English | Telugu

'గంగుబాయ్'గా 'ఆర్ ఆర్ ఆర్' హీరోయిన్

on Oct 5, 2019

 

రాజమౌళి లేటెస్ట్ ఫిల్మ్ 'ఆర్ ఆర్ ఆర్'లో రాంచరణ్ జోడీగా నటిస్తోన్న బాలీవుడ్ బ్యూటీ అలియా భట్.. తాజాగా ఒక ప్రతిష్ఠాత్మక చిత్రంలో నటించే ఛాన్స్ దక్కించుకున్నదని సమాచారం. బాలీవుడ్ అగ్ర దర్శకుల్లో ఒకరైన సంజయ్ లీలా భన్సాలీ రూపొందించనున్న 'గంగుబాయ్' మూవీలో ఆమె టైటిల్ రోల్ చేయనున్నది. ఇది చాలాకాలంగా భన్సాలీ డ్రీమ్ ప్రాజెక్ట్. హుస్సేన్ జైదీ నవల 'మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై'లో వచ్చే ఒక పాత్ర పేరు గంగుబాయ్. ముంబై రెడ్ లైట్ ఏరియా కామాటిపురలో క్రూరమైన తార్పుడుగత్తెగా గంగుబాయ్ కేరెక్టర్ మనకు కనిపిస్తుంది. చూడ్డానికి మోడ్రన్‌గా కనిపించే అలియా.. ఆ కేరెక్టర్‌కు ఎలా సరిపోతుందనేది చాలామందికి వచ్చే సందేహం. కానీ ఇప్పటికే అలియాలో గంగుబాయ్‌ని భన్సాలీ చూశాడనీ, ఆమె రూపం ఆ కేరెక్టర్‌కు సరిగ్గా సరిపోతుందనే నిశ్చయానికి వచ్చే, అలియాను ఎంపిక చేశాడనీ ఆయన సన్నిహితులు చెబుతున్నారు. 

నిజానికి కొంత కాలం క్రితం ఈ మూవీని ప్రియాంకా చోప్రాతో తియ్యాలని భన్సాలీ భావించాడు. ఆ కథ తనకు బాగా నచ్చిందనీ, ప్రియాంకతో ఆ మూవీ చెయ్యాలనే ఉద్దేశంతో, ఆమెతో చర్చలు జరుపుతున్నాననీ గతంలో భన్సాలీ తెలియజేశాడు. అయితే.. ఆ తర్వాత ఒక సందర్భంలో ప్రియాంక మాట్లాడుతూ తాను కొత్తగా ఏ హిందీ సినిమాకూ సంతకం చెయ్యలేదని స్పష్టం చేసింది. తాను సంజయ్ లీలా భాన్సాలీ ఫ్యాన్ అనీ, ఆయన ఏ సినిమా తీసినా, ఆయనకు అభిమానిగా ఉంటాననీ చెప్పింది. ఏదైతేనేం.. 'గంగుబాయ్' రోల్‌ను ప్రియాంక చేయడం లేదని తేలిపోయింది.

అలియా, సల్మాన్ ఖాన్‌తో ఇదివరకే 'ఇన్షల్లా' అనే మరో ప్రాజెక్టును భన్సాలీ సంకల్పించాడు. ఆ మూవీ సెట్స్‌పైకి వెళ్లక ముందే 'గంగుబాయ్'గా ఆయన అలియాను ఎంపిక చేశాడని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. 'ఇన్షల్లా' కోసం నిర్వహించిన వర్క్‌షాప్‌లో అలియా డెడికేషన్, తపన, పనిపై ఆసక్తి చూసి, 'గంగుబాయ్'కు ఆమె సరిగ్గా సరిపోతుందని భావించాడు.

ఇటీవల 'ఇన్షల్లా' ప్రాజెక్ట్ అటకెక్కిందనే ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ నేపథ్యంలో 'గంగుబాయ్' మూవీని త్వరలోనే భన్సాలీ మొదలుపెట్టనున్నాడని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ మధ్యలో ఆయనను బాలీవుడ్ హాట్ పెయిర్ రణ్‌వీర్ సింగ్, దీపికా పడుకోనే వేర్వేరుగా కలవడంతో రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. చివరకు 'గంగుబాయ్'లో రణ్‌వీర్ ఒక కీలక కేరెక్టర్ చేయనున్నాడనే విషయం దగ్గర గాసిప్స్ ఆగాయి. మరైతే భన్సాలీని దీపిక ఎందుకు కలిసిందనే విషయం మాత్రం తేలలేదు. ఒక విషయం మాత్ర స్పష్టం. అతి త్వరలోనే 'గంగుబాయ్' ప్రాజెక్ట్ పట్టాలెక్కనున్నది.

ప్రస్తుతం అలియా భట్ చేతినిండా సినిమాలున్నాయి. 'సడక్ 2' మూవీలో ఆదిత్యరాయ్ కపూర్, సంజయ్ దత్, పూజా భట్‌తో కలిసి నటిస్తున్న ఆమె, 'బ్రహ్మాస్త్ర' సినిమాలో తన ప్రియుడు రణ్‌బీర్ కపూర్ జోడీగా నటిస్తోంది. వాటితో పాటు తెలుగు సినిమా 'ఆర్ ఆర్ ఆర్'కూ డేట్స్ అడ్జస్ట్ చేస్తూ వస్తోంది అలియా.


Also Read



Latest News



Customer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here