బాహుబలితో జాగ్రత్త!
on Mar 18, 2017
టాలీవుడ్‌పై బాహుబలి ప్రభావం అంతా ఇంతా కాదు. బాహుబలి లాంటి సినిమా ఎప్పుడోగానీ రాదు. కానీ.. జనాలు మాత్రం మిగిలిన సినిమాల్ని బాహుబలితో పోల్చుకోవడం మొదలెట్టేశారు. మరీ ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్ తో పని పడ్డ ప్రతి సినిమానీ బాహుబలితో లింకు పెట్టి పోల్చుకొంటున్నారు. విజయ్ నటించిన పులి... బాహుబలి తరవాతే విడులైంది. పులిలోనూ విజువల్ ఎఫెక్ట్స్ కోసం భారీగా ఖర్చు పెట్టారు. కానీ అవి బాహుబలి ముందు తేలిపోయాయి. రుద్రమదేవిలో యుద్ధ సన్నివేశాలు చాలానే ఉన్నాయి. అయితే.. అవి కూడా బాహుబలి ముందు నిలవలేకపోయాయి. మేకింగ్ పరంగా.. బాహుబలితో పోటి పడలేక చాలా సినిమాలు చతికిల పడ్డాయి. ఇప్పుడు బాహుబలి 2 రాబోతోంది. ట్రైలర్ చూస్తుంటే బాహుబలి ది బిగినింగ్ కంటే, బాహుబలి ది కన్‌క్లూజన్‌లో పది రెట్లు ఎక్కువ విషయం ఉన్నట్టు కనిపిస్తోంది. దాన్ని బట్టి చూస్తే... పార్ట్ 2 విడుదలైన తరవాత విజువల్ ఎఫెక్ట్స్‌తో ముడిపడ్డ సినిమాలు తీయడానికి టాలీవుడ్లో ఎవ్వరికైనా చమటలు పట్టాల్సిందే అనిపిస్తోంది. బాహుబలి 2కి ముందూ తరవాత.. సినిమాలు విడుదల చేయాలన్నా భయమే. అందుకే బాహుబలి రిలీజ్‌కి రెండు వారాల ముందు... రిలీజ్ అయిన తరవాత నెల రోజుల వరకూ.. పెద్ద సినిమాలేవీ వచ్చే అవకాశం లేదు. బాహుబలి ది కన్‌క్లూజన్‌తో పోటీ పడదామనుకొన్న సినిమాలు కూడా ఇప్పుడు ట్రైలర్ చూశాక వెనక్కి వెళ్లిపోయాయని తెలుస్తోంది. మరి బాహుబలి ది కన్‌క్లూజన్ బయటకు వచ్చాక... ఇంకెన్ని సినిమాలు వాయిదా పడతాయో చూడాలి.