తమిళ హీరో అజిత్‌కి గాయాలు
on Feb 19, 2020
తమిళ హీరో అజిత్ మంచి బైక్ రేసర్ కూడా. తన సినిమాల్లో స్టంట్స్, ముఖ్యంగా బైక్ ఛేజింగ్ సీక్వెన్సులు ఉంటే డూప్ లేకుండా చేయడం అజిత్‌కి అలవాటు. ఆయనే స్పీడుగా బైక్ నడుపుతూ స్టంట్స్ చేస్తారు. ఇంతకు ముందు చాలా సినిమాల్లో అలాగే చేశారు. ప్రస్తుతం సెట్స్ మీదున్న ఒక సినిమాలో బైక్ ఛేజింగ్ సీన్ తీస్తుండగా హీరోకి గాయాలు అయ్యాయట. అసలు వివరాల్లోకి వెళితే... కార్తీ హీరోగా వచ్చిన 'ఖాకి' సినిమా గుర్తుందా? ఆ సినిమా దర్శకుడు హెచ్. వినోద్ దర్శకత్వంలో అజిత్ ఒక సినిమా చేస్తున్నారు. ఇటీవల ఈ సినిమా షూటింగ్ చెన్నైలో జరిగింది. అజిత్ మీద ఒక యాక్షన్ సీక్వెన్స్ తీశారు. అందులో అజిత్ బైక్ రైడింగ్ చేస్తూ కనిపిస్తారు. షూటింగులో సడన్ గా బండి స్కిడ్ అవ్వడంతో అజిత్ భుజాలు, కాళ్లకు గాయాలు అయ్యాయని తెలిసింది. ఒక 20మినిట్స్ రెస్ట్ తీసుకుని అజిత్ మళ్లీ షూటింగ్ పూర్తి చేశాడని యూనిట్ సభ్యులు చెప్పారు. ఆ రోజు షూటింగ్ మొత్తం పూర్తయిన తర్వాతే ఫ్యామిలీ డాక్టర్ దగ్గరకు వెళ్లారట. కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలని అజిత్ కి వైద్యులు సూచించడంతో ప్రస్తుతం ఇంట్లో ఉంటున్నారు. ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ హైదరాబాద్ లో వచ్చే వారంలో మొదలు అవుతుందట.