ఎమోషన్స్ తో చెడుగుడు ఆడేసిన ‘బిగ్ బాస్’
on Sep 13, 2017
మంగళవారం ‘బిగ్ బాస్’ షో సూపర్... ఇది చాలామంది అభిప్రాయం. నిజంగా ఎమోషన్లతో చెడుగుడు ఆడేశాడు ‘బిగ్ బాస్’. చూసే ప్రేక్షకులు కూడా భావోద్వేగానికి లోనయ్యారంటే నమ్మండి. 58 రోజులుగా.. అయినవారికి దూరంగా.. తమకేం కాని వ్యక్తులతో బతుకుతున్న కంటెస్టంట్స్ కి... జీవితంలో మరిచిపోలేని అనుభూతిని ఇచ్చాడు బిగ్ బాస్. ఎడబాటు తర్వాత కలయికలోని ఆనందాన్ని రుచిచూపించాడు. ఇంతలోనే... సంతోషాన్ని క్షణభంగురం చేసి... వేదనకు గురి చేశాడు.
మంగళవారం ‘బిగ్ బాస్’ టాస్క్.....
‘బిగ్ బాస్’.. ‘ప్రీజ్’... అన్న వెంటనే... కంటెస్టంట్స్ ఫ్రీజ్ అయిపోవాలి. ‘స్లో మోషన్...’ అన్న వెంటనే స్లో మోషన్ గా బిహేవ్ చేయాలి. ‘ఫాస్ట్ ఫర్వాడ్..’ అన్న వెంటనే వేగంగా ఫార్వాడ్ అవుతూ ఉండాలి. ఇదనమాట టాస్క్. కంటెస్టంట్స్ అందరినీ ‘ఫ్రీజ్’ అన్నాడు ‘బిగ్ బాస్’.. అందరూ ఎక్కడున్నవాళ్లు అక్కడే ఫ్రీజై పోయారు. అప్పుడు జరిగింది.. ఆ అద్భుతం... ‘బిగ్ బాస్’ హౌజ్ తలుపులు తెరుచుకున్నాయ్. శివబాలాజీ భార్య... స్వప్నమాధురి హౌజ్ లోకి ఎంటరయ్యారు. ఫ్రీజ్ అయిపోయి ఉన్న భర్త వెనకగా వచ్చి.. ఒక్కసారిగా ఎదురు నిలిచారు. అంతే... శివబాలాజీ ముఖంగా పొద్దుతిరుగుడు పువ్వులా మారిపోయింది. తన సోల్ మెట్ ని చాలా రోజుల తర్వాత చేరువగా చూసిన శివబాలాజీ భావోద్వేగానికి లోనయ్యాడు. భార్యాభర్తలిద్దరూ ‘ఐ లవ్యూ’
అంటూ గెట్టిగా హగ్ చేసుకొని... కాసేపు అలా ఉండిపోయారు. నిజంగా మిగిలిన కంటెస్టెంట్స్ కూడా ఆ పరిణామంతో షాకైపోయారు. తేరుకోడానికి చాలా సేపు పట్టింది. తెలీకుండానే... అందరి కళ్లలోనూ ఆనందభాష్పాలు. ఇక టీవీలో చూస్తున్న వీక్షకుల గురించి చెప్పేదేముంటుంది? శివబాలాజీ, స్వప్నమాధురి కాసేపు హౌజ్ లోనే ముచ్చట్లాడుకున్నారు. ఇన్ని రోజులుగా చందమామతో పంపిన కబుర్లని గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత మిగిలిన కంటెస్టంట్స్ తో కూడా ముచ్చటించి.. స్వప్నమాధురి
వెళ్లిపోయారు. నిజంగా ఆ అమ్మాయి రాకతో.. ‘బిగ్ బాస్’ హౌజ్ కొత్త శోభను సంతరించుకుందనే చెప్పాలి.
ఆ తర్వాత మళ్లీ టాస్క్ మొదలైంది. ఆదర్ష్ సతీమణి కూడా అలాగే వచ్చి ఆదర్ష్ కి షాక్ ఇచ్చారు. ఆ షాక్ నుంచి ఆదర్ష్ తేరుకునే లోపే... ‘బిగ్ బాస్’ ఆదర్ష్ కి మరో షాక్ ఇచ్చాడు. వెంటనే... ఆమె హౌజ్ నుంచి పంపిచి వేశాడు. ప్రాణప్రదంగా ప్రేమించే భార్య.. మెరుపులా అలా కనిపించి, ఇలా మాయమవ్వడంతో ఆదర్ష్ కన్నీటి పర్యంతం అయ్యాడు. నిజంగా ఆ సంఘటన చూసేవారికి కూడా విషాదాన్నే మిగిల్చింది. మళ్లీ టాస్క్ మొదలైంది... ఈ దఫా.. ఫ్రీజ్ అయి ఉన్న కంటెస్టంట్స్ కి ఇంకో షాక్... ‘బిగ్
బాస్’ హౌజ్ తలుపు తెరుచుకున్నాయ్. అర్చన తల్లిగారు హౌజ్ లోకి అడుగుపెట్టారు. రెండు నెలల విరామం తర్వాత అమ్మని చూసి... అర్చన ఆనందభాష్ప పర్యంతం అయ్యింది. ఆ విధంగా... అటు కంటెస్టెంట్స్ తోనూ, ఇటు ప్రేక్షకులతోనూ ఓ రేంజ్ లో ఆడేసుకున్నాడు ‘బిగ్ బాస్’. ఎమోషన్లతో చెడుగుడు ఆడాడు. ‘బిగ్ బాస్’ షో మొదలైన తర్వాత... నంబర్ వన్ ఎపిసోడ్ అంటే.. ఇదే.