'పుష్ప'లో బన్నీ లుక్ అదిరందప్పా!
on Apr 8, 2020
'సుకుమార్ సినిమాకు పెద్ద ప్లాన్ వేసిన అల్లు అర్జున్' శీర్షికన 'వివిధ భాషల్లో పాన్ ఇండియన్ లెవల్లో సుకుమార్ సినిమాను విడుదల చేయడానికి అల్లు అర్జున్ ప్లాన్ చేశాడు' అని ఫిబ్రవరిలో తెలుగువన్ చెప్పింది. ఈ రోజు అదే నిజమైంది. తెలుగు సహా మలయాళం, హిందీ, కన్నడ, తమిళ భాషల్లో సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేశారు.
'ఆర్య', 'ఆర్య 2' తర్వాత స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాకి 'పుష్ప' టైటిల్ ఖరారు చేశారు. బుధవారం (ఏప్రిల్ 8న) హీరో పుట్టినరోజు సందర్భంగా టైటిల్ ప్రకటించడంతో పాటు ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఏమాటకు ఆమాటే చెప్పుకోవాలి... మాసీ లుక్‌లో మాంచి ఫిరోషియస్ ఎక్స్ప్రెషన్లో అల్లు అర్జున్ బావున్నాడు. అభిమానులకు ఈ లుక్ కిక్ ఇస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అల్లు అర్జున్ కొత్త లుక్ అదిరింది. 'అల... వైకుంఠపురములో' సినిమాలో క్లాస్ అండ్ స్టయిలిష్ లుక్‌లో కనిపించిన అల్లు అర్జున్, సుకుమార్ దర్శకత్వంలో నటిస్తున్న తాజా సినిమాకు మాస్ లుక్‌లోకి వచ్చాడు.
అంతకంటే ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే... పాన్ ఇండియన్ సినిమాగా 'పుష్ప'ను విడుదల చేయనున్నారు. తెలుగుతో పాటు మలయాళంలో అల్లు అర్జున్ సినిమాలకు మంచి మార్కెట్ ఉంటుంది. ఈ రెండు భాషలు సహా కన్నడ, తమిళం, హిందీలో సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అందుకు తగ్గట్టుగా ఆ భాషల్లో ఫస్ట్ లుక్ విడుదల చేశారు. అదీ సంగతి!