ముద్దివ్వడానికి సిగ్గుపడ్డ ఖిలాడీ కుమార్.. వదిలేసిన గాళ్‌ఫ్రెండ్!
on Jan 20, 2021
బాలీవుడ్ ఖిలాడీ కుమార్‌గా పేరుపొందిన అక్షయ్ కుమార్ ఇటీవలే ట్వింకిల్ ఖన్నాతో 20వ పెళ్లిరోజును సెలబ్రేట్ చేసుకున్నాడు. వారిది ప్రేమ వివాహమనే విషయం తెలిసిందే. ఆమె కంటే ముందు పలువురితో డేటింగ్ చేశాడంటూ అక్షయ్‌పై ఎన్నో రూమర్స్ వచ్చాయి. వాటిలో రవీనా టాండన్‌తో ప్రేమ వ్యవహారం బాగా ఫేమస్. కాగా ట్వింకిల్‌తో ప్రేమలో పడక ముందు తను ఇంకో అమ్మాయితో లవ్‌లో పడ్డాననీ, కానీ ఆమె తనను తిరస్కరించిందనీ అక్షయ్ వెల్లడించాడు. 'హౌస్‌ఫుల్ 4' మూవీ విడుదలకు ముందు ఆ సినిమా టీమ్‌తో కలిసి ద కపిల్ శర్మ షోలో పాల్గొన్నాడు అక్షయ్. అప్పుడు తన ఫస్ట్ డేట్ గురించిన స్టోరీని తనదైన ఫన్నీ స్టైల్లో అతను చెప్పాడు.
అప్పటి ఘటనను గుర్తుచేసుకున్న అక్షయ్, ఆమెతో తాను మూడు నాలుగు సార్లు డేటింగ్‌కు వెళ్లాననీ, ఓసారి ఆమెతో కలిసి సినిమా చూడ్డానికి వెళ్లాననీ, ఇంకోసారి భోజనం చెయ్యడానికి ఓ ఉడిపి హోటల్‌కు వెళ్లామనీ చెప్పాడు. అయితే తర్వాత ఆమె తనను వదిలేసిందని తెలిపాడు.
"సమస్య ఏమిటంటే, నేను బాగా మొహమాటస్తుడిని. నేను కనీసం ఆమె భుజం చుట్టూ చేయి వేయలేదు సరికదా, ఆమె చేతిని కూడా పట్టుకోలేదు. నేను తన చేతుల్ని నా చేతుల్లోకి తీసుకోవాలనీ, ముద్దు పెట్టుకోవాలని ఆశించింది. నేనెప్పుడూ అది చెయ్యలేదు. ఆమె నన్ను వదిలేసింది." అని చెప్పాడు అక్షయ్. అయితే ఆమె ఎవరనే విషయం మాత్రం అతను వెల్లడించలేదు. అంతే కాదు, ఈ ఉదంతం నుంచి ఏం నేర్చుకున్నారని అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా దాటవేశాడు కూడా. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.