English | Telugu

ఆడవాళ్లు ఎక్కడికి వెళ్తున్నా పెప్పర్ స్ప్రే దగ్గర పెట్టుకోవాలి: రాశీ ఖన్నా

on Dec 5, 2019

 

"దిశపై జరిగిన అమానుష ఘటనల లాంటివి ఆగాలంటే ఆడవాళ్లు పెప్పర్ స్ప్రే వాడాలి. ఎవరైనా మగవాళ్లు మీ దగ్గరకు వస్తే, ఏమాత్రం ఆలోచించకుండా దాన్ని స్ప్రే చెయ్యాలి. అదిప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్. ఎక్కడికి వెళ్తున్నా ఆడవాళ్లు తమతో పెప్పర్ స్ప్రే తీసుకుపోవాలి. దానివల్ల మగవాళ్ల ఆలోచనా ధోరణిలో మార్పు వస్తుంది. అలాగే ఇళ్లల్లో ఎదుటివాళ్లను గౌరవించాలని పిల్లలకు పెద్దలు నేర్పాలి" అంటోంది రాశీ ఖన్నా. 'వెంకీమామ'లో ఆమె ఒక హీరోయిన్‌గా నటించింది. వెంకటేశ్, నాగచైతన్య మేనమామ మేనల్లుళ్లుగా నటించిన ఈ సినిమాలో పాయల్ రాజ్‌పుత్ మరో నాయికగా చేసింది. బాబీ (కె.ఎస్. రవీంద్ర) డైరెక్ట్ చేసిన ఈ సినిమా డిసెంబర్ 13న రిలీజవుతోంది. ఈ సందర్భంగా ఆ సినిమాతో పాటు, పలు ఇతర అంశాల గురించీ మాట్లాడింది రాశి. ఆమెతో జరిపిన ఇంటర్వ్యూ...

తెలుగు బాగా మాట్లాడుతున్నారే?
ఇప్పుడు నేను తెలుగమ్మాయిని అయిపోయాను.

వెయిట్ లాస్ అయినట్లున్నారు?
అవును. జింలో చాలా కష్టపడ్డాను. షూటింగ్, జిం.. ఇవే నా లైఫ్ అయిపోయాయి. వెయిట్ తగ్గించుకోవాలనే దానికంటే ఫిట్‌గా ఉండాలనే దానిపై దృష్టి పెట్టాను. ఫ్యాట్‌ను తగ్గించుకొని, మజిల్‌ను స్ట్రాంగ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నా. ఇదివరకటితో పోల్చుకుంటే ఇప్పుడు నేను చాలా ఫిట్టయ్యాను. క్యారెక్టర్ డిమాండ్ చేస్తే తప్ప ఇలాగే ఉండాలనుకుంటున్నా.

'వెంకీమామ'లో మీ క్యారెక్టర్ ఏమిటి?
అందులో నా రోల్ పేరు హారిక. ఒక ఫిలింమేకర్. అనుకోకుండా ఒకరోజు మా మేనేజర్‌కు సురేశ్‌బాబు ఫోన్ చేసి తమ సినిమాలో రాశి కావాలని అడిగారు. అప్పుడు నేను తమిళ్ ఫిల్మ్ 'అయోగ్య' షూటింగ్‌లో ఉన్నాను. అదివరకు నేను చైతూతో కలిసి 'మనం'లో గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చాను. ఆ సినిమాకి ఒక రోజే పనిచేశాను. అతనితో కలిసి పనిచెయ్యాలంటే ఇంటెన్స్ లవ్ స్టోరీ అయితే బాగుంటుందనేది అప్పటి దాకా నాలో ఉన్న అభిప్రాయం. అయితే ఈ సినిమా ఆఫర్ వచ్చినా కూడా నేను చాలా సంతోషించాను. ఎందుకంటే వెంకటేశ్ గారు, చైతూ కలిసి నటిస్తున్న సినిమా కావడం, ఆ ఇద్దరూ మేనమామ మేనల్లుళ్లు కావడం. 'ప్రేమం'లో కూడా ఆ ఇద్దరూ కలిసి ఒక సీన్‌లో నటించారు. ఆ ఇద్దరూ కలిసి నటించాలని వాళ్ల ఫ్యాన్స్ కోరుకుంటూ ఉన్నారు. 'జై లవ కుశ'లో ఇదివరకే నేను డైరెక్టర్ బాబీతో పనిచేశాను. అందువల్ల కంఫర్ట్ లెవల్ బాగుంటుందనుకుని వచ్చేశాను. నా సీన్లు ఎక్కువగా ఫస్టాఫ్‌లో వస్తాయి. సెకండాఫ్ కథ ఎక్కువగా మామా అల్లుళ్ల మధ్య ఎమోషనల్ సీన్స్‌తో నడుస్తుంది. రియల్ లైఫ్‌లో కూడా ఆ ఇద్దరూ ఒకరిపై ఒకరు ఎంత ప్రేమ చూపించుకుంటారో సెట్స్‌పై నేను ప్రత్యక్షంగా చూశాను. అలాంటి వాళ్లను ఇండస్ట్రీలో నేనింత దాకా చూడలేదు. బహుత్ అచ్చే లోగ్ హై. ఫస్టాఫ్‌లో సందర్భానుసారం వచ్చే కామెడీ ఎక్కువ. నాది కామెడీ క్యారెక్టర్ కాదు కానీ, నవ్వించే సీన్లు ఎక్కువగా ఉంటాయి. వెంకీ సార్‌తోనూ నాకెక్కువ సీన్లు ఉంటాయి. ఈ సినిమా షూటింగ్‌ను చాలా ఎంజాయ్ చేశాను. వెంకీ సార్‌కి నేను బిగ్ ఫ్యాన్. 'ఎఫ్2' ని రెండు మూడు సార్లు చూశాను. ఆయన ఎక్స్‌ప్రెషన్స్ చాలా యూనిక్‌గా ఉంటాయి. ఆయన కామిక్ టైమింగ్ చాలా బాగుంటుంది. ఆయనతో కలిసి పనిచెయ్యడం వల్ల చాలా నేర్చుకున్నాను. 

ఇద్దరు హీరోలుంటే హీరోయిన్లకు ఏం చాన్స్ ఉంటుందని అనిపించలేదా?
ఇద్దరు హీరోయిన్లు ఉన్న సినిమాలు ఇప్పటికే నేను చేశాను. అది ప్రాబ్లెమే కాదు. నాకు మంచి క్యారెక్టర్ ఉంటే చెయ్యడానికి నాకేం అభ్యంతరం ఉండదు. ప్రేక్షకులు నా క్యారెక్టర్‌ను గుర్తుంచుకుంటే చాలు. ఎవరేం క్యారెక్టర్ చేస్తున్నారనేది చూడ్డం నా పని కాదు. మలయాళంలో హీరోయిన్ కాకపోయినా మంచి రోల్ చేశాను. నటనకు అవకాశమున్న పాత్రా, కాదా.. అనేదే నేను చూసుకుంటా. గ్లామరస్ క్యారెక్టర్స్ మాత్రమే చేస్తుందనో, లేకపోతే గ్లామరస్‌గా ఉండని పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ రోల్స్ మాత్రమే చేస్తుందనో అనిపించుకోవడం నాకిష్టం లేదు. ఆ రెండు రకాల పాత్రలూ చెయ్యాలనుకుంటాను. 'వెంకీమామ'లో మా నలుగురి క్యారెక్టర్లనూ బాబీ బాగా తీర్చిదిద్దారు. నాది కానీ, పాయల్‌ది కానీ ఇలా వచ్చి అలా పోయే క్యారెక్టర్స్ కావు. నేను సిటీ నుంచి విలేజ్‌కు వచ్చే అమ్మాయిగా కనిపిస్తాను. వెంకీ సార్, చైతూ, నాకూ మధ్య సీన్లు చాలా సరదాగా ఉంటాయి. ఒక ఇబ్బందికర పరిస్థితిలో చిక్కుకొని ఎలా తిప్పలు పడతాననేది ఫన్నీగా ఉంటుంది.

ఎప్పట్నుంచి మీరు వెంకటేశ్ గారికి ఫ్యాన్ అయ్యారు?
నా చిన్నప్పట్నుంచే టీవీలో ఆయన హిందీ డబ్బింగ్ సినిమాలు చూస్తూ ఉండేదాన్ని. అప్పట్నుంచే ఆయన సినిమాలంటే ఇష్టం. అయితే అంతకంటే ఒక వ్యక్తిగా ఆయనంటే నాకు చాలా అభిమానం. ఆయన వెరీ స్పిరుచ్యువల్, వెరీ నైస్ పర్సన్. ఆయనతో మాట్లాడే సమయం నాకు లభించింది.

ఒకేసారి రెండు మూడు సినిమాలు చెయ్యడం వల్ల క్యారెక్టర్స్‌లో కన్‌ఫ్యూజన్ ఉంటుందా?
అలాంటిదేమీ ఉండదు. నేను ఒకేసారి 'ప్రతిరోజూ పండగే', 'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమాలు చేశాను. రెండూ ఒకదానికొకటి భిన్నమైన పాత్రలు. 'వరల్డ్ ఫేమస్ లవర్' మోర్ ఇంటెన్స్ ఫిల్మ్. ఆ కథ నా క్యారెక్టర్ నుంచి చాలా డిమాండ్ చేస్తుంది. 'ప్రతిరోజూ పండగే'లో నాది బాగా బబ్లీగా ఉండే రోల్.

డబ్బింగ్ చెప్పడానికి టైం దొరుకుతోందా?
'వెంకీమామ'కు చెప్పలేదు కానీ, 'వరల్డ్ ఫేమస్ లవర్'కు డబ్బింగ్ చెప్పాను. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ రావడం వల్ల ఆ టైంలో డబ్బింగ్ చెప్పడం కుదరలేదు. ఇక నుంచీ డబ్బింగ్ నేనే చెప్పాలనుకుంటున్నా. నా గొంతు కూడా డబ్బింగ్‌కి సూటవుతుంది. క్యారెక్టర్‌కు మేం డబ్బింగ్ చెబితేనే న్యాయం జరుగుతుంది.

పాట కూడా పాడబోతున్నారని వినిపిస్తోంది?
అవును. ఏ సినిమా కోసం ఎప్పుడు పాడుతున్నాననేది తర్వాత చెప్తాను. అది తెలుగులోనే ఉంటుంది. చిన్నప్పుడు నాకు సింగర్ అవ్వాలని ఉండేది. ఏడేళ్ల వయసులో పాడటం నేర్చుకొని, పాటల పోటీల్లో పాల్గొనే దాన్ని. ప్రొఫెషనల్‌గా పాడే చాన్స్ రావడం లక్కీ అనుకుంటున్నా.

మీరు ముంబై నుంచి వచ్చారు కదా. హిందీ సినిమాల్లో ట్రై చెయ్యట్లేదా?
ఇక్కడే చాలా బిజీగా ఉన్నానండీ. ఇవాళ సౌత్ సినిమాలకు చాలా రీచ్ ఉంటోంది. అందువల్ల బాలీవుడ్‌కో లేదా హాలీవుడ్‌కో వెళ్లాలనే ఫీలింగ్ ఎప్పుడూ కలగలేదు. మంచి క్యారెక్టర్ వస్తే, హిందీ అయినా, మలయాళమైనా చేస్తాను. అంతే కానీ హిందీ సినిమాల్లోకి వెళ్లాలనే ఆలోచన చెయ్యట్లేదు. నాకు ఎక్కడ మంచి పని దొరికితే అక్కడకు వెళ్తాను.

మిగతా హీరోయిన్లతో పోటీ ఉందని ఫీలవుతుంటారా?
పోటీ ప్రతి ఫీల్డులో ఉంది. పోటీ చాలా అవసరం. లేకపోతే రిలాక్స్ అయిపోతాం. పోటీ ఉంటేనే బాగా చెయ్యాలనే తపన కూడా ఉంటుంది.

ఏ హీరోయిన్లతో మీరెక్కువ సన్నిహితంగా ఉంటారు?
రకుల్ ప్రీత్ నాకు వెరీ గుడ్ ఫ్రెండ్.

మీ అంచనాలకు తగ్గట్లు ఆఫర్స్ వస్తున్నాయా?
నాకు చాలా అంచనాలే ఉన్నాయి. 'వెంకీమామ', 'ప్రతిరోజూ పండగే'లో మంచి కమర్షియల్ క్యారెక్టర్స్ చేశాను. అయితే 'వరల్డ్ ఫేమస్ లవర్'లో ఇప్పటి దాకా చెయ్యని టఫెస్ట్ క్యారెక్టర్ చేశాను. చాలామందికి 'తొలిప్రేమ'లో నేను చేసిన పాత్ర బాగా నచ్చింది. దాని తర్వాత 'వరల్డ్ ఫేమస్ లవర్'లో క్యారెక్టర్ బాగా నచ్చుతుందని అనుకుంటున్నా.

'శ్రీనివాస్ కల్యాణం'లో మంచి క్యారెక్టర్ చేశారు. దాని రిజల్ట్ డిజప్పాయింట్ చేసిందా?
హిట్టూ ఫ్లాపూ నా చేతుల్లో లేవు. ప్రతి ఒక్కరికీ చేసే సినిమా స్పెషలే. సినిమా రిలీజయ్యాకే అదెందుకు వర్కవుట్ అయ్యింది, ఎందుకు అవ్వలేదు?.. అనే ప్రశ్నలు వస్తాయి. ప్రేక్షకులు ఆ సినిమాలో నన్ను ఇష్టపడ్డారు. వాళ్లు సినిమాని ఇష్టపడకపోవడం వేరే సంగతి. నేనేమీ డిజప్పాయింట్ కాలేదు. అది ఇండస్ట్రీలో ఒక భాగం. హిట్లూ, ఫ్లాపులూ కామన్. ఐ లైక్డ్ ద ఫిల్మ్. ఎక్కడో ఎమోషనల్‌గా దానికి కనెక్టయ్యాను.

వెబ్ సిరీస్ చేసే ఆలోచనేమన్నా ఉందా?
మంచి రోల్ వస్తే కచ్చితంగా చేస్తాను. ఇప్పుడు చాలామంది చేస్తున్నారు.

లేడీ ఓరియెంటెడ్ స్టోరీస్ మీ వద్దకు వస్తున్నాయా?
వస్తున్నాయి కానీ, అవి నన్ను మెప్పించలేకపోతున్నాయి. ప్రభావవంతమైన స్క్రిప్ట్ వస్తే చెయ్యడానికి సిద్ధంగా ఉన్నాను.

ఇటీవల హైదరాబాద్‌లో దిశపై జరిగిన అమానుష ఘటన తలచుకుంటే ఏమనిపిస్తుంది?
కోపం, భయం.. రెండూ కలుగుతాయి. ఆ నీచానికి పాల్పడినవాళ్లను జనం మధ్యలో ఉరి తియ్యాలనిపించేంత కోపం వచ్చింది. కానీ మనం మన అభిప్రాయాలు మాత్రమే చెప్పగలం. అంతకు మించి ఏం చెయ్యగలం? నేను మాట్లాడగలను కానీ, వాళ్లను నేను చంపలేనుగా. ఆ పని చెయ్యాల్సింది జ్యూరీ. వ్యక్తులుగా మనం ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి.

చాలామంది సినిమాలను పాయింట్ ఔట్ చేస్తున్నారు కదా.. స్త్రీలను కించపరిచేలా సన్నివేశాలు తీస్తుంటారని?
అది మీ తలలో ఉన్న అభిప్రాయమంతే. ఏం కించపరుస్తున్నారు? మీరెలా దాన్ని నిర్వచిస్తారు? డ్రస్సుల గురించి కూడా మాట్లాడుతుంటారు. అది మీ ఆలోచనాధోరణిలో ఉంటుంది. మీ అమ్మ పెంపకంలో ఉంటుంది. ఒకరికి కరెక్టనిపించేది, ఇంకొకరికి తప్పనిపిస్తుంది. ఈ ప్రశ్నకు ఒకే జవాబు ఉండదు.

ఇదివరకటితో పోలిస్తే, తెలుగు సినిమాల్లో హీరోయిన్ రోల్స్ ఇంప్రూవ్ అయ్యాయనుకుటున్నారా?
కచ్చితంగా ఇంప్రూవ్ అయ్యాయి. మంచి మంచి రోల్స్ వస్తున్నాయి. ఇలా వచ్చి అలా పోయే, డాన్సులకు పరిమితమయ్యే హీరోయిన్ క్యారెక్టర్లు తగ్గాయి. ఇవాళ ప్రాపర్ రోల్స్ లభిస్తున్నాయి. పెళ్లి తర్వాత కూడా సమంత ఎలాంటి క్యారెక్టర్స్ చేస్తున్నదో మనం చూస్తున్నాం. ఇప్పుడు వెస్ సిరీస్ కూడా చేస్తోంది. ఆమెలాంటి వాళ్లంటే నాకెంతో గౌరవం. ఇదివరకు పెళ్లయితే కెరీర్ ఖతం. ఇప్పుడలా లేదు. ఇండస్ట్రీ బెటర్ అయ్యింది.

మంచి మెసేస్‌తో వస్తున్న సినిమాలు హిట్టవుతున్నాయి కానీ, వాటి ప్రభావం జనంపై ఎందుకు కనిపించడం లేదంటారు?
మంచి మెసేజ్ ఉన్న సినిమా చూస్తాం. తర్వాత ఆ మెసేజ్‌ని మర్చిపోతాం. అలా ఉండకూడదు. ట్విట్టర్, ఫేస్‌బుక్ లాంటి ప్లాట్‌ఫామ్స్ ఈ విషయంలో బాగా పనిచేస్తున్నాయి. దేని గురించైనా మాట్లాడుకొనే సౌలభ్యాన్ని అవి కల్పిస్తున్నాయి. నేను నటించగలను, మీరు రాయగలరు. శిక్షలు మనం వెయ్యలేం. చెడు జరిగినప్పుడల్లా మనమేం చెయ్యలేమనే విషయం ఫ్రస్ట్రేట్ చేస్తుంటుంది.

'శ్రీనివాస కల్యాణం' తర్వాత ఎందుకింత గ్యాప్ తీసుకున్నారు?
నేను గ్యాప్ తీసుకోలేదండీ. ఆ సినిమా చేసిన వెంటనే నేను 'వరల్డ్ ఫేమస్ లవర్'కు సంతకం చేశాను. అయితే అది రావడం లేటవుతుండటం వల్ల గ్యాప్ వచ్చినట్లు కనిపిస్తోంది. నేనైతే ఖాళీగా లేను. 'వెంకీమామ'కు జనవరిలోనే సంతకం చేశాను. సినిమాల రిలీజ్‌లు నా చేతుల్లో లేవు కదా.

కెరీర్‌ను ప్లాన్ చేసుకుంటారా?
యాక్టర్స్‌కు ప్లాన్ అనేది ఏముండదు. మన దగ్గరకు ఏ డైరెక్టర్ వస్తాడనేది మన నిర్ణయంపై ఆధారపడి ఉండదు. వచ్చిన ఆఫర్స్‌లో బాగా ఉన్నాయనుకున్నవి చూసుకొని చేస్తుంటాం. మంచి స్క్రిప్ట్స్ కోసం ఎదురు చూస్తుంటాం. ఆరు నెల్ల నుంచి బ్రేక్ లేకుండా పనిచేస్తూ వచ్చాను. అందుకే ఇప్పుడు 15 రోజులు బ్రేక్ తీసుకుంటున్నా. తర్వాత మళ్లీ పనిలో పడటమే.

- బుద్ధి యజ్ఞమూర్తి


Cinema GalleriesLatest News


Video-Gossips