English | Telugu

అదుగో మూవీ రివ్యూ

on Nov 7, 2018


 

 

నటీనటులు: ఓ పందిపిల్ల, అభిషేక్, నభా నటేష్, రవిబాబు తదితరులు
కెమెరా: ఎన్. సుధాకర్ రెడ్డి
సంగీతం: ప్రశాంత్ విహారి  
నిర్మాత‌: డి. సురేష్ బాబు
రచన, ద‌ర్శ‌క‌త్వం: రవిబాబు
విడుదల తేదీ: నవంబర్ 07, 2018

దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి ఏనుగును ప్రధాన పాత్రధారిగా 'రాజేంద్రుడు గజేంద్రుడు' సినిమా తీశారు. దర్శక ధీరుడు రాజమౌళి ఈగను పెట్టి 'ఈగ' తీశారు. పామును నాగదేవతగా కొలిచే భారతీయ సంప్రదాయంలో... పామును ఆధారంగా చేసుకుని పలువురు దర్శకులు సినిమాలు తీశారు. మూగజీవాలతో ప్రపంచంలో పలు భాషల్లో పలు సినిమాలు వచ్చాయి. అయితే.. భారతీయ సినిమాల్లో పందిని పెట్టి ఇప్పటివరకూ ఎవరూ సినిమా తీయలేదు. విభిన్న చిత్రాలతో ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రవిబాబు పందిపిల్లతో 'అదుగో' సినిమా తీశారు. ఈ రోజు విడుదలైన 'అదుగో' ఎలా ఉందో? తెలుసుకోండి.

క‌థ‌:

అనగనగనగా... ఓ పందిపిల్ల. దాని పేరు బంటీ! ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని అమరావతిలో చంటి అని ఓ పిల్లాడు బంటీని పెంచుకుంటున్నాడు. తెల్లటి బంటీ మీద మూడు నీలం రంగు పుట్టుమచ్చలు ఉంటాయి. హైద‌రాబాద్‌లో వివిధ జంతువుల‌తో రన్నింగ్ రేసులు, బెట్టింగులు నిర్వహించే ఒక క్లబ్బులో తదుపరి పోటీ పందిపిల్లల మధ్య వుంటుందని ప్రకటిస్తారు. మూడు పుట్టుమచ్చల పందిపిల్లతో పోటీలో పాల్గొంటే తనకు విజయం వరిస్తుందని సిద్ధాంతి చెప్పడంతో హైదరాబాద్‌లో అక్ర‌మ గుట్కా వ్యాపారం చేసే ఒక డాన్ రెండు తెలుగు రాష్ట్రాల్లో మనుషులను పెట్టించి పందిపిల్ల కోసం అన్వేషణ సాగిస్తాడు. అతడి ప్రయత్నాలు ఫలించి, అతడి మనుషులను బంటీ దొరుకుతుంది. వాళ్లు బంటీని కిడ్నాప్ చేస్తారు. వాళ్లు కిడ్నాప్‌కి ఉపయోగించిన వెహికల్ నంబర్ ఆధారంగా... బంటీ కోసం చంటి హైదరాబాద్ బయలుదేరతాడు.

గుట్కా డాన్ మనుషుల నుంచి మార్గమధ్యలో రియల్ ఎస్టేట్ మాఫియా పని మీద అమరావతి వచ్చిన హైదరాబాద్‌కి చెందిన 'సిక్స్‌ప్యాక్' శక్తి (రవిబాబు) బంటీని అపహరించుకు వెళతారు. అమరావతి రైతులను బెదిరించి 'బెజవాడ' దుర్గ వెయ్యి ఎకరాలు తన పేరును రాయించుకుంటే... ఆ వివరాలు వున్న మైక్రో చిప్‌ని తీసుకురమ్మని 'సిక్స్‌ప్యాక్' శక్తి తన మనుషులను పంపిస్తాడు. వాళ్లు చిప్‌ని అరటిపండులో పెడితే... దాన్ని బంటీ తినేస్తాడు. దాంతో పందిపిల్లను హైదరాబాద్ కొరియర్ చేస్తారు. శక్తి దగ్గరకు కొరియ‌ర్‌లో పందిపిల్ల బదులు కుక్కపిల్ల వస్తుంది. కుక్కపిల్ల వెళ్లాల్సిన అభిషేక్ (అభిషేక్ వర్మ) దగ్గరకు పందిపిల్ల వస్తుంది.

చిప్ కోసం ఓ పక్క శక్తి, మరోపక్క దుర్గ... పరుగు పందెంలో విజేతగా నిలవాలని పందిపిల్ల కోసం గుట్కా డాన్, దుబాయ్ షేకులకు అమ్మాయిలను సప్లై చేసే అతడి ప్రత్యర్థి... హైదరాబాద్ వచ్చిన బంటీ... అందరూ వెతుకుతారు. మనుషుల మధ్య పందిపిల్ల ఎన్ని కష్టాలు పడింది? మధ్యలో అభిషేక్ ప్రేయసి రాజీ (నభా నటేష్) పాత్ర ఏమిటి? చివరకు ఏమైంది? అనేది సినిమా!

విశ్లేషణ:

సినిమా అంతా 'గజిబిజి గందరగోళం... అతుకుల బొంత వ్యవహారం' అన్నట్టు వుంటుంది. పైన రాసిన కథ చదివితే ఎంత కంగాళీగా వుందో... కథను నడిపించిన తీరులోనూ అంతే కంగాళీ కనపడుతుంది. అసలు కథలో ఉప కథలు మరింత గందరగోళం సృష్టించాయి. ఆ కథలను కలిపిన విధానం అతుకుల బొంతలా వుంది. క‌న్ఫ్యూజ‌న్ కామెడీలో ఇదొక పద్ధతి అని ఎంత సర్ది చెప్పుకున్నా.. వున్నట్టుండి తెరపై పాత్రలు వస్తుంటే ప్రేక్షకులకు విసుగు రావడం సహజం. ప్రారంభం నుంచి ముగింపు వరకూ ప్రతి సన్నివేశం అసహజంగా వుంటుంది. రచయితగా, దర్శకుడిగా రవిబాబు మెప్పించిన సన్నివేశం ఏదైనా వుంటే... పతాక సన్నివేశంలో పందిపిల్ల ప్రతీకారం తీర్చుకునే సన్నివేశం ఒక్కటే! అంతకు ముందు మాత్రం ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించారు. కోపం వస్తే మనిషి చెవి కట్ చేసి ఫ్రై చేసుకుని తినడం ఏమిటో? దుబాయ్ షేకులకు అమ్మాయిలను సప్లై చేసే డాన్, ఇంట్లో పెళ్లానికి భయపడటం ఏమిటో? హీరోయిన్ నభా న‌టేష్‌తో రౌడీ గ్యాంగులో ఒకడు ఊహల్లో ప్రేమించుకోవడం ఏమిటో? గుట్కా డాను తన చంచాలపై మాట మాటకీ నోట్లో గుట్కాను ఉమ్మేయడం ఏమిటో? ఏదీ ఆకట్టుకోదు. 'అల్లరి' టైములో తీయవలసిన సినిమాను ఇప్పుడు తీసినట్టు అనిపిస్తుంది. బంటీ సెంటిమెంట్ సీన్లు అయితే అరాచకం! పందిపిల్లను కాస్తో కూస్తో ఆకట్టుకునేలా యానిమేషన్ చేయడాన్ని మెచ్చుకోవాలి.

ప్లస్ పాయింట్స్:

పందిపిల్లతో సినిమా ఎలా తీశారు? అని ప్రేక్షకుల్లో నెలకొన్న ఆసక్తి!
పందిపిల్ల యానిమేషన్

మైనస్ పాయింట్స్:

కథ, కథను నడిపించిన తీరు
కితకితలు పెట్టుకున్నా నవ్వురాని సన్నివేశాలు

నటీనటుల పనితీరు:
'నన్ను దోచుకుందువటే'తో తెలుగు తెరకు పరిచయమైన నభా నటేష్, ఆ సినిమా కంటే ముందు నటించిన చిత్రమిది. ఇప్పుడు సినిమా చూసుకుంటే 'నేను ఈ సినిమా ఎందుకు చేశానా?' అని బాధ పడటం గ్యారెంటీ. ఏమాత్రం విలువ లేని పాత్ర ఆమెది. రవిబాబుతో పాటు హీరోగా నటించిన అభిషేక్, ఇతర పాత్రధారులు పావ‌లాకు రూపాయి పావ‌లా యాక్టింగ్ చేశారు.   

చివరగా:
పందిపిల్ల కాన్సెప్ట్ ఏంటో తెలుసుకుందామ‌ని థియేటర్లలోకి అడుగు పెడితే... దీపావళినాడు వీధుల్లో పేలాల్సిన బాంబులు మెద‌డులో పెల‌తాయి. పదే పదే సౌండ్ గట్టిగా వస్తుంది... 'నేను ఎందుకీ సినిమాకు వచ్చానా?' అని! వీధిలో పందులు వస్తే జనాలు దూరంగా జరుగుతారు. ఈ సినిమాకూ అంతే దూరంగా వుండటం మంచిది.

రేటింగ్: 1

 

 


Also ReadLatest NewsCustomer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here