'ఆర్ఆర్ఆర్' రిలీజ్ డేట్‌ను బయటపెట్టింది.. ఆపై నాలుక కరుచుకుంది!
on Jan 23, 2021
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా యస్.యస్. రాజమౌళి రూపొందిస్తోన్న 'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం' చిత్రం ప్రస్తుతం క్లైమాక్స్ షూట్‌ను జరుపుకుంటోంది. ఇటీవల ఈ విషయాన్ని తెలియజేస్తూ, రామరాజు, భీమ్ పాత్రధారులు చేతులు కలిపిన ఓ పిక్చర్‌ను రాజమౌళి తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా షేర్ చేసిన విషయం తెలిసిందే. షూటింగ్ ముగింపు దశకు చేరుకున్న వేళ.. ఈ మోస్ట్ యాంటిసిపేటెడ్ ఫిల్మ్ ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందా అని అందరూ వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇక రాజమౌళి, ఆయన ఇద్దరు హీరోల అభిమానులైతే మరీనూ.
దేశవ్యాప్తంగా అత్యంత క్యూరియాసిటీని రేకెత్తిస్తోన్న ఈ చిత్రంలో చరణ్ జోడీగా అలియా భట్, తారక్ సరసన ఒలీవియా మోరిస్ నటిస్తున్నారు. అజయ్ దేవ్‌గణ్, సముద్రకని, శ్రియతో పాటు అమెరికన్ నటులు రే స్టీవెన్సన్, అలీసన్ డూడీ కీలక పాత్రధారులు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన రెండు క్యారెక్టర్ ఇంట్రడక్షన్ టీజర్లు.. భీమ్ ఫర్ రామరాజు, రామరాజు ఫర్ భీమ్.. ఫ్యాన్స్‌ను అమితంగా ఆకట్టుకుని, సినిమాపై క్యూరియాసిటీని రెట్టింపు చేశాయి.
కాగా, ఇప్పటివరకూ రెండు మూడు సార్లు 'ఆర్ఆర్ఆర్' రిలీజ్ డేట్‌ను నిర్మాతలు అనౌన్స్ చేయడం, తర్వాత వాయిదా పడుతూ రావడం చూశాం. లేటెస్ట్ రిలీజ్ డేట్ ఎప్పుడనేది మాత్రం అధికారికంగా వెల్లడి కాలేదు. రిలీజ్ డేట్ విషయంలో మేకర్స్ ఓ స్ట్రాటజీని ఫాలో అవుతూ దాని ప్రకారం అనౌన్స్ చేస్తుంటారు. ఇవేవీ తెలియని ఒక వ్యక్తి అనుకోకుండా రిలీజ్ డేట్‌ను బయటపెట్టేశారు. ఆ వ్యక్తి.. సినిమాలో లేడీ విలన్‌గా నటిస్తోన్న అలీసన్ డూడీ. ఆమె తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా షేర్ చేసిన ఓ పోస్ట్‌లో 'ఆర్ఆర్ఆర్' రిలీజ్ డేట్‌ను వెల్లడించారు. అక్టోబర్ 8న 'ఆర్ఆర్ఆర్' రిలీజ్ అవుతుందని ఆమె పేర్కొన్నారు.
దర్శక నిర్మాతల నుంచి ఇంతవరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేకుండానే అనూహ్యంగా అలీసన్ డూడీ సినిమా విడుదల తేదీని బయటపెట్టడంతో ఫ్యాన్స్ షాకయ్యారు. అది నిజమేనా అనడుగుతూ కామెంట్స్ పెట్టారు. ఈ విషయం నిమిషాల వ్యవధిలో రాజమౌళి టీమ్‌కు చేరింది. వెంటనే వారు ఆ పోస్ట్ డిలీట్ చేయమనీ, అఫిషియల్‌గా ఏదైనా మేకర్స్ నుంచి ప్రకటన వచ్చాకే ఇలాంటివి షేర్ చేయమనీ సూచించారు. దాంతో నాలుక కరుచుకున్న అలీసన్ ఆ పోస్ట్‌ను డిలీట్ చేశారు. అయితే, అప్పటికే కొంతమంది ఆ స్క్రీన్ షాట్స్ తీసి ఇంటర్నెట్లో వైరల్ చేశారు. అక్టోబర్ 10 రాజమౌళి బర్త్‌డే. దానికి రెండు రోజుల ముందు సినిమా విడుదల కానున్నదన్న మాట.
Also Read