ENGLISH | TELUGU  

మ‌హేశ్ జోడీగా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన‌ హీరోయిన్లు!

on Jul 9, 2020

 

ప్రిన్స్ మ‌హేశ్ హీరోగా 1999లో కె. రాఘ‌వేంద్ర‌రావు డైరెక్ట్ చేసిన 'రాజ‌కుమారుడు' సినిమాతో ప‌రిచ‌య‌మ‌య్యాడు. కాల‌క్ర‌మంలో తండ్రి కృష్ణ‌కు త‌గిన వార‌సుడిగా సూప‌ర్‌స్టార్ అనిపించుకొని అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన 'స‌రిలేరు నీకెవ్వ‌రు' మూవీతో 21 సంవ‌త్స‌రాల్లో 26 సినిమాలు పూర్తి చేశాడు మ‌హేశ్‌. అత‌ని స‌ర‌స‌న జోడీగా ఇటు సౌత్ బ్యూటీలు, అటు నార్త్ హీరోయిన్లు న‌టించారు. వారిలో ఏడుగురు సుంద‌రాంగులు మ‌హేశ్ సినిమాల‌తోటే టాలీవుడ్‌కు ప‌రిచ‌య‌మ‌వ‌గా, వాళ్లంతా ఉత్త‌రాది భామ‌లే కావ‌డం విశేషం. వాళ్లెవ‌రు, ఇప్పుడు వాళ్ల స్థితి ఎలా ఉందో ఓ చూపు చూసేద్దాం...

1. న‌మ్ర‌తా శిరోద్క‌ర్ (వంశీ)


మ‌హేశ్ హీరోగా న‌టించిన మూడో సినిమా 'వంశీ' ద్వారా న‌మ్ర‌తా శిరోద్క‌ర్ తెలుగు చిత్ర‌సీమ‌లో అడుగుపెట్టింది. దాని త‌ర్వాత మ‌రో సినిమా మాత్ర‌మే ఆమె తెలుగులో చేసింది. అది మెగాస్టార్ చిరంజీవి స‌ర‌స‌న చేసిన 'అంజి'. ఆమె న‌టించగా విడుద‌లైన చివ‌రి సినిమా కూడా అదే. తెలుగులో త‌న తొలి సినిమా డిజాస్ట‌ర్ అయిన‌ప్ప‌టికీ, ఆ సినిమా హీరో మ‌హేశ్‌నే న‌మ్ర‌త పెళ్లి చేసుకోవ‌డం, త‌న తొలి టాలీవుడ్ డెబ్యూ హీరోయిన్‌నే మ‌హేశ్ పెళ్లాడ‌టం ఒక విశేషం. ఇద్ద‌రు పిల్ల‌లు.. గౌత‌మ్‌కృష్ణ‌, సితారల‌కు త‌ల్లిదండ్రులుగా ఆ ఇద్ద‌రి వైవాహిక బంధం అత్యంత ఆనంద‌క‌రంగా న‌డుస్తోంది. పెళ్లి త‌ర్వాత న‌ట‌న‌కు పూర్తిగా దూర‌మైంది న‌మ్ర‌త‌.

2. సోనాలీ బెంద్రే (మురారి)


కృష్ణ‌వంశీ డైరెక్ట్ చేసిన 'మురారి' మూవీ మ‌హేశ్ కెరీర్‌కు ఊత‌మివ్వ‌డ‌మే కాకుండా, సోనాలీ బెంద్రేతో అత‌డి జోడీ ప్రేక్ష‌కుల్ని అమితంగా ఆక‌ట్టుకుంది. సోనాలీ అంద‌చందాలు, న‌ట‌నా ప్ర‌తిభ‌కు ముగ్ధులైన ప్రేక్ష‌కులు ఆ త‌ర్వాత కూడా ఆమెను ఆద‌రించారు. 'ఇంద్ర', 'ఖ‌డ్గం', 'మ‌న్మ‌థుడు' చిత్రాలు అందుకు ఉదాహ‌ర‌ణ‌. తెలుగులో చిరంజీవితో చేసిన రెండో సినిమా 'శంక‌ర్‌దాదా ఎంబీబీఎస్' సైతం ఆమెకు మంచి పేరు తెచ్చింది. దాని త‌ర్వాత ఆమె సినిమాల‌కు స్వ‌స్తిచెప్పింది. అంత‌కు రెండేళ్ల క్రిత‌మే పెళ్లాడిన బాలీవుడ్ ప్రొడ్యూస‌ర్ గోల్డీ బెహ‌ల్‌తో జీవితంలో స్థిర‌ప‌డింది. స‌రిగ్గా రెండేళ్ల క్రితం త‌న‌కు కేన్సర్ అని వెల్ల‌డించిన ఆమె, ప్ర‌స్తుతం దాని నుంచి రిక‌వ‌ర్ అవుతోంది.

3. లీసా రే (ట‌క్క‌రి దొంగ‌)


తండ్రి బాట‌లో కౌబాయ్‌గా మ‌హేశ్ న‌టించిన 'ట‌క్క‌రిదొంగ‌' సినిమాలో మెయిన్ హీరోయిన్‌గా టాలీవుడ్‌కు ప‌రిచ‌య‌మైన తార లీసా రే ఒక ఇండో కెన‌డియ‌న్ యాక్ట‌ర్‌. వ‌య‌సులో మ‌హేశ్ కంటే మూడేళ్లు పెద్ద‌దైన ఆమె తెలుగులో న‌టించిన ఏకైక సినిమా ఇదే. ఆ త‌ర్వాత ఇంగ్లిష్ సినిమాల్లోనే న‌టిస్తూ వ‌చ్చిన ఆమె నాలుగేళ్ల‌గా హిందీ సినిమాలు చేస్తోంది. గ‌తేడాది ఎ.ఆర్‌. రెహ‌మాన్ మ్యూజిక్ స‌మ‌కూర్చిన '99 సాంగ్స్' సినిమా చేసింది. ప్ర‌స్తుతం ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోన్న 'ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్' వెబ్ సిరీస్‌లో లెస్బియ‌న్ క్యారెక్ట‌ర్‌లో క‌నిపిస్తోంది. 2009లోనే బ్ల‌డ్ కేన్స‌ర్ బారిన ప‌డిన ఆమె.. దాని నుంచి కోలుకొని ఒక‌వైపు న‌టిస్తూనే మ‌రోవైపు కేన్స‌ర్‌పై ప్ర‌జ‌ల‌ను చైత‌న్య‌వంతం చేసే అనేక కార్య‌క్ర‌మాల్లో పాలుపంచుకుంటుండ‌టం విశేషం.

4. బిపాషా బ‌సు (ట‌క్క‌రి దొంగ‌)


'ట‌క్క‌రిదొంగ‌'లో సెకండ్ హీరోయిన్‌గా క‌నిపించిన బాలీవుడ్ బ్యూటీ బిపాషా బ‌సు, ఆ సినిమా త‌ర్వాత లీసా రే త‌ర‌హాలోనే మ‌రే తెలుగు సినిమాలోనూ న‌టించ‌లేదు. ఓవ‌రాల్‌గా ఇది ఆమెకు రెండో సినిమా. దీనికి ముందు బాలీవుడ్‌లో 'అజ్‌న‌బీ' మూవీతో తెరంగేట్రం చేసి, బెస్ట్ ఫిమేల్ డెబ్యూగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు అందుకున్న బిపాషా.. రాజ్‌, జిస్మ్‌, ఐత్‌బార్‌, నో ఎంట్రీ, రేస్‌, బ‌చ్‌నా ఏ హ‌సీనో, రాజ్ 3డి వంటి సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రించింది. 2005, 2007 సంవ‌త్స‌రాల‌కు గాను 'సెక్సియెస్ట్ ఉమ‌న్ ఇన్ ఏషియా'గా ఆమెను యుకె మ్యాగ‌జైన్‌ 'ఈస్ట‌ర్న్ ఐ' ఎంపిక చేయ‌డం గ‌మ‌నార్హం. కొన్నాళ్లు బాలీవుడ్ స్టార్ యాక్ట‌ర్ జాన్ అబ్ర‌హాంతో డేటింగ్ చేసిన ఆమె.. అత‌డితో బ్రేక‌ప్ త‌ర్వాత‌ 2016లో న‌టుడు మోడ‌ల్ క‌ర‌ణ్ సింగ్ గ్రోవ‌ర్‌ను పెళ్లాడింది.

5. అమృతా రావ్ (అతిథి)


సూర‌జ్ ఆర్‌. బ‌ర్జాత్యా డైరెక్ట్ చేసిన బాలీవుడ్ మూవీ 'వివాహ్‌'లో హీరోయిన్‌గా అమృతా రావ్ న‌ట‌న దేశ‌వ్యాప్తంగా సినీ ప్రియుల‌ను అల‌రించ‌డంతో, 'అతిథి' మూవీలో అమృత పాత్ర‌కు అమృతా రావే క‌రెక్ట‌ని ఫిక్స‌యి ఆమెను టాలీవుడ్‌కు తెచ్చాడు డైరెక్ట‌ర్ సురేంద‌ర్‌రెడ్డి. సినిమా ఫ‌లితం ఎలా ఉండ‌నీ గాక‌, అమృతా రావ్ న‌ట‌న, ఆమె అంద‌చందాలు ప్రేక్ష‌కుల‌కు న‌చ్చాయి. తెలుగులో ఆమె న‌టించిన సినిమా ఇదొక్క‌టే. మై నేమ్ ఈజ్ ఆంథోనీ గాన్‌స్లేవ్స్‌, వెల్‌క‌మ్ టు స‌జ్జ‌న్‌పూర్‌, జాలీ ఎల్ఎల్‌బీ, స‌త్యాగ్ర‌హ లాంటి సినిమాలు చేశాక సినిమాల‌కు దూర‌మైంది. 2016లో బాయ్‌ఫ్రెండ్ అన్‌మోల్‌ను పెళ్లాడిన ఆమె, ఆరేళ్ల గ్యాప్‌తో 2019లో బాల్ థాక‌రే బ‌యోపిక్‌గా వ‌చ్చిన 'థాక‌రే' మూవీలో ఆయ‌న భార్య మీనా థాక‌రే క్యారెక్ట‌ర్ చేసి అంద‌రి ప్ర‌శంస‌లూ పొందింది.

6. కృతి స‌న‌న్ (1.. నేనొక్క‌డినే)


మ‌హేశ్ స‌ర‌స‌న స‌మీరా పాత్ర‌కు మొద‌ట త‌మ‌న్నా, త‌ర్వాత కాజ‌ల్ అగ‌ర్వాల్‌ను తీసుకోవాల‌ని అనుకున్న డైరెక్ట‌ర్ సుకుమార్‌.. ఆ ఇద్ద‌రి బిజీ షెడ్యూళ్ల కార‌ణంగా డేట్స్ ప్రాబ్లెమ్ త‌లెత్త‌డంతో కొత్త‌మ్మాయి కోసం అన్వేషించి, మోడ‌ల్ అయిన కృతి స‌న‌న్‌ను ఎంచుకున్నాడు. '1.. నేనొక్క‌డినే'తోటే కృతి తెరంగేట్రం చేసింది. స‌మీర‌గా ఆమె ప‌ర్ఫార్మ‌న్స్‌ను ప్రేక్ష‌కులు, విమ‌ర్శ‌కులు మెచ్చారు. దీని త‌ర్వాత తెలుగులో నాగ‌చైత‌న్య జోడీగా 'దోచెయ్' మూవీ చేసింది కృతి. ఆ త‌ర్వాత పూర్తిగా బాలీవుడ్‌కే అంకిత‌మై అక్కడ స్టార్ యాక్ట్రెస్‌గా రాణిస్తోంది. గ‌తేడాది 'లుకా చుప్పీ', 'హౌస్‌ఫుల్ 4' సినిమాల‌తో అల‌రించింది. ప్ర‌స్తుతం 'మిమి' అనే లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్‌తో పాటు అక్ష‌య్‌కుమార్ సినిమా 'బ‌చ్చ‌న్ పాండే' చేస్తోంది ఈ పొడుగుకాళ్ల సుంద‌రి.

7. కియారా అద్వానీ (భ‌ర‌త్ అనే నేను)


హిందీలో తెరంగేట్రం చేసిన నాలుగేళ్ల‌కు టాలీవుడ్‌కు 'భ‌ర‌త్ అనే నేను' మూవీతో ప‌రిచ‌య‌మైంది చ‌క్క‌ని చుక్క లాంటి కియారా అద్వానీ. కొర‌టాల శివ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో ముఖ్య‌మంత్రి భ‌ర‌త్‌గా చేసిన మ‌హేశ్ ప్రేమించే ఎంబీఏ గ్రాడ్యుయేట్ వ‌సుమ‌తి పాత్ర‌లో చ‌క్క‌గా రాణించింది. ఆమె అందానికి కుర్ర‌కారు దాసోహ‌మ‌న్నారు. ఆ త‌ర్వాత రామ్‌చ‌ర‌ణ్ జోడీగా 'విన‌య విధేయ రామ‌'లో క‌నిపించిన కియారా.. ఇవాళ బాలీవుడ్‌లో బాగా డిమాండ్ ఉన్న తార‌. 'అర్జున్‌రెడ్డి' హిందీ రీమేక్ 'క‌బీర్ సింగ్‌'లో హీరోయిన్ ప్రీతి సింగ్‌గా న‌టించి దేశ‌వ్యాప్తంగా సినీ ప్రియుల హృద‌యాల‌ను దోచుకుంది. అక్ష‌య్‌కుమార్ స‌ర‌స‌న న‌టించిన 'ల‌క్ష్మీ బాంబ్' మూవీ ఓటీటీలో రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ఇటీవ‌ల వ‌చ్చిన నెట్‌ఫ్లిక్స్ ఫిల్మ్ 'గిల్టీ', అదివ‌ర‌కటి 'ల‌స్ట్ స్టోరీస్' సినిమాల్లో ఆమె న‌ట‌న అంద‌రి ప్ర‌శంస‌లూ పొందింది.

- బుద్ధి య‌జ్ఞ‌మూర్తి


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.