English | Telugu

నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్: టాలీవుడ్ తలెత్తుకొని నిల్చొంది!

on Aug 10, 2019

జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో తెలుగు సినిమాకు ఏకంగా 7 అవార్డులు రావడం దేశంలోని ఇతర భాషల సినీ రంగాల వాళ్లనే కాకుండా స్వయంగా తెలుగు సినీ వర్గాల వాళ్లనీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. శుక్రవారం డైరెక్టరేట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్స్, కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ కలిసి ప్రకటించిన 66వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్‌లో టాలీవుడ్‌కు 7 అవార్డులు దక్కాయి. అందులోనూ ప్రతిష్ఠాత్మక ఉత్తమ నటి అవార్డు 'మహానటి'గా అత్యుత్తమ ప్రదర్శన కనపర్చిన కీర్తి సురేశ్‌కు దక్కడం తెలుగు సినిమా గర్వంగా తలెత్తుకొని నిల్చొనే సందర్భం. ఎన్నడో 1990లో 'కర్తవ్యం' చిత్రంలో పోలీస్ ఆఫీసర్‌గా గొప్పగా నటించిన విజయశాంతి ఉత్తమ నటి అవార్డు అందుకున్న తర్వాత మళ్లీ ఆ అవార్డు తెలుగు సినిమాకు రావడం ఇప్పుడే. స్వతహాగా మలయాళీ అయినప్పటికీ మహానటి సావిత్రిగా కీర్తి కనపర్చిన అభినయం అందరినీ అబ్బురపరిచింది. తెలుగు సినిమాల్లో అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే ఆమెను సావిత్రి పాత్రకు డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఎంపిక చేయడం, ఆ పాత్రలో ఆమె ఒదిగిపోవడం ఒక కలలా జరిగిపోయిందనుకోవాలి.

'మహానటి' సినిమాకు ఉత్తమ నటి అవార్డుతో పాటు ఉత్తమ కాస్ట్యూం డిజైన్, ఉత్తమ తెలుగు చిత్రం అవార్డులు లభించాయి. నాని నిర్మించగా ప్రశాంత్ వర్మ డైరెక్టర్‌గా పరిచయమైన 'అ!' మూవీ.. స్పెషల్ ఎఫెక్ట్స్, మేకప్ విభాగాల్లో పురస్కారాలు దక్కించుకుంది. సుకుమార్ డైరెక్షన్‌లో రాంచరణ్ హీరోగా నటించిన బ్లాక్‌బస్టర్ మూవీ 'రంగస్థలం'కు బెస్ట్ ఆడియోగ్రఫీ, యాక్టర్ నుంచి డైరెక్టర్‌గా మారి రాహుల్ రవీంద్రన్ రూపొందించిన ఫస్ట్ ఫిల్మ్ 'చి.ల.సౌ' సినిమాకు బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే అవార్డ్ దక్కాయి.

66 ఏళ్ల నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ హిస్టరీలో తెలుగు సినిమాకు 7 అవార్డులు లభించడం ఇదే ప్రథమం. సాధారణంగా జాతీయ అవార్డుల్లో ఎప్పుడూ హిందీ, బెంగాలీ సినిమాలదే ఆధిపత్యం. తర్వాత దక్షిణాది నుంచి మలయాళ సినిమా జాతీయ స్థాయిలో అవార్డుల్ని కొల్లగొడుతూ రాగా, కొంత కాలానికి తమిళ సినిమా సైతం సగర్వంగా నేషనల్ లెవల్లో తలెత్తుకు తిరగడం మొదలుపెట్టింది. ఆ రెండు సినీ రంగాలు ఒకవైపు కమర్షియల్ సినిమాలతో పాటు రియాలిటీకి దగ్గరగా ఉండే సినిమాలనీ తీస్తూ పేరు తెచ్చుకున్నాయి.

తెలుగు సినిమా మాత్రం "అవార్డుల కంటే ప్రేక్షకుల రివార్డులే ముఖ్యం", "సినిమా అనేది వ్యాపారం. పెట్టుబడికి తగ్గ లాభాలు వచ్చాయా, లేదా అనేదే ప్రధానం" అనుకుంటూ మూస సినిమాల్నే తీసుకుంటూ వచ్చింది. అందువల్లే అడపా దడపా తప్ప నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్‌లో తెలుగు సినిమాకు సరైన ప్రాతినిధ్యం లేకుండా పోయింది. అవార్డుల ప్రకటన వచ్చినప్పుడల్లా, 'తెలుగు సినిమాకి మొండిచేయి', 'తెలుగు సినిమాకి చోటెక్కడ?' అని నిట్టూర్పులు విడవడం పరిపాటిగా మారింది. గడచిన పదేళ్లలోనే తీసుకుంటే 2010, 2011 సంవత్సరాల్లో మెయిన్ స్ట్రీం తెలుగు సినిమాకు ఒక్కటంటే ఒక్క అవార్డూ దక్కలేదంటే మిగతా భాషల సినిమాలతో పోలిస్తే టాలీవుడ్ ఎంత అథమ స్థాయికి పడిపోయిందో అర్థమవుతుంది. బాలీవుడ్ తర్వాత దేశంలోనే అత్యధిక సినిమాలు నిర్మించే టాలీవుడ్‌కు ఇది ఎంత అవమానకరం? కానీ మనవాళ్లు దానికేమీ చింతించినట్లు కనిపించదు.

ఆరేడేళ్ల నుంచీ తెలుగు సినిమాలో కొత్త రక్తం రావడం మొదలైంది. మూస సినిమాల్ని ప్రేక్షకులు తిప్పికొడుతుండటం, భిన్న కథాంశాలతో వస్తున్న సినిమాల్ని ఆదరిస్తుండటంతో నవతరం దర్శకులు తమ ముందున్న కర్తవ్యమేమిటో అర్థం చేసుకున్నారు. అందుకే ఇవాళ తెలుగు సినిమా మూసను విడనాడి కొత్త దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. 'నా బంగారు తల్లి', 'పెళ్లి చూపులు', 'ఘాజి', 'మహానటి', 'అ!' వంటి భిన్న సినిమాలు జాతీయ స్థాయిలో తెలుగు సినిమా జెండాని ఎగురవేశాయి. కమర్షియల్ స్టోరీలనే తనదైన భిన్న శైలిలో తీసే సుకుమార్ రూపొందించిన 'రంగస్థలం' బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ హిట్టవడమే కాకుండా సౌండ్ విభాగంలో అవార్డును దక్కించుకుంది. ఆ సినిమాని ఆయన మూస తరహాలో తీయలేదన్నది వాస్తవం. నిజానికి మరిన్ని అవార్డులకు ఆ సినిమా అర్హమైనదే.
ఏదేమైనా ఇన్నాళ్లకు 7 అవార్డులు రావడంతో తెలుగు చిత్రసీమ పులకించిపోతోంది. ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతోంది. ఇన్నాళ్లుగా 'అవార్డులెందుకు.. రివార్డులు చాలు' అనుకుంటూ వచ్చినవాళ్లు కూడా ఇప్పుడు తెలుగు సినిమా సాధించిన ఘనతకు పొంగిపోతున్నారు. జాతీయ అవార్డుల రుచి ఎంత మధురంగా ఉందో వాళ్లకు అనుభవంలోకి వచ్చింది. ఇవాళ సాధించిన ఈ ఘనత ఇంతటితో ఆగిపోకుండా రానున్న రోజుల్లో మరిన్ని ఉత్తమ చిత్రాల రూపకల్పన కోసం టాలీవుడ్ అడుగు ముందుకేస్తుందని ఆశిద్దాం.

- యజ్ఞమూర్తి

 


Cinema GalleriesLatest News


Video-Gossips