English | Telugu

భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు రివ్యూ

on Dec 6, 2019

నటీనటులు: శ్రీనివాసరెడ్డి, సత్య, 'షకలక' శంకర్, 'వెన్నెల' కిషోర్, 'చిత్రం' శీను, షాలు చౌరాసియా, రఘుబాబు, ప్రవీణ్, సుజిత్ తదితరులు 
సినిమాటోగ్రఫీ: భరణి కె. ధరన్ 
సంగీతం: సాకేత్ కొమండూరి
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: పరమ్ సూర్యన్షు
నిర్మాణం, దర్శకత్వం: వై. శ్రీనివాసరెడ్డి
విడుదల తేదీ: 06 డిసెంబర్ 2019

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో దర్శకులుగా విజయం సాధించిన హాస్యనటులను వేళ్లమీద లెక్క పెట్టాలని ప్రయత్నించినా ఫలితం దక్కదు. 'వెన్నెల వన్ అండ్ హాఫ్', 'జఫ్ఫా' చిత్రాలకు 'వెన్నెల' కిషోర్ దర్శకత్వం వహించారు. రెండూ ఆడలేదు. 'కొడుకు' చిత్రానికి ఎంఎస్ నారాయణ దర్శకత్వం వహించారు. అదీ ప్లాప్. మరో హాస్యనటుడు ఏవీఎస్ కూడా దర్శకుడిగా విజయాలు అందుకోలేదు. దర్శకులుగా విజయాలు సాధించిన హాస్యనటులు ఎవరైనా ఉన్నారేమో? 'భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు'తో దర్శకుడిగా, నిర్మాతగా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చారు శ్రీనివాసరెడ్డి. ఆయన విజయం అందుకుంటారా? లేదా?

కథ: శ్రీనివాసరెడ్డి (శ్రీనివాసరెడ్డి), పీటర్ ('షకలక' శంకర్), జోజో (సత్య) స్నేహితులు. ముగ్గురు కలిసి షార్ట్ ఫిలిమ్స్ చేస్తుంటారు. ఒకరోజు బర్మా లాటరీలో రెండు కోట్లు తగిలిందని తెలుస్తుంది. కానీ, లాటరీ టికెట్ వాళ్ల దగ్గర ఉండదు. ఓ షార్ట్ ఫిలిం తీసేటప్పుడు ఒక ఆర్టిస్ట్ వేసుకున్న కోటులో పెడతారు. ఆ కోటును తన మావయ్య డ్రై క్లీనింగ్ షాపుకు ఎవరో తీసుకొస్తే... షూటింగుకు తీసుకొస్తాడు పీటర్. రెండు కోట్లు లాటరీ తగలడంతో కోటు, టికెట్ కోసం ముగ్గురు స్నేహితులు అన్వేషణ మొదలుపెడతారు. కోటును వెతికే క్రమంలో ఒక డ్రగ్స్ కేసులో పోలీసులు వీళ్లను అరెస్ట్ చేస్తారు. కోటును వెతుకుతున్న వీళ్ళకు, డ్రగ్స్ సరఫరాకు ఉపయోగించిన కారు ఎక్కడ, ఎలా దొరికింది? అరెస్ట్ చేసిన తర్వాత ఈ ముగ్గురినీ ఏసీపీ స్వతంత్రకుమార్ ('వెన్నెల' కిషోర్) ఎలా ఇంటరాగేట్ చేశారు? చివరకు, కేసు నుండి ఎలా బయట పడ్డారు? మధ్యలో కోకిల (షాలు చౌరాసియా) ఎవరు? అనేది సినిమా. 


విశ్లేషణ: కర్ణుడి చావుకు వంద కారణాలు అన్నట్టు... ఈ సినిమాలో వినోదం వర్కవుట్ కాకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోవలసింది... శ్రీనివాసరెడ్డి దర్శకత్వం గురించి! పలు సినిమాల్లో కామెడీ సీన్స్ చేసిన అతడికి, దర్శకత్వం చేసేటప్పుడు సన్నివేశంలో కామెడీ ఉందో? లేదో? తెలుసుకోలేకపోవడం శోచనీయం. కామెడీ వర్కవుట్ అవుతుందా? లేదా? అని ఆలోచించకుండా రాసింది తీసుకుంటూ వెళ్ళిపోయాడు. నటుడిగా, దర్శకుడిగా మాత్రమే కాదు... నిర్మాతగానూ ఈ కథను శ్రీనివాసరెడ్డి అంచనా వేయలేకపోయారు. 

కికి ఛాలెంజ్ నుండి ప్రియా ప్రకాష్ వారియర్ వింక్ మూమెంట్ వరకూ సోషల్ మీడియాలో వైరల్ అయిన ఎన్నో మూమెంట్స్... శివాజీ 'ఆపరేషన్ గరుడ' నుండి 'బతుకు జట్కా బండి' వరకూ టీవీ స్క్రీన్ మీద జనాలను ఆకర్షించిన అంశాలకు స్కిప్ర్ట్ లో చోటు కల్పించారు. ఒక్క 'బతుకు ఎడ్లబండి' ఎపిసోడ్ మినహా ఏదీ నవ్వించలేదు. విసుగుపుట్టించే సన్నివేశాలు చూసి చూసి, పతాక సన్నివేశాల్లో 'ఖలేజా'లో మహేష్ మోషన్ సీన్ కి పేరడీ టైపులో 'రసగుల్లా' సీన్ వస్తే... ఈ సినిమాలో ఇదొక హైలైట్ అనుకోవడం తప్ప ఏమీ చేయలేము. ఎవరైనా మంచి రైటర్, డైరెక్టర్ చేతిలో పడితే 'సుడిగాడు' టైపులో ప్రేక్షకులను నవ్వించే కాన్సెప్ట్ ఇది. కానీ, నాసిరకం డైలాగులు, సన్నివేశాలకు తోడు శ్రీనివాసరెడ్డి దర్శకత్వంతో ఏమాత్రం నవ్వులు లేకుండా తీశారు. 

బురఖాలు వేసుకుని అమ్మాయిల హాస్టల్ లోకి వెళ్లిపోవచ్చనే భ్రమలో ఇంకా రచయిత, దర్శకుడు ఉన్నారు. సినిమా బావున్నప్పుడు, వినోదం పండినప్పుడు ఇటువంటి లాజిక్కులు ఎవరికీ గుర్తుకు రావు. కథతో, తెరపై పాత్రలతో పాటు ప్రేక్షకుడు ప్రయాణించలేనప్పుడు ప్రతిదీ లెక్కలోకి వస్తుంది. సినిమాలో చివర్లో పాట పెడితే బాగోదని డైలాగ్ చెప్పించిన శ్రీనివాసరెడ్డి, సినిమాలో మధ్యలో పాటలు అవసరం లేదని ఎందుకు తెలుసుకోలేకపోయారో? పాటలు, నేపథ్య సంగీతం... రెండూ బాగోలేదు. నిర్మాణ విలువలు అంతంత మాత్రంగా ఉన్నాయి. వాటికి తగ్గట్టు సాంకేతిక నిపుణుల పనితీరు ఉంది. 

ప్లస్ పాయింట్స్:
బతుకు ఎడ్లబండి సీన్

మైనస్ పాయింట్స్:
స్పూఫ్ కామెడీ పేలలేదు
కథ, దర్శకత్వం
క్యారెక్టరైజేషన్లు
డైలాగులు, సన్నివేశాలు

నటీనటులు: నటుడిగా శ్రీనివాసరెడ్డి కొత్తగా చేసిందేమీ లేదు. అలాగని, ప్రేక్షకులను నవ్వించిందీ లేదు. రోజు రోజుకీ సత్య నటన పరమ రొటీన్ అయిపోతుంది. ముగ్గురిలో 'షకలక' శంకర్ ఒక్కడే పర్వాలేదని అనిపించాడు. అదీ 'బతుకు జట్కా బండి' ఎపిసోడ్ వల్ల. బ్యాడ్ ఫిలిమ్స్ లో కూడా తన కామెడీ టైమింగ్ తో నవ్వించే 'వెన్నెల' కిషోర్, ఈ సినిమాలో క్యారెక్టరైజేషన్ వల్ల కామ్ అయిపోయాడు. మిగతా నటీనటులు ఏదో చేశారంటే... చేశారంతే.

తెలుగుఒన్ ప్రోస్పెక్టివ్:
బుల్లితెరపై బోల్డన్ని కామెడీ షోలు ఉన్నాయి. ఇప్పుడు అవి చూసి నవ్వుకుంటున్న ప్రేక్షకులు, కేవలం నవ్వుకోవడం కోసం థియేటర్లకు రావాలంటే... సినిమాలో అంతకు మించి కామెడీ ఉండాలి. కథ, కామెడీ, డైలాగులు... బుల్లితెర షోలను తలదన్నేలా ఉండాలి. ఈ సినిమాలో అవేవీ లేవు. కనీసం టీవీ కామెడీ షో టైపులో కూడా లేదు. అందువల్ల, ఈ సినిమాకు వెళ్లడం కంటే శుక్రవారం సాయంత్రం టీవిలో వచ్చే షో చూడడం మంచిది. దర్శకులుగా పరాజయాలను తమ ఖాతాల్లో వేసుకున్న హాస్యనటులు జాబితాలో శ్రీనివాసరెడ్డి చేరడం గ్యారెంటీ.

రేటింగ్: 0.5/5


Cinema GalleriesLatest News


Video-Gossips