌత్ టాక్‌తో సరికొత్త రికార్డుల్ని సాధిస్తూ ట్రేడ్ విశ్లేషకుల్ని సైతం ఆశ్చర్యపరుస్తూ అనూహ్య వసూళ్లను నమోదు చేస్తోంది. మొదటి రోజు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 29.17 కోట్ల రూపాయల షేర్ సాధించింది. అందులో తెలుగు రాష్ట్రాల వాటా 20.3 కోట్ల రూపాయలు. ఇది అల్లు అర్జున్ కెరీర్‌లో టాప్. అయితే 'సరిలేరు నీకెవ్వరు' తొలి రోజు వసూళ్లతో పోలిస్తే ఇది తక్కువే. దీనికి కారణం మొదటి రోజు ఆ సినిమా కంటే థియేటర్లు తక్కువ సంఖ్యలో లభించడమేనని విశ్లేషకులు తెలిపారు. ఏదేమైనా ఆద్యంతం వినోదాత్మకంగా సాగుతూ ఆహ్లాదపరచడంతో పాజిటివ్ టాక్ విస్తరించి రెండో రోజు నుంచీ మహేశ్ సినిమా కంటే ఎక్కువ వసూళ్లను సాధిస్తూ రావడం గమనార్హం. ఈ సినిమా మూడు రోజులకు 55.06 కోట్ల షేర్ సాధించింది. అంటే 'సరిలేరు నీకెవ్వరు' కంటే 3 కోట్ల రూపాయలు ఎక్కువన్న మాట. ఈ సినిమా 5 రోజుల వసూళ్ల లెక్కలు ఇంకా స్పష్టం కాలేదు. కానీ ఆన్‌లైన్‌లో ఈ మూవీ టికెట్లకు కనిపిస్తోన్న భారీ డిమాండ్ చూస్తుంటే, బన్నీ సినిమాల్లో టాప్ పొజిషన్‌లో నిలవడం ఖాయంగా కనిపిస్తోంది. అలాగే టాలీవుడ్ టాప్ 5 గ్రాసర్స్‌లో ఒకటిగా నిలిచే అవకాశాలూ ఈ సినిమాకు ఉన్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ మూవీ ప్రొడ్యూసర్స్ రెండో రోజు నుంచే 'సంక్రాతి విన్నర్' అంటూ తమ ప్రకటనల్లో ప్రకటించుకుంటూ వస్తున్నారు. ఏదేమైనా ఈ రెండు సినిమాలు తొలి మూడు రోజుల్లో సంయుక్తంగా 107 కోట్ల షేర్ సాధించడం పెద్ద విశేషం. వీటిలో ఏది అసలు విజేతో మొదటివారం వసూళ్లతో తేలనున్నది.


Cinema GalleriesLatest News


Video-Gossips