భరత్ అనే నేను సెన్సార్ రివ్యూ!
on Apr 17, 2018
మరికొద్ది గంటల్లో వెండి తెరపై ఓ స్టైలిష్ ముఖ్యమంత్రిని చూడబోతున్నాం. భరత్ అనే నేనులో మహేష్ బాబు ముఖ్యమంత్రిగా కనిపించబోతున్న సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈనెల 20న బాక్సాఫీసు ముందుకు రాబోతోంది. మహేష్ - కొరటాల కాంబినేషన్లో వచ్చిన శ్రీమంతుడు సూపర్ డూపర్ హిట్టయ్యింది. ఈనేపథ్యంలో భరత్ అనే నేనుపై కూడా భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుంది. మరి సెన్సార్ టాక్ ఏమిటి? ఈ సినిమా ఎలా ఉండబోతోంది?
* భరత్ అనే నేను ఓ పొలిటికల్ డ్రామా. ముఖ్యమంత్రి కుమారుడు అనుకోకుండా.. ముఖ్యమంత్రి పీఠంలో కూర్చోవాల్సివస్తుంది. అప్పటి నుంచి అతనికి ఎదురైన పరిస్థితులు, రాజకీయ పరంగా తను ఎదుర్కున్న కుట్రలు కుతంత్రాలు, ప్రజలకు తను చేసిన సేవ.. అతని ప్రేమకథ... వీటి నేపథ్యంలో సాగే కథ ఇది.
* హీరో హీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్ చాలా ఆసక్తికరంగా సాగుతుందని, ప్రేమకథని కూడా చాలా హుందాగా చూపించాడని తెలుస్తుంది.
* ఈ సినిమాలో ఉన్నవి మూడే మూడు ఫైట్లు. వాటిని తీర్చిదిద్దిన విధానం చాలా స్టైలీష్‌గా ఉండబోతోందట. ముఖ్యమంత్రి ఫైట్లు చేయడం ఏమిటి? అనే లాజిక్కులు ఎవ్వరూ ఎత్తని విధంగా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేశాడట.
* విశ్రాంతి ముందు ఓ ట్విస్టు వస్తుంది. అది... ఎవరూ ఊహించనిదే. ముఖ్యమంత్రి పదవిని భరత్ వదులుకోవాల్సిన పరస్థితి రావడమే ఈ సినిమాకి ఇంట్రవెల్ బ్యాంగ్
* భరత్ రాజీనామా చేసి మళ్లీ ఎన్నికల్లో నిలబడి.. గెలవడం సెకండాఫ్. ద్వితీయార్థంలో ఎమోషన్ సీన్లు బలంగా రాసుకున్నాడట. కార్పొరేట్ కాలేజీల డొల్లతనం బయటపెట్టాడని, ఓ చోట రైతుల సమస్య గురించి మాట్లాడాడని, జర్నలిజం విలువల గురించి కూడా భరత్ క్లాసు పీకుతాడని తెలుస్తోంది.
* అక్కడక్కడ శేఖర్ కమ్ముల తీసిన లీడర్ ఛాయలు కనిపించాయట. అయితే.. ఆ పాయింట్ నే చాలా తెలివిగా డీల్ చేసి కొత్త కథ అనిపించాడట. సినిమా మొత్తంలో ఎక్కడా బోర్ కొట్టించే సీన్లు లేవని, దేవిశ్రీ ప్రసాద్ నేపథ్య సంగీతం అదరగొట్టేశాడని, టెక్నికల్‌గా ఈ సినిమా చాలా బాగుందని చెబుతున్నారు. అంతేకాదు.. కొరటాల శివ మరోసారి డైలాగులతో చప్పట్లు కొట్టించేలా చేశాడట. మొత్తానికి భరత్ అనే నేనుకి చాలా పాజిటీవ్ టాకే వినిపిస్తోంది. అదే నిజమైతే ఈ వేసవిలో మరో సూపర్ హిట్ సినిమా చూసినట్టే.