English | Telugu

సన్సేషనల్ కాంబినేషన్స్ ఆఫ్ 2018

on Jan 1, 2018

సాధారణంగా స్టార్ హీరోల సినిమాలంటేనే.. హైప్స్ ఆకాశంలో ఉంటాయ్. వారు ఏ దర్శకునికి డేట్స్ ఇచ్చినా... ఆ దర్శకుడు కొత్తవాడైనా.. సినిమాపై అంచనాలు సహజం. ఎందుకంటే సదరు హీరో స్టార్ కాబట్టి.

అయితే... ఒక్కోసారి ఇద్దరు స్టార్లు కలిసి పనిచేయడం జరుగుతుంటుంది. అంటే ఇద్దరు హీరోలు కావొచ్చు.. లేదా హీరో, డైరెక్టర్ కావొచ్చు. ఇలా స్టార్ల తో సెట్ అయిన కాంబినేషన్ ని... ‘సన్సేషనల్ కాంబినేషన్’ అంటారు. ప్రతి ఏడాదీ... అనేక సన్సేషనల్ కాంబినేషన్లు సెట్ అవుతూ ఉంటాయ్. గత ఏడాది ఖైదీ నంబర్ 150,  గౌతమిపుత్ర శాతకర్ణి, బాహుబలి, నమో వెంకటేశాయ, స్పైడర్, దువ్వాడ జగన్నాథం.. ఇవన్నీ సన్సేషనల్ కాంబినేషన్ తో వచ్చిన సినిమాలే.

అలాగే... అదే ఏడాది... జై సింహా, అజ్ఙాతవాసి, భరత్ అను నేను, రంగస్థలం చిత్రాలకు కొబ్బరికాయలు కొట్టబడ్డాయ్. అవి 2018లో విడుదలకు సిద్దమవుతున్నాయ్.

ఆదేవిధంగా 2018లో కూడా కొన్ని సన్సేషనల్ కాంబినేషన్లు ఇప్పటికే రెడీ అయ్యాయ్? అవేంటో... వాటి ముచ్చటేంటో.. సరదాగా కాసేపు ముచ్చటించకుందాం.

ఈ వ్యవహారంలో ముందు చెప్పుకోవాల్సింది.. బాలయ్య, తేజా కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ‘ఎన్టీయార్’ చిత్రం. మహానటుడు ఎన్టీయార్ బయోపిక్ బాలయ్య తీస్తాడని అందరికీ తెలుసుకానీ... దానికి తేజాను దర్శకునిగా తీసుకుంటాడని మాత్రం ఎవరూ అనుకోలేదు. సో... 2018లో ఫస్ట్ చెప్పుకోదగ్గ క్రేజీ కాంబినేషన్ ఇది.

ఇదే ఏడాది మరో క్రేజీ కాంబినేషన్ వెంకటేశ్, త్రివిక్రమ్ ల సినిమా. సురేశ్ బాబు నిర్మాత. వెంకటేశ్, త్రివిక్రమ్ కలిసి గతంలో నువ్వునాకు నచ్చావ్, మల్లీశ్వరి సినిమాలకు పనిచేశారు. అయితే... దర్శకునిగా వెంకటేశ్ తో పనిచేయడం త్రివిక్రమ్ కి ఇదే ప్రథమం. ఆ విధంగా ఇది రెండో క్రేజీ కాంబినేషన్.

ముందు ముందు పవర్ స్టార్ పాలిటిక్స్ లో బిజీ అయిపోతారు. అందుకే... సాధ్యమైనంతవరకూ సినిమాలు పూర్తి చేసేయాలని ఆయన ప్లాన్. ఇందులో భాగంగానే దిల్ రాజు చిరకాల వాంఛను నెరవేర్చనున్నారు పవర్ స్టార్. ఆయన నిర్మాతగా, హరీశ్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. ‘గబ్బర్ సింగ్’ తర్వాత పవన్, హరీశ్ కలిసి పనిచేస్తున్న చిత్రం కాబట్టి దీని స్థాయి ఏంటో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు.

ఎన్టీయార్ కూడా ఇదే ఏడాది మూడు క్రేజీ ప్రాజెక్టులను ప్లాన్ చేశాడు. అందులో మొదటిది త్రివిక్రమ్ తో కాగా, రెండోది ఎస్.ఎస్.రాజమౌళీతో. త్రివిక్రమ్ సినిమా త్వరలో పట్టాలెక్కేయనుంది. రాజమౌళి సినిమాకు 2018లోనే కొబ్బరికాయ కొట్టనున్నారు. ‘యమదొంగ’ తర్వాత వీరిద్దరూ కలిసి పనిచేసే సినిమా ఇదే. పైగా ఇది మల్టీస్టారర్. ఇందులో చరణ్ కూడా నటిస్తున్నాడు. ఎన్టీయార్, చరణ్, రాజమౌళి... ఇక ఇంతకు మించిన సన్సేషన్ ఏముంటుంది. ఇదే ఏడాది.. నాగచైతన్యతో కూడా నటించనున్నాడు తారక్. సి.అశ్వనీదత్ నిర్మాత. సాధ్యమైనంతవరకూ ఈ ఏడాదే ఈ సినిమా ఉంటుంది.

2018లో మరో క్రేజీ మూబీ అంటే..నాగార్జున, నానిల సినిమానే మల్టీస్టారర్ కథాంశంతో రూపొందుతోన్న ఈ సినిమాకు శ్రీరామ్ ఆదిత్య దర్శకుడు. ’శమంతమణి‘ లాంటి చిన్న సినిమాను తీసిన శ్రీరామ్ ఆదిత్యకు ఇంతపెద్ద బాధ్యత అప్పగించారంటే.. కథ ఏ స్థాయిలో తయారు చేసుకున్నాడో అర్థం చేసుకోవచ్చు.

ఈ ఏడాది ప్రారంభం కానున్న మరో మల్టీస్టారర్.. వెంకటేశ్, వరుణ్ తేజ్ ది. దిల్ రాజు ఈ సినిమాకు నిర్మాత కావడం విశేషం. అనిల్ రావిపూడి దర్శకుడు. సీతమ్మవాకిట్లో సిరిమల్లె పూవు, గోపాల గోపాల తర్వాత వెంకీ చేస్తున్న పూర్తి స్థాయి మల్టీస్టారర్ ఇదే.

ఇక మరో వెరైటీ కాంబినేషన్ విషయానికొస్తే... సమంత నిర్మాతగా మారి ఓ సినిమా చేస్తోంది. కన్నడంలో హిట్ అయిన ‘యూ టర్న్’ సినిమాకు మాతృక. హీరోయిన్ ఓరియెంటెడ్ కథాంశంతో రూపొందుతోన్న ఈ చిత్రంలో హీరోయిన్ కూడా తనే. ఈ సినిమా వ్యవహారం మొత్తం నాగచైతన్యే దగ్గరుండి చూసుకుంటున్నాడు. అలాగే... ‘యూటర్న్’ దర్శకుడితోనే సమంత మరో సినిమాను కూడా ప్లాన్ చేసింది. ఈ సినిమాలో కథానాయకునిగా నాగచైతన్య నటిస్తాడు. నిర్మాణ బాద్యతలు మాత్రం సమంత సమంతవి. హీరోయిన్ ఎవరో ఇంకా ఫిక్స్ కాలేదు.

ఇప్పటివరకూ 2018లో కొబ్బరికాయ కొట్టబోతున్న సన్సేషనల్ కాంబినేషన్స్ వివరాలివి. ముందు ముందు ఇంకొన్ని కూడా ఈ లిస్ట్ లో చేరొచ్చు. అదన్నమాట విషయం.


Also ReadLatest NewsCustomer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here