కుంటాల జలపాతం దగ్గర ప్రత్యక్షమైన బన్నీ.. ఎగబడ్డ అభిమానులు!
on Sep 14, 2020
తెలంగాణలోనే ఎత్తైన జలపాతంగా పేరుపొందిన కుంటాల జలపాతంను తిలకించడానికి, 45 మీటర్ల ఎత్తు నుంచి జలజలపారే నీటి చప్పుడును వినడానికీ, ఆ జలపాతం ఉన్న అభయారణ్యం అందాన్ని చూడ్డానికీ ఎంతోమంది పర్యాటకులు వస్తుంటారు. ఈ ఆదివారం అలా వచ్చిన పర్యాటకుల్లో అల్లు అర్జున్ కుటుంబం కూడా ఉంది. మహమ్మారి కారణంగా విధించిన లాక్డౌన్ కాలం నుంచీ ఇంటికే పరిమితమైన బన్నీ.. కాస్త బయటకు రావాలని నిర్ణయించుకున్నప్పుడు భార్య స్నేహారెడ్డి ఇచ్చిన సలహా కుంటాల జలపాతంను చూడాలని.
దాంతో భార్యా పిల్లలను తీసుకొని ఆదిలాబాద్ జిల్లాలోని సహ్యాద్రి పర్వత పంక్తుల్లో ఉన్న కుంటాల వద్దకు రోడ్డు మార్గాన తన కారులో వెళ్లాడు బన్నీ. ఆ జలపాతం సొగసును కనులారా వీక్షించాడు. ఈ సందర్భంగా అక్కడి అధికారులు అతడి ఫ్యామిలీకి ప్రత్యేక మర్యాదలు చేశారు. కాగా తమ అభిమాన హీరో కళ్లముందు హఠాత్తుగా ప్రత్యక్షమవడంతో జనం అతడి దగ్గరకు పరుగెత్తుకుంటూ వచ్చారు. కొంతమందితో కరచాలనం కూడా చేసిన బన్నీ, అందరినీ విష్ చేశాడు.
బన్నీ ఇప్పటికీ 'పుష్ప' లుక్‌లోనే చింపిరిగా పెంచిన పొడవాటి జుట్టుతో కనిపించాడు. ముఖానికి "AA" అని ప్రింట్ చేసిన మాస్క్‌ను ధరించాడు. అతడికి సంబంధించిన కొన్ని పిక్చర్లను సెలబ్రిటీ మేనేజర్ కల్యాణ్ సుంకర తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా షేర్ చేశాడు. వాటిల్లో బన్నీ మాత్రమే కనిపిస్తున్నాడు.