రానాతో 'ఏజెంట్...' దర్శకుడు?
on Jan 7, 2020
యంగ్ టాలెంట్ ను వెతికి మరీ పట్టుకోవడంలో టాలీవుడ్ లో సురేష్ ప్రొడక్షన్ సంస్థ ముందు ఉంటుంది. ఇతర నిర్మాతలు తీసిన చిన్న చిత్రాలు బావుంటే... విడుదల చేస్తుంది కూడా! సురేష్ ప్రొడక్షన్స్... సురేష్ బాబు సమర్పణలో ఈ మధ్య వచ్చిన చిన్న చిత్రాలు చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉన్నాయి. చిన్న సినిమాలో తీసి విజయాలు అందుకున్న ప్రతిభావంతులైన దర్శకులతో రానా లేదా సురేష్ బాబు సినిమాలు చేస్తున్నారు. 'పెళ్లి చూపులు తర్వాత తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో 'ఈ నగరానికి ఏమైంది' సినిమా నిర్మించారు. 'క్షణం' తర్వాత రవి పేరేపు దర్శకత్వంలో 'కృష్ణ అండ్ హిజ్ లీల' సినిమా నిర్మించారు. 'నీది నాది ఒకే కథ తీసిన దర్శకుడు వేణు ఊడుగులతో రానా 'విరాట పర్వం' సినిమా చేస్తున్నారు. లేటెస్ట్ టాక్ ఏంటంటే... 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' దర్శకుడు స్వరూప్ ఆర్ ఎస్ జెతో రానా ఒక సినిమా ప్లాన్ చేస్తున్నారట.
గతేడాది విడుదలైన సినిమాల్లో 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ'కు మంచి పేరు వచ్చింది. ఆల్ మోస్ట్ తెలుగు దర్శకులు చాలా రోజులుగా టచ్ చేయని డిటెక్టివ్ జోనర్ లో స్వరూప్ సినిమా తీశాడు. తీసి మెప్పించాడు. ఇటీవల రానాను అతడు కలిశాడనీ... ఇద్దరూ చాలా సేపు మాట్లాడుకున్నారనీ తెలిసింది. రానాకు స్వరూప ఒక లైన్ వినిపించాడట. డిస్కషన్స్ సక్సెస్ అయితే త్వరలో సినిమా తెరకెక్కే అవకాశం ఉంది.