నితిన్ పెళ్లి వాయిదా!
on Mar 28, 2020
కరోనా వ్యాప్తి కారణంగా దేశంలో నెలకొన్న భయానక పరిస్థితుల నేపథ్యంలో హీరో నితిన్ పెళ్లి వాయిదా పడినట్లు సమాచారం. ఆరేళ్లుగా తను ప్రేమిస్తోన్న షాలిని అనే యువతిని ఏప్రిల్ 16న పెళ్లాడటానికి నితిన్ రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఇదివరకే ఆ ఇద్దరి కుటుంబాలూ పసుపు కుంకుమ వేడుకను నిర్వహించాయి కూడా. నిజానికి దుబాయ్‌లో డెస్టినేషన్ మ్యారేజ్ చేయడానికి పెద్దలు నిర్ణయించారు. 15న నిశ్చితార్థం, వందమంది సన్నిహితుల సమక్షంలో 16న వివాహ వేడుక జరుపడానికి దుబాయ్‌లోని ఒక హోటల్‌ను కూడా బుక్ చేసుకున్నారు.
కరోనా కారణంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించిన నేపథ్యంలో డెస్టినేషన్ వెడ్డింగ్ ఆలోచనను మానుకొని, హైదరాబాద్‌లో నిర్ణయించిన ముహూర్తానికే వివాహం జరపాలని వధూవరుల కుటుంబాలు భావించాయి. కానీ కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతుండటం, వేడుకలకు దూరంగా ఉండాలని ప్రభుత్వాలు హెచ్చరికలు చేస్తుండటంతో పెళ్లిని వాయిదా వేసుకోవడమే మంచిదని ఆ కుటుంబాలు నిర్ణయించుకున్నట్లు నితిన్ సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది. కరోనా కేసులు తగ్గి, సాధారణ పరిస్థితులు నెలకొన్న తర్వాతే కొత్తగా పెళ్లి ముహూర్తం పెట్టించాలని పెద్దలు నిర్ణయించుకున్నారు. కాగా మార్చి 30న తన పుట్టినరోజును జరుపుకోకూడదని కూడా నితిన్ భావిస్తున్నట్లు సమాచారం.