బిచ్చగాడు' సీక్వెల్ స్టోరీ రాస్తున్న హీరో
on May 27, 2020
విజయ్ ఆంటోని మ్యూజిక్ డైరెక్టర్. తమిళ సినిమా ఇండస్ట్రీలోకి సంగీత దర్శకుడిగా అడుగుపెట్టాడు. తెలుగులోకి సంగీత దర్శకుడిగానే వచ్చాడు. తర్వాత కథానాయకుడిగా మారాడు. తాను నటించే సినిమాలకు తానే డబ్బులు పెడుతూ నిర్మాతగానూ మారాడు. ఇప్పుడు అతను రచయితగా మారుతున్నాడు. బిచ్చగాడు సీక్వెల్ స్టోరీ రాస్తున్నట్టు తెలిపాడు.
తెలుగునాట ఏమాత్రం అంచనాలు లేకుండా విడుదలైన బిచ్చగాడు అనూహ్యంగా భారీ విజయం సాధించింది. డబ్బింగ్ నిర్మాతలకు కాసుల పంట పండించింది. హీరోగా విజయ్ అంటోనీకి తెలుగులో మార్కెట్ క్రియేట్ చేసింది. ఆ సినిమాకు శశి దర్శకత్వం వహించారు. సీక్వెల్ కి సైతం ఆయనే దర్శకత్వం వహిస్తారని విజయ్ ఆంటోనీ తెలిపాడు. ప్రస్తుతం అతడు రెండు సినిమాలు చేస్తున్నాడు. అవి కంప్లీట్ అయిన తర్వాత బిచ్చగాడు సీక్వెల్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ మధ్య తన సినిమాలకు ఇతర సంగీత దర్శకులను తీసుకుంటున్న విజయ్ ఆంటోనీ, ఈ సినిమాకి మాత్రం తనే సంగీతం అందించవచ్చని చెబుతున్నాడు.
బిచ్చగాడు తర్వాత తెలుగులో విజయ్ ఆంటోనీ సినిమాలు కొన్ని ఓ మోస్తారు విజయాలు సాధించాయి. కానీ, బిచ్చగాడు స్థాయి విజయం ఏదీ అందుకోలేదు. సీక్వెల్ అయినా మళ్లీ ఆ స్థాయి విజయం అందిస్తుంది ఏమో .