ENGLISH | TELUGU  

బాలీవుడ్‌లో సంద‌డి చేసిన షేక్‌స్పియ‌ర్ నాట‌కాలు!

on Jul 7, 2020

 

'క‌బీర్ సింగ్‌'గా షాహిద్ క‌పూర్ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర రికార్డులు సృష్టించాడు. అత‌ని కెరీర్‌లోనే హ‌య్యెస్ట్ గ్రాస‌ర్‌గా ఆ సినిమా నిలిచింది. అది మ‌న విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను రాత్రికి రాత్రే స్టార్‌గా మార్చిన 'అర్జున్‌రెడ్డి' మూవీకి రీమేక్ కావ‌డం మ‌న‌కు గ‌ర్వ‌కార‌ణ‌మే. క‌బీర్ సింగ్ క్యారెక్ట‌ర్‌లో షాహిద్ బాగా రాణించాడు. కానీ అత‌డి న‌ట‌న గురించి చెప్పుకోవాల్సి వ‌స్తే.. మొద‌ట‌గా ప్ర‌స్తావించాల్సింది 'హైద‌ర్' (2014) మూవీని. అది రెగ్యుల‌ర్ ఫార్ములా సినిమా కాదు. షేక్‌స్పియ‌ర్ సుప్ర‌సిద్ధ నాట‌కం హామ్లెట్ ఆధారంగా విశాల్ భ‌ర‌ద్వాజ్ డైరెక్ట్ చేసిన చిత్రం. షేక్‌స్పియ‌ర్ నాట‌కాలంటే విశాల్‌కు పిచ్చి. ఆ నాట‌కాలు, వాటిలోని పాత్ర‌లు, స‌న్నివేశాలు అత‌డి మ‌న‌సులో నిరంత‌రం సంద‌డి చేస్తూనే ఉంటాయి. 'హైద‌ర్' కంటే ముందే 'మాక్‌బెత్' నాట‌కం ఆధారంగా 'మ‌ఖ్బూల్‌', 'ఒథెల్లో' ఆధారంగా 'ఓంకార' సినిమాలు రూపొందించి విజ‌యాలు సాధించాడు.

1. హైద‌ర్ (హామ్లెట్‌)

 

'హైద‌ర్‌'ను క‌శ్మీర్ నేప‌థ్యంలో డార్క్ డ్రామాగా తీశాడు విశాల్‌. ఇందులోని పాత్ర కోసం కెరీర్‌లో మొద‌టిసారిగా గుండు గీయించుకున్నాడు షాహిద్‌. రొమాంటిక్ కామెడీల‌తో గుర్తింపు తెచ్చుకున్న అత‌ను వాటికి పూర్తి భిన్న‌మైన సీరియ‌స్ రోల్‌లో ప్రేక్ష‌కుల‌కు ఓ కొత్త అనుభ‌వాన్ని ఇచ్చాడు. విశాల్ సినిమా 'మ‌ఖ్బూల్‌'లో ఉన్న‌త స్థాయి న‌ట‌న‌ను ప్రద‌ర్శించి అంద‌రి ప్ర‌శంస‌లూ అందుకున్న ట‌బు ఈ మూవీలో షాహిద్ స‌వ‌తి త‌ల్లిగా నెగ‌టివ్ ఛాయ‌లున్న ఓ ప‌వ‌ర్‌ఫుల్ రోల్ చేసింది. అప్ప‌టికే 'ఆషికి 2', 'ఏక్ విల‌న్' సినిమాల‌లో హీరోయిన్‌గా న‌టించి యువ‌త‌రం క‌ల‌ల‌రాణిగా మారిన శ్ర‌ద్ధా క‌పూర్ అర్షియా అనే రిపోర్ట‌ర్ క్యారెక్ట‌ర్ చేసింది.

2. మ‌ఖ్బూల్ (మాక్‌బెత్‌)

 

తొలిసారిగా షేక్‌స్పియ‌ర్ ర‌చ‌న‌తో విశాల్ భ‌ర‌ద్వాజ్ రూపొందించిన సినిమా 'మ‌ఖ్బూల్' (2004). ఆశ‌కీ, దురాశ‌కీ మ‌ధ్య ఉండే తేడాను చూపిస్తూ షేక్‌స్పియ‌ర్ ర‌చించిన 'మాక్‌బెత్' నాట‌కం దీనికి ఆధారం. ముంబై అండ‌ర్‌వ‌ర‌ల్డ్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రాన్ని రూపొందించాడు విశాల్‌. ఇర్ఫాన్ ఖాన్‌, పంక‌జ్ క‌పూర్‌, ట‌బు ప్ర‌ధాన పాత్ర‌ధారులైన ఈ చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఆశించినంత విజ‌యం సాధించ‌క‌పోయినా విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుంది. విశాల్‌కు అంత‌ర్జాతీయ గుర్తింపు తెచ్చిపెట్టింది. ఈ సినిమాలోని న‌ట‌న‌కు జాతీయ ఉత్త‌మ స‌హాయ‌న‌టుడి అవార్డుతో పాటు ఫిల్మ్‌ఫేర్ ఉత్త‌మ‌న‌టుడు (క్రిటిక్స్‌) అవార్డునూ అందుకున్నాడు పంక‌జ్ క‌పూర్‌.

3.  ఓంకార (ఒథెల్లో)

 

'మ‌ఖ్బూల్‌'తో సాధించ‌ని బాక్సాఫీస్ విజ‌యాన్ని 'ఓంకార' (2006)తో సాధించాడు విశాల్‌. 'ద ట్రాజెడీ ఆఫ్ ఒథెల్లో' క‌థ‌ను ఆనాటి బిహార్ నేప‌థ్యానికి అత‌ను జోడించిన తీరు ఎంతైనా ప్ర‌శంస‌నీయం. హీరోగా త‌న‌కంటూ మంచి గుర్తింపు ఉన్న సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో చేసిన ఈశ్వ‌ర్ త్యాగి అలియాస్ లంగ్డా త్యాగి క్యారెక్ట‌ర్ ఈ కాల‌పు క్రూర‌మైన విల‌న్ క్యారెక్ట‌ర్ల‌లో ఒక‌టిగా పేరు పొందింది. టైటిల్ రోల్‌లో అజ‌య్ దేవ్‌గ‌ణ్‌, అత‌ని జోడీగా చేసిన క‌రీనా క‌పూర్‌తో పాటు వివేక్ ఓబ‌రాయ్‌, బిపాషా బ‌సు కూడా త‌మ న‌ట‌న‌తో అంద‌రినీ మెప్పించారు. ఇక ఇందు అనే క్యారెక్ట‌ర్‌ను పోషించిన కొంక‌ణాసేన్ శ‌ర్మ ఉత్త‌మ స‌హాయ‌న‌టిగా ఇటు జాతీయ అవార్డునూ, అటు ఫిల్మ్‌ఫేర్ అవార్డునూ సొంతం చేసుకుంది. మ‌న‌దేశంలోనే కాకుండా అమెరికా, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలోనూ ఈ మూవీ జ‌నాద‌ర‌ణ పొంద‌డం విశేషం.

4. రామ్‌-లీలా (రోమియో జూలియ‌ట్‌)

 

విశాల్‌నే కాకుండా మ‌రికొంత‌మంది బాలీవుడ్ డైరెక్ట‌ర్ల‌నూ ప్ర‌భావితం చేశాడు 16వ శ‌తాబ్దానికి చెందిన మ‌హార‌చ‌యిత షేక్‌స్పియ‌ర్‌. ఆయ‌న ర‌చించిన రోమియో జూలియ‌ట్ ప్రేమ‌క‌థ‌ను 2013లో సంజ‌య్ లీలా భ‌న్సాలీ 'గోలియోం కా రాస్‌లీలా.. రామ్ లీలా'గా తెర‌పై అనువ‌దించాడు. ప్ర‌ధాన పాత్ర‌ల్లో ర‌ణ‌వీర్ సింగ్‌, దీపికా ప‌డుకోనే, అద‌ర‌గొట్టేశారు. ఆ త‌ర్వాత కాలంలో నిజ జీవితంలోనూ జంట‌గా మారిన ఆ ఇద్ద‌రూ ప్రేక్ష‌కుల‌కు క‌న్నుల‌పంట‌గా నిలిచారు. భారీ సెట్టింగుల‌తో, భారీ తారాగ‌ణంతో త‌యారైన ఈ సినిమా సునాయాసంగా రూ. 100 కోట్ల క్ల‌బ్బులో చేరింది. తెర‌మీద రోమియో, జూలియ‌ట్ పాత్ర‌ల‌ను పోషిస్తున్న‌ప్పుడే ర‌ణ‌వీర్‌, దీపిక ప్రేమ‌లో ప‌డ‌టం కాక‌తాళీయ‌మేనా?

5. ఇష‌క్‌జాదే (రోమియో జూలియ‌ట్‌)

 

2012లో వ‌చ్చిన 'ఇష‌క్‌జాదే' సినిమాకు ఆధారం కూడా రోమియో జూలియ‌ట్ క‌థే. హ‌బీబ్ ఫైజ‌ల్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో ప్రేమికులుగా అర్జున్ క‌పూర్‌, ప‌రిణీతి చోప్రా న‌టించారు. తొలి చిత్రంతోనే పెద్ద విజ‌యాన్ని అందుకున్నాడు అర్జున్‌.

6. 10ఎంఎల్ ల‌వ్ (ఎ మిడ్‌స‌మ్మ‌ర్ నైట్స్ డ్రీమ్‌)

 

2010లో వ‌చ్చిన '10ఎంఎల్ ల‌వ్‌'కు ఆధారం.. షేక్‌స్పియ‌ర్ మ‌రో నాట‌కం 'ఎ మిడ్‌స‌మ్మ‌ర్ నైట్స్ డ్రీమ్‌'. శ‌ర‌త్ క‌టారియా డైరెక్ట్ చేసిన ఈ మూవీలో పూర‌బ్ కోహ్లీ, టిస్కా చోప్రా, నీల్ భూపాలం, ర‌జ‌త్ క‌పూర్‌, తారాశ‌ర్మ ప్ర‌ధాన పాత్ర‌ధారులు. ఈ చిత్రం విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు పొందినా, ప్రేక్ష‌కాద‌ర‌ణ‌కు నోచుకోలేక‌పోయింది.

7. జాలిమ్ సౌదాగ‌ర్ (ద మ‌ర్చంట్ ఆఫ్ వెనిస్‌)

వాస్త‌వానికి షేక్‌స్పియ‌ర్ ర‌చ‌న‌ల‌పై బాలీవుడ్ డైరెక్ట‌ర్ల వ్యామోహం ఈనాటి కాదు. భార‌త్‌లో టాకీలు మొద‌లైన ద‌శాబ్దానికే ఆయ‌న నాట‌కం 'ద మ‌ర్చంట్ ఆఫ్ వెనిస్‌'ను 'జాలిమ్ సౌదాగ‌ర్' పేరుతో రూపొందించారు జె.జె. మ‌ద‌న్‌. క‌ల‌క‌త్తాకు చెందిన రాధా ఫిల్మ్ కంపెనీ నిర్మించిన ఈ సినిమాలో ఖ‌లీల్‌, క‌జ్జ‌న్‌, రాణీ ప్రేమ‌ల‌త ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు. అప్ప‌ట్నుంచీ నాలుగు ద‌శాబ్దాల పాటు షేక్‌స్పియ‌ర్ జోలికి వెళ్ల‌లేదు హిందీ ద‌ర్శ‌కులు.

8. అంగూర్ (కామెడీ ఆఫ్ ఎర్ర‌ర్స్‌)

 

సుప్ర‌పిద్ధ ద‌ర్శ‌కుడు గుల్జార్ 1982లో 'అంగూర్' అనే సినిమా తీశారు. ఇది 1963లో వ‌చ్చిన భ్రాంతి విలాస్ అనే బెంగాలీ కామెడీ సినిమాకు రీమేక్‌. ఆ సినిమాకు ఆధారం అదే పేరుతో ఈశ్వ‌ర‌చంద్ర విద్యాసాగ‌ర్ ర‌చించిన నాట‌కం ఆధారం అయితే, ఆ నాట‌కానికి ఆధారం షేక్‌స్పియ‌ర్ నాట‌కం 'కామెడీ ఆఫ్ ఎర్ర‌ర్స్‌'. తెర‌కెక్కించ‌డానికి ప‌దేళ్ల ముందే 'అంగూర్‌' స్క్రిప్టు రాసుకున్నారు గుల్జార్‌. ఈ మూవీలో ద్విపాత్ర‌లు పోషించిన సంజీవ్‌కుమార్ ప్రేక్ష‌కుల‌ను తెగ న‌వ్వించారు. మౌస‌మీ చ‌ట‌ర్జీ నాయిక‌గా న‌టించిన ఈ చిత్రంలో దేవేన్ వ‌ర్మ‌, అరుణా ఇరానీ, దీప్తి నావ‌ల్ కీల‌క పాత్ర‌లు చేశారు. గుల్జార్‌లో ఎంత‌టి విల‌క్ష‌ణ ద‌ర్శ‌కుడు దాగున్నాడ‌నేందుకు 'అంగూర్' నిఖార్స‌యిన నిద‌ర్శ‌నం.

- బుద్ధి య‌జ్ఞ‌మూర్తి


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.