బంగారు బుల్లోడి బంగారం కష్టాలు!
on Jun 30, 2020
కింగ్ ఆఫ్ కామెడీ టైమింగ్ అల్లరి నరేష్ బర్త్‌డే సందర్భంగా ఆయన టైటిల్ రోల్ పోషిస్తోన్న 'బంగారు బుల్లోడు' సినిమా టీజర్ జూన్ 30 మధ్యాహ్నం 3:06 గంటలకు విడుదలయ్యింది. పి.వి. గిరి దర్శకత్వంలో ఎ.కె. ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అల్లరి నరేష్ సరసన నాయికగా అందాల తార పూజా ఝవేరి నటిస్తోంది.
ఒక నిమిషం నిడివి కలిగిన ఈ టీజర్ ద్వారా 'బంగారు బుల్లోడు' చిత్రం ఆద్యంతం మనల్ని నవ్వుల్లో ముంచెత్తుందని అర్థమవుతోంది. కామెడీ టైమింగ్‌లో తాను కింగ్‌నని మరోసారి ఈ చిత్రంతో అల్లరి నరేష్ నిరూపించబోతున్నారు. ఆయన ఒక బ్యాంక్ ఉద్యోగి అనీ, ఆ బ్యాంక్ లాకర్లో ఉండే బంగారు నగల చుట్టూ ఈ సినిమా కథ నడుస్తుందనీ టీజర్ ద్వారా చెప్పకనే చెప్పారు. సస్పెన్స్, సెంటిమెంట్ అంశాలు మేళవించిన కామెడీ ఎంటర్టైనర్గా ఈ సినిమా రూపొందుతోంది.
కస్టమర్లు లాకర్లలో దాచిపెట్టుకొనే బంగారు ఆభరణాలను బ్యాంక్ మేనేజర్ పృథ్వీ, అల్లరి నరేష్ తమ ఇళ్లల్లోని ఆడవాళ్ల కోసం బయటకు తీసి, చిక్కుల్లో పడతారని తెలుస్తోంది. అలా మాయమైన బంగారు వస్తువుల కేసును దర్యాప్తు చేయడానికి ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ వస్తాడని అర్థమవుతోంది. ఆ ఇన్స్పెక్టర్గా అజయ్ ఘోష్ నటించగా, ఆ బంగారు వస్తువులతో సంబంధం ఉండే కీలక పాత్రల్లో పోసాని కృష్ణమురళి, వెన్నెల కిశోర్, ప్రవీణ్, ప్రభాస్ శ్రీను, సత్యం రాజేష్ కనిపించనున్నారు. అల్లరి నరేష్ తండ్రిగా ఒక సెంటిమెంట్ క్యారెక్టర్లో తనికెళ్ల భరణి నటిస్తున్నారు. సాయికార్తీక్ సంగీతం సమకూర్చిన పాటలతో పాటు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకోనున్నది.