వెబ్ సిరీస్ చేయడానికి హీరో కుమార్తె రెడీ
on Jul 2, 2020
మంచి కథ వస్తే వెబ్ సిరీస్ చేయడానికి తాను సిద్ధమని హీరో రాజశేఖర్, నటి జీవిత దంపతుల పెద్ద కుమార్తె శివానీ రాజశేఖర్ తెలిపారు. వెబ్ కంటెంట్ చేయడానికి తనకు ఎటువంటి అభ్యంతరాలు లేవని ఆమె స్పష్టం చేశారు.
'దొరసాని'తో జీవితా రాజశేఖర్ దంపతుల చిన్న కుమార్తె శివాత్మిక కథానాయికగా పరిచయం అయ్యారు. అంతకు ముందు శివాని హీరోగా '2 స్టేట్స్' రీమేక్ మొదలైంది. అయితే, మధ్యలో సినిమా ఆగడంతో శివాని డెబ్యూ ఆలస్యమైంది. ప్రశాంత్ వర్మ అందించిన కథతో 'పెళ్లి గోల' వెబ్ సిరీస్ దర్శకుడు మల్లిక్ రామ్ తెరకెక్కిస్తున్న ఫాంటసీ ప్రేమకథా సినిమాతో కథానాయికగా శివాని ఇంట్రడ్యూస్ అవుతున్నారు. బుధవారం ఆమె పుట్టినరోజు సందర్భంగా సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. నాలుగైదు రోజుల మినహా ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిందని అన్నారామె.
"ఓటీటీలో సినిమా విడుదలకు నేను వ్యతిరేకం కాదు. వీలైనంత మందికి నా సినిమా చేరువ కావాలని కోరుకుంటాను. సినిమా రిలీజ్ విషయంలో మా ప్రొడక్షన్ హౌస్ డెసిషన్ తీసుకుంటుంది. అలాగే, వెబ్ సిరీస్ చేయడానికి నాకు ఇబ్బంది లేదు. కంటెంట్ బావుంటే ప్రజలు ఆదరిస్తారు" అని శివాని రాజశేఖర్ అన్నారు.