ఎస్పీ బాలు కోసం బాలకృష్ణ ఏం చేస్తున్నారంటే?
on Sep 14, 2020
నందమూరి బాలకృష్ణది ఎంత మంచి మనసు, ఆయనది ఎంత గొప్ప వ్యక్తి అనేది చెప్పడానికి ఇదొక ఉదాహరణ. ఇండస్ట్రీ బాగోగుల కోసం బాలకృష్ణ ఎంత ఆలోచిస్తారని దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఒకరు చేసిన మంచి పనులు గురించి ప్రజలు చెప్పుకోవాలే తప్ప... చేసిన వాళ్ళు చెప్పుకోకూడదని పెద్దలు చెబుతుంటారు. గాన గాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం కోలుకోవాలని బాలకృష్ణ ఏం చేశారో చెప్పలేదు. ఆయన చేసిన మంచి గురించి ఎస్పీ బాలు బావ శుభలేఖ సుధాకర్ చెప్పడంతో ప్రజలకు తెలిసింది.
ఎస్పీబీ ఆరోగ్యం కోలుకోవాలని చాలామంది పూజలు చేయించారు. నందమూరి బాలకృష్ణ కూడా పూజలు చేయించారు. ఇప్పటికీ చేయిస్తూనే ఉన్నారు. అయితే ఆ విషయం ఆయన గోప్యంగా ఉంచడంతో ఎవరికీ తెలియలేదు. ఇప్పుడు శుభలేఖ సుధాకర్ చెప్పడంతో తెలిసింది.
"బాలకృష్ణ గారు నాకు ఫోన్ చేసి ఎస్పీ బాలు గారి గోత్రం, నక్షత్రం అడిగి తీసుకున్నారు. రోజు ఎస్పీబీ గారి పేరు మీద పూజలు చేయిస్తున్నారు. ప్రతిరోజూ ఆరోగ్యం ఎలా ఉంది అని అడిగి తెలుసుకుంటున్నారు" అని శుభలేఖ సుధాకర్ తాజా ఇంటర్వ్యూలో చెప్పారు. దీంతో మరోసారి బాలకృష్ణ గొప్ప వ్యక్తిత్వం అందరికీ తెలిసింది.
Also Read