నాగార్జున ఆమెకి ఏం చెప్పారండీ...!
on Sep 19, 2018
నటుడిగా, కథానాయకుడిగా నాగార్జున అనుభవం కంటే 'దేవదాస్' సినిమాలో ఆయనకు జోడీగా నటించిన కథానాయిక ఆకాంక్ష సింగ్ వయసు తక్కువే. నాగార్జున 'శివ' సినిమాతో 1989లో తెరంగేట్రం చేస్తే... ఆకాంక్ష సింగ్ 1990లో జన్మించింది. వీళ్ళిద్దరూ పక్క పక్కన నిలబడితే నాగార్జునకు ఆమె కంటే ఓ రెండు మూడేళ్లు పెద్దోడిగా కనిపిస్తారంతే. ఆయన్ను అందరూ మన్మథుడు అనేది అందుకనే కదా!! నాగార్జున, ఆకాంక్ష సింగ్ ఒక జంటగా... నాని, రష్మిక మరో జంటగా నటించిన 'దేవదాస్' పాటలు గురువారం విడుదల కానున్నాయి. సినిమా కూడా ఈ నెల 27న విడుదల కానుంది. 'మళ్ళీ రావా' తరవాత ఈ సినిమాతో తెలుగులో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటానని ఆకాంక్ష సింగ్ ధీమాగా చెబుతోంది. నాగార్జునతో నటించడం అదృష్టమని తెలిపింది.
నాగార్జునగారు ఎక్కడుంటే అక్కడ ఓ పాజిటివ్ వైబ్రేషన్ వుంటుందని ఆకాంక్ష తెలిపింది. షూటింగులో తనకు మన్మథుడు సలహాలు ఇచ్చేవారిని చెప్పింది. ఆకాంక్ష సింగ్ హిందీ అమ్మాయి. అందువల్ల, తెలుగు స్పష్టంగా పలకలేదు. అందుకని కొన్నిసార్లు షూటింగులో ఇబ్బంది పడుతుంటే గమనించిన నాగార్జున "అవుట్డోర్ షూటింగులో డైలాగులు గట్టిగా చెప్పకు. జస్ట్ లిప్‌సింక్ ఇస్తే చాలు" అని సలహా ఇచ్చారని తెలిపింది. అప్పటి నుంచి మరింత సులభంగా నటించానని, సంతోషంగా షూటింగ్ గడిచిందని పేర్కొంది.