'పుష్ప' సెట్స్‌పై బన్నీ మొరటు అవతారం చూశారా?
on Nov 20, 2020
అల్లు అర్జున్ టైటిల్ రోల్ పోషిస్తోన్న 'పుష్ప' సినిమా షూటింగ్ గతవారమే తూర్పు గోదావరి జిల్లాల్లో మారేడుమిల్లి అడవుల్లో మొదలైంది. సుకుమార్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా షూటింగ్లో మొదటి రోజు నుంచే బన్నీ పాల్గొంటున్నాడు. అప్పుడే బన్నీ క్యారెక్టర్ లుక్‌ను నిర్మాతలు షేర్ చేశారు. నడచుకుంటూ వెళ్తున్న బన్నీని వెనుక నుంచి చూపిస్తున్న పిక్చర్ అది. దానికి "పుష్పరాజ్ వచ్చేసినాడు" అంటూ క్యాప్షన్ పెట్టారు. ఈ సినిమాలో పుష్పరాజ్ అనే ట్రక్ డ్రైవర్ క్యారెక్టర్‌ను బన్నీ చేస్తున్నాడు. ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే గ్యాంగ్ కింద పనిచేసే పాత్ర అది.
కాగా శుక్రవారం 'పుష్ప' సినిమా సెట్స్ మీద బన్నీ ఉన్న ఫొటోలు ఆన్లైన్లో లీక్ అయ్యాయి. ఆ లుక్‌లో చాలా మొరటోడిగా కనిపిస్తున్నాడు బన్నీ. షాట్ గ్యాప్‌లో యూనిట్ మెంబర్ ఒకరితో బన్నీ ఇంటరాక్ట్ అవుతున్నప్పటి పిక్చర్ అది. ఆ సమయంలో అక్కడ ఉన్న పలువురు క్రూ మెంబర్స్ తమ సెల్‌ఫోన్స్‌తో బన్నీని ఫొటోలు, వీడియోలు తీస్తున్నట్లు లీక్ అయిన ఫొటోల ద్వారా అర్థమవుతోంది. దుమ్ము కొట్టుకుపోయిన దుస్తులు, తైల సంస్కారం లేకుండా చింపిరిగా ఉన్న రూపంతో బన్నీ చాలా కొత్తగా కనిపిస్తున్నాడు. లీక్ అయిన ఈ ఫొటోలు ఇప్పుడు ఆన్లైన్లో హల్చల్ చేస్తున్నాయి.
'పుష్ప' షూటింగ్ ఎప్పుడో మార్చిలో మొదలు కావాల్సి ఉండగా మహమ్మారి దెబ్బకు ఆగిపోయి, ఇప్పుడు ఎట్టకేలకు మారేడుమిల్లి అడవుల్లో మొదలైంది. రష్మికా మందన్న నాయికగా నటిస్తోన్న ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఆర్య, ఆర్య 2 సినిమాల తర్వాత అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో తయారవుతున్న మూడో సినిమా 'పుష్ప'.
Also Read