అల... టబు లుక్ వచ్చింది కానీ
on Nov 4, 2019
తెలుగు ప్రేక్షకులకు టబు పేరు చెబితే ముందు 'నిన్నే పెళ్ళాడతా' గుర్తొస్తుంది. అలాగే, 'కూలి నంబర్ 1', 'ఆవిడ మా ఆవిడే', 'సిసింద్రీ' కూడా! కథానాయికగా తెలుగులో చేసినవి తక్కువ సినిమాలు మాత్రమే అయినప్పటికీ... హిట్ సినిమాలు చేశారు. కొంత విరామం తర్వాత నందమూరి బాలకృష్ణతో 'చెన్నకేశవరెడ్డి', చిరంజీవితో 'అందరివాడేలే'లో నటించారు. ఇంకొన్ని సినిమాలు చేశారు. మళ్ళీ ఇప్పుడు అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న 'అల... వైకుంఠపురములో' కీలక పాత్రలో నటిస్తున్నారు. సోమవారం టబు పుట్టినరోజు సందర్భంగా సినిమాలో ఆమె లుక్ విడుదల చేశారు. లుక్ పరంగా పెద్ద హడావిడి లేదు. సింపుల్ గా ఉండేలా చూసుకున్నారు. అలా టబు లుక్ వచ్చింది కానీ, ప్రేక్షకుల్లో ఒక్కటే సందేహం... 'అత్తారింటికి దారేది', 'అ ఆ' సినిమాల్లో అత్తగా నటించిన నదియా, 'అజ్ఞాతవాసి'లో ఖుష్బూ క్యారెక్టర్స్ టైపులో టబు క్యారెక్టర్ ఉంటుందా? లేదా త్రివిక్రమ్ కొత్తగా డిజైన్ చేశాడా? అని! సినిమా విడుదలైతే తప్ప తెలియదు.