లాస్య ఎలిమినేషన్ అనూహ్యం.. అభిజీత్‌కు మార్గం సుగమం!
on Nov 23, 2020
అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న బిగ్ బాస్ తెలుగు 4 గ్రాండ్ ఫినాలేకు చేరువవుతోంది. డిసెంబర్ రెండో వారంలో ఈ ఫైనల్ ఉంటుందని భావిస్తున్నారు. సెప్టెంబర్ 6న మొదలైన ఈ షో మొదట్లో వీక్షకుల్ని అంతగా ఆకట్టుకోలేదు. అయితే క్రమక్రమంగా బిగ్ బాస్ హౌస్‌లో కంటెస్టెంట్ల మధ్య పోటీ తీవ్రమవడం, గేమ్స్‌లో వేడి పెరగడంతో టీఆర్పీ కూడా పెరుగుతూ వస్తోంది. విన్నర్ ట్రోఫీని ఎవరు ముద్దాడతారనే ఆసక్తి వీక్షకుల్లో వ్యక్తమవుతోంది. కాగా ఈ వీకెండ్ హౌస్ నుంచి లాస్య మంజునాథ్ ఎలిమినేట్ అవడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. టాప్ 5 కంటెస్టెంట్లలో ఒకరిగా ఆమెను అందరూ భావిస్తూ వచ్చారు. పాపులర్ టీవీ యాంకర్ అయిన లాస్య తన ఒక్కగానొక్క చిన్నారి కూతుర్ని ఇంట్లో వదిలి, హౌస్‌లోకి వచ్చిందనే విషయం ఆమెకు సానుభూతిగా మారి, వీక్షకుల నుంచి మద్దతు పొందుతూ వచ్చింది. నిజానికి నటి మోనాల్ ఈ వారం ఎలిమినేట్ అవుతుందని చాలా మంది అనుకున్నారు. అనూహ్యంగా లాస్య ఎలిమినేట్ అయింది. ఆమె బయటకు వచ్చేయడంతో హౌస్‌లో మిగిలిన కంటెస్టెంట్లు ఏడుగురే.
పోయిన వారం ఎలిమినేషన్‌కు ఆరుగురు కంటెస్టంట్లు నామినేట్ అయ్యారు. వారు.. సయ్యద్ సొహేల్, అభిజీత్, దేత్తడి హారిక, అరియానా, లాస్య, మోనాల్. శనివారం సొహేల్ సేవ్ అయినట్లు నాగార్జున ప్రకటించారు. ఆదివారం లాస్య ఎలిమినేషన్‌ను ప్రకటించారు. చివరిసారిగా కంటెస్టంట్లతో మాట్లాడిన లాస్య.. బిగ్ బాంబ్‌ను అభిజీత్‌పై వేసింది. అంటే ఇతర హౌస్‌మేట్స్‌కు అతను వండి పెట్టాలి.
ఈ మధ్యలో హారిక, అభిజీత్, అఖిల్ కెప్టెన్సీ కోసం పోటీపడ్డారు. వాళ్లను సపోర్ట్ చేసే కంటెస్టెంట్లు వారిని తమ భుజాలపై మోయాలి. అఖిల్‌ను సొహేల్, అభిజీత్‌ను అవినాష్ మోశారు. హారికను మోనాల్ తన భుజాలపై మోసింది. ఆ టాస్క్‌లో మగవాళ్లిద్దరూ కిందపడిపోగా, హారిక కెప్టెన్ అయ్యింది.
శేఖర్ కమ్ముల మూవీ 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్'లో హీరోగా నటించిన అభిజీత్ బిగ్ బాస్ 4 విన్నర్ అవుతాడని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఆ మూవీలో అతని తల్లిగా నటించిన అమల సైతం అతనిపై ప్రశంసల జల్లు కురిపించి, అతనికి మద్దతుగా నిలవడం కూడా అతని పాపులారిటీని మరింత పెంచింది. శనివారం ఈ షోకు వచ్చిన కంటెస్టంట్ల కుటుంబసభ్యులు టాప్ 5 ఫైనలిస్టుల్లో అతనిని కూడా తమ ఓట్లతో చేర్చారు. దీని తర్వాత అతని ఫ్యాన్స్ ట్విట్టర్లో #WeAdmireAbhijeet అనే హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండింగ్‌లోకి తెచ్చారు. వీటన్నింటినీ చూస్తుంటే ఇప్పటికే విన్నర్ ట్రోఫీ అభిజీత్ కోసం సిద్ధమైనట్లేనని చాలా మంది భావిస్తున్నారు.
Also Read