నాకు సెలబ్రిటీ స్టేటస్ రావడం వాళ్లకు కొత్తగా ఉంది!
on Dec 13, 2019
"టాలీవుడ్లో హీరోగా నాకో గుర్తింపు వచ్చినందుకు మా ఇంట్లోవాళ్లు ప్రౌడ్‌గా ఫీలవుతున్నారు" అంటున్నాడు హీరో కార్తికేయ. ఇటీవలే '90ఎంఎల్' మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అతను తను సినిమాల్లోకి రాకముందు ఇంట్లోవాళ్లు ఎలా చూసేవారో, ఇప్పుడెలా చూస్తున్నారో 'తెలుగుఒన్'కు తెలియజేశాడు. "నాకు పాతికేళ్లు దాటిపోయినా కూడా ఇంట్లో చిన్నవాడ్ని కావడం వల్ల చిన్నపిల్లోడిగానే మావాళ్లు చూస్తూ వచ్చారు. నాకో అక్క ఉంది. ఆమె నాకన్నా ఆరేళ్లు పెద్ద. అక్క కూడా నన్ను అమ్మలాగే చూసుకుంటూ ఉంటుంది. మా కజిన్స్ కూడా నాకంటే పెద్దోళ్లు. అందుకని వాళ్లంతా నన్ను చిన్నపిల్లోడిగా చూస్తూ నాకేమీ తెలీదనుకుంటూ ఉంటారు" అని చెప్పాడు కార్తికేయ.
అతను సినిమాల్లోకి రాకముందు వరకూ వాళ్లమీద ఆధారపడుతూ వచ్చాడు. "ఏ విషయం కూడా నాకు చూసుకోవడం రాదు, వాళ్లే చూసుకోవాలి.. అన్నట్లే ఉండేది నా పరిస్థితి. అలాగే నన్ను పెంచారు. ఇప్పుడు సడన్‌గా నాకు గుర్తింపు వచ్చి, ఎవరో తెలీనివాళ్లు మా ఇంటికొస్తూ, "మీ అబ్బాయి వస్తే చెప్పండి, మేం సెల్ఫీ తీసుకోవాలి" అని చెప్తుండేసరికి వాళ్లకు వెరైటీగా అనిపిస్తోంది. 'వీడికోసం వాళ్లు అంతగా ఫీలైపోతున్నారేమిటి?' అనుకుంటున్నారు మావాళ్లు. నాకు సెలబ్రిటీ స్టేటస్ రావడం వాళ్లకు కొత్తగా ఉంది. వాళ్లకేమీ అర్థం కావట్లేదు. 'వీడిలో ఏముంది? వీడిలో ఏంచూసి వీళ్లు వస్తున్నారు?' అని ఆశ్చర్యపోతున్నారు. ఇప్పుడు నేనున్న స్థితికి అక్కయ్య కూడా హ్యాపీ. నావల్ల వాళ్లకు కూడా సినిమాలు చూడ్డం అలవాటయ్యింది. ఏ సినిమా ఏంటి అని చెక్ చేస్తున్నారు. అన్ని సినిమాలూ చూస్తున్నారు. 'నువ్విలా చెయ్యి, అలా చెయ్యి' అని చెప్తున్నారు" అని నవ్వుతూ చెప్పాడు కార్తికేయ.