గుళ్లూ గోపురాల చుట్టూ.. అభిమానులు!
on Sep 12, 2017
తమిళనాడులో అజిత్ అభిమానులు ప్రస్తుతం గుళ్లూ గోపురాల చుట్టూ తిరుగుతున్నారు. అజిత్ ఇంటిముందు కూడా ఒకటే హడావిడి. మరో వైపు హాస్పిటల్ దగ్గర కూడా ఇసుకేస్తే రాలనంత జనం. ఇంతకీ ఏమైందీ? అజిత్ ఆరోగ్యం ఎలా ఉంది? అనేగా మీ డౌట్. నిజమే.. అజిత్ ప్రస్తుతం హాస్పిటల్ లో ఉన్నాడు. భుజం శస్త్ర చికిత్స జరగడంతో బెడ్ రెస్ట్ లో ఉన్నాడు. అసలేం జరిగింది? అనే వివరాల్లోకెళ్తే.
‘వివేగం’ సినిమా షూటింగ్ లో భుజనాకి బలమైన దెబ్బ తగలడంతో షూటింగ్ కూడా ఆపేయాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ.. మనోడు అలాగే కష్టపడి సినిమా పూర్తి చేసేశాడు. దాంతో భుజం గాయం ముదిరి పాకాన పడింది. ఇక చేసేది లేక హాస్పిటల్ లో జాయిన్ అయ్యేసరికి కోసి కుట్లేయాల్సొచ్చింది. గోటితో పోయేదానికి... కత్తులు, సిజర్ల దాకా తెచ్చుకున్నాడు అజిత్. నిజానికి ఈ విషయాన్ని అభిమానులకు తెలీకుండా దాచాలనుకున్నాడు. కానీ.. ఆ చెవిని ఆ చెవిని దాటుకుంటూ... అభిమానుల చెవుల్లో పడింది. ఇంకేముందు.. ఇక తమిళుల వ్యక్తి పూజ ఏ స్థాయిలో ఉంటుందో తెలుసుగా? అండవనే... అండవనే... అంటూ హాస్పిటల్ చుట్టూ చేరారు.
అజిత్ వయసు కూడా చిన్నదేం కాదు. 50కి చేరువవుతున్నాడు. మరి అలాంటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి. కానీ మనోడు మాత్రం శరీరాన్ని అస్సలు పట్టించుకోడు. డూప్ లేకుండా యాక్షన్ సీన్లు చేయడానికే ఇష్టపడతాడు. ‘వివేగం’ సినిమాలో ఏకంగా గంటన్నర యాక్షన్ సీన్లున్న విషయం తెలిసిందే. తెరపై అజిత్ కష్టాన్ని చూసి తెలుగు వాళ్లే తెల్లబోయారు. ఇక తమిళ ప్రేక్షకుల సంగతి చెప్పేదేముంది.
అజిత్ కి దెబ్బలు తగలడం ఇది కొత్తేం కాదు. గతంలో చాలా దెబ్బలు తగిలాయ్. అంతెందుకు... అజత్ కి ‘వివేగం’ కథ చెప్పడానికి దర్శకుడు శివ వచ్చినప్పుడు... అజిత్ మోకాళ్ల ఆపరేషన్ చేయించుకొని ఉన్నాడు. ‘ఇలాంటి పరిస్థితుల్లో అజిత్ తో ‘వివేగం’ చేయడం అవసరమా?’ అనే అనుమానం కూడా శివకు వచ్చిందట. కానీ.. కథ విని ‘ఓకే’ చెప్పేసి, చేసేశాడు కూడా. అజిత్ ఇప్పుడు పూర్తి ఆరోగ్యంతో ఉన్నాడు. ఆపరేషన్ కూడా దిగ్విజయంగా పూర్తయిందని డాక్టర్లు చెప్పారు. దాంతో మొక్కులు తీర్చడానికి దేవాలయాల బాట పట్టారు అభిమానులు. అందండీ విషయం.