'శ్రీదేవి బంగ్లా'పై బోనీ కపూర్ సీరియస్ యాక్షన్!
on Aug 21, 2019
'వింక్ క్వీన్' ప్రియా ప్రకాశ్ వారియర్ ప్రధాన పాత్ర పోషిస్తోన్న 'శ్రీదేవి బంగ్లా' ఫస్ట్ లుక్ టీజర్ రిలీజైన దగ్గర్నుంచి వివాదాలు మొదలయ్యాయి. ఆ సినిమాలోని కంటెంట్, టైటిల్లో దివంగత శ్రీదేవి పేరు ఉపయోగించడం వివాదాలకు మూలం. ఆ టీజర్‌లోని ఒక సీన్లో ప్రియా వారియర్ బాత్‌టబ్‌లో పడుకొని ఉన్నట్లు కనిపిస్తుంది. అది శ్రీదేవి విషాదాంత ఘటనను గుర్తు చేస్తోందనడంలో సందేహానికి తావులేదు. ఆ టీజర్ వచ్చాక శ్రీదేవి భర్త, నిర్మాత బోనీ కపూర్ ఆవేదనకు గురయ్యారు. సినిమా టైటిల్‌పై అభ్యంతరాలు వ్యక్తం చేశారు.
ఆ వెంటనే ఆయన 'శ్రీదేవి బంగ్లా' నిర్మాతకు లీగల్ నోటీసును పంపారు. కానీ ఆ నిర్మాత స్పందించలేదు. దాంతో మరింత కఠినమైన లీగల్ యాక్షన్‌కు బోనీ సిద్ధమవుతున్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. "ఇది స్వేచ్ఛా ప్రపంచం కాబట్టి సినిమాని వాళ్లిష్టం వచ్చినట్లు తీసుకోనివ్వండి.. కానీ శ్రీదేవి పేరును వాళ్లు ఉపయోగించడానికి వీల్లేదు" అని బోనీ చెప్పినట్లు ఆ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఈ వివాదంపై హీరోయిన్ ప్రియా వారియర్ మాట్లాడుతూ "అది డైరెక్టర్, ప్రొడ్యూసర్లకు సంబంధించిన విషయం. నేను వాళ్లిచ్చిన కేరెక్టర్‌ను పోషిస్తున్నానంతే. నిజానికి ఎవరి వ్యక్తిగత ఫీలింగ్స్‌ను బాధపెట్టడం మా ఉద్దేశం కాదు" అని తెలిపింది. 2018 ఫిబ్రవరిలో దుబాయ్‌లో ఒక ఫంక్షన్లో పాల్గొనేందుకు వెళ్లిన శ్రీదేవి, అక్కడి బాత్‌టబ్‌లో మునిగి మృతి చెందిన విషయం విదితమే.