ENGLISH | TELUGU  

చుట్టాలు కలిసి నటించిన సినిమాలు ఎలా ఆడాయి?

on Oct 15, 2019

 

నిజ జీవితంలో మేనమామ, మేనల్లుళ్లు అయిన వెంకటేశ్, నాగచైతన్య.. 'వెంకీ మామ' మూవీలో అవే తరహా పాత్రల్లో హీరోలుగా నటిస్తున్నారు. ఈ విషయం ఇటీవల ఫస్ట్ గ్లింప్స్ పేరిట రిలీజైన వీడియో ద్వారా మనకు స్పష్టమైంది. అందులో చైతూని 'అల్లుడూ' అంటూ వెంకీ సంబోధించడం మనకు కనిపిస్తుంది. కె.ఎస్. రవీంద్ర డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా డిసెంబర్‌లో విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఒక్కసారి టాలీవుడ్ హిస్టరీని పరిశీలిస్తే, ఒక ఇంట్లోని వాళ్లు, చుట్టాలు కలిసి నటించిన సినిమాలు కొల్లలుగా కనిపిస్తాయి. అయితే మామా అల్లుళ్ల వరుస అయ్యేవాళ్లు కలిసి చేసిన సినిమాలు చాలా తక్కువగా కనిపిస్తాయి. ఇద్దరూ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమాలైతే.. ఇదివరకు రెండే కనిపిస్తాయి. వాటిలో ఒకటి అక్కినేని నాగేశ్వరరావు, వెంకటేశ్ కలిసి నటించిన 'బ్రహ్మరుద్రులు' మూవీ. వెంకటేశ్‌కు ఏఎన్నార్ మామయ్య వరుస అనేది అందరికీ తెలిసిన విషయమే. ఈ మూవీలోనూ వెంకీకి మేనమామగా అక్కినేని కనిపిస్తారు. అక్కినేని జడ్జిగా నటిస్తే, ఆయన చెల్లెలి కుమారుడిగా వెంకటేశ్ నటించాడు. ఇది హీరోగా వెంకీకి రెండో సినిమా. ఆయన తొలి సినిమా 'కలియుగ పాండవులు' వచ్చిన సంవత్సరమే ఈ సినిమా కూడా వచ్చింది. కె. మురళీమోహనరావు డైరెక్ట్ చేసిన ఈ మూవీ ప్రేక్షకుల్ని అలరించలేదు.

రెండో సినిమా.. నాగార్జున, ఆయన మేనల్లుడు సుమంత్ కలిసి నటించిన 'స్నేహమంటే ఇదేరా'. మలయాళ హిట్ ఫిల్మ్ 'ఫ్రెండ్స్'కు రీమేక్‌గా తమిళ దర్శకుడు బాలశేఖరన్ రూపొందించిన ఈ మూవీ 2001లో విడుదలైంది. ఈ మూవీలో నాగార్జున, సుమంత్.. ఇద్దరూ చైల్డ్‌హుడ్ ఫ్రెండ్స్‌గా కనిపించారు. మెలోడ్రామా, ట్విస్టులు ఎక్కువగా కనిపించే ఈ మూవీలో అపార్థాల కారణంగా విడిపోయిన స్నేహితులు చివరకు కలుస్తారు. కేవలం సుమంత్‌ను ప్రమోట్ చెయ్యడం కోసమే ఈ మూవీని నాగార్జున చేశాడంటూ అప్పట్లో ప్రచారంలోకి వచ్చింది. అయితే నాగ్ ఆశలు ఫలించలేదు. బాక్సాఫీస్ దగ్గర 'స్నేహమంటే ఇదేరా' ఫెయిలైంది. (ఈ మూవీ మన దగ్గర ఉంది)

మామా అల్లుళ్ల తరహాలో మామాకోడళ్లు నటించిన సినిమాను ఇటీవలే చూశాం. అది.. నాగార్జున, సమంత కలిసి నటించిన 'రాజుగారి గది 2'. ఓంకార్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో నాగార్జున మెంటలిస్టుగా నటిస్తే, తోటి విద్యార్థుల కారణంగా ఆత్మహత్యకు పాల్పడి, ఆత్మగా మారిన అమృత అనే స్టూడెంట్‌గా సమంత కనిపిస్తుంది. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా కూడా ఆశించిన రీతిలో ఆడలేదు. ఈ సినిమాకు ముందు కూడా నాగ్, సమంత కలిసి 'మనం' మూవీలో నటించినా, అప్పటికి వాళ్లిద్దరూ మామా కోడళ్లు కాలేదు.

ఇక తండ్రీకొడుకులు, అన్నాతమ్ముళ్లు కలిసి నటించిన సినిమాలు తెలుగులో ఎన్టీఆర్ కాలం నుంచే మనకు కనిపిస్తుంది. మరే తండ్రీకొడుకుల కాంబినేషన్‌లో రానన్ని సినిమాలు ఎన్టీఆర్, బాలకృష్ణ కాంబినేషన్‌లో వచ్చాయి. బాలయ్య చైల్డ్ ఆర్టిస్టుగా చేసిన సినిమాలను పక్కనపెడితే, ఎన్టీఆర్, బాలకృష్ణ కలిసి 'అన్నదమ్ముల అనుబంధం', 'వేములవాడ భీమకవి', 'దాన వీర శూర కర్ణ', 'అక్బర్ సలీం అనార్కలి', 'శ్రీ మద్విరాటపర్వం', 'శ్రీ తిరుపతి వేంకటేశ్వర కల్యాణం', 'రౌడీ రాముడు కొంటె కృష్ణుడు', 'అనురాగ దేవత', 'సింహం నవ్వింది', 'శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర', 'బ్రహ్మర్షి విశ్వామిత్ర' సినిమాలు వచ్చాయి. 'దాన వీర శూర కర్ణ'లో హరికృష్ణ కూడా నటించడం గమనార్హం. ఇది బాక్సాఫీస్ రికార్డుల్ని సృష్టించింది. 'సింహం నవ్వింది' డిజాస్టర్ అయ్యింది. అన్నదమ్ములైన హరికృష్ణ, బాలకృష్ణ బాలనటులుగా 'తాతమ్మ కల', 'రామ్ రహీమ్' సినిమాలో కలిసి నటించారు. బాబాయ్, అబ్బాయ్ అయిన బాలకృష్ణ, కల్యాణ్ రామ్ 'యన్.టి.ఆర్: కథానాయకుడు', 'యన్.టి.ఆర్: మహానాయకుడు' సినిమాల్లో కలిసి నటించారు. దురదృష్టవశాత్తూ ఆ రెండు సినిమాలూ డిజాస్టర్ అయ్యాయి.

ఎన్టీఆర్ - బాలకృష్ణ తర్వాత ప్రధాన పాత్రల్లో ఎక్కువగా కలిసి నటించిన తండ్రీకొడుకులు కృష్ణ, మహేశ్. అయితే వీటిలో అత్యధికం మహేశ్ చైల్డ్ ఆర్టిస్టుగా ఉన్నప్పుడు వచ్చినవే. 'పోరాటం', 'శంఖారావం', 'అన్నా తమ్ముడు', 'కొడుకు దిద్దిన కాపురం', 'ముగ్గురు కొడుకులు' సినిమాలను తన చిన్నతనంలో తండ్రితో కలిసి నటించాడు మహేశ్. పెద్దయ్యాక అతను కృష్ణతో కలిసి నటించిన సినిమాలు.. 'రాజకుమారుడు', 'వంశీ'. వీటిలో మొదటిది బాగానే ఆడగా రెండోది బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయ్యింది. 'ముగ్గురు కొడుకులు'లో కృష్ణ పెద్ద కొడుకు రమేశ్ కూడా నటించాడు. కృష్ణ, రమేశ్ కలిసి 'కలియుగ కర్ణుడు', 'ఆయుధం', 'నా ఇల్లే నా స్వర్గం' సినిమాల్లోనూ నటించారు. రమేశ్, మహేశ్ కలిసి 'బజారు రౌడీ' అనే హిట్ సినిమాలో నటించారు. అయితే అప్పుడు మహేశ్ బాలనటుడు.

తండ్రీ కొడుకులు అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున కాంబినేషన్‌లోనూ కొన్ని సినిమాలు వచ్చాయి. వాటిలో 'కలెక్టర్ గారి అబ్బాయి', 'మనం' సినిమాలు సక్సెస్ అవగా, 'అగ్నిపుత్రుడు', 'ఇద్దరూ ఇద్దరే' సినిమాలు ఫ్లాపయ్యాయి. 'శ్రీరామదాసు' ఓ మోస్తరుగా ఆడింది. చిన్నకొడుకు అఖిల్ పసివాడిగా ఉన్నప్పుడు నాగార్జున అతనితో ఒక సినిమా చేశాడు. అది.. 'సిసింద్రీ'. అఖిల్ టైటిల్ రోల్ చేసిన ఆ సినిమా ప్రేక్షకుల్ని అలరించింది. తాతా మనవళ్లయిన ఏఎన్నార్, సుమంత్ కలిసి 'పెళ్లి సంబంధం' అనే ఫ్లాప్ సినిమాలో నటించారు.

మోహన్ బాబు కుటుంబ సభ్యులు కూడా చాలా సినిమాల్లో కలిసి నటించారు. మోహన్‌బాబు, ఆయన ఇద్దరు కొడుకులు కలిసి 'పాండవులు పాండవులు తుమ్మెద' సినిమాలో కలిసి నటించారు. పెద్ద కొడుకు విష్ణుతో కలిసి డైలాగ్ కింగ్ 'సూర్యం', 'సలీం', 'గేమ్', 'రౌడీ', 'గాయత్రి' సినిమాల్లో నటించారు. అలాగే చిన్నకొడుకు మనోజ్‌తో 'శ్రీ', 'ఝుమ్మంది నాదం' సినిమాలు చేశాడు మోహన్ బాబు. ఇదే కుటుంబంలో అక్కాతమ్ముళ్లు మంచు లక్ష్మి, మనోజ్ కలిసి 'ఊ కొడతారా.. ఉలిక్కి పడతారా' సినిమాలో నటించారు. వీటిలో 'రౌడీ', 'ఝుమ్మంది నాదం' సినిమాలు మాత్రమే ఆడాయి.

చిరంజీవి కుటుంబానికి వచ్చేసరికి మెయిన్ రోల్స్‌లో ఇద్దరు కలిసి నటించిన సినిమాలేవీ లేవు. చిరంజీవి హీరోగా నటించిన పలు సినిమాల్లో ఆయన పెద్ద తమ్ముడు నాగబాబు నటించినా.. అవన్నీ చిన్న పాత్రలే. 'రాక్షసుడు', 'మరణ మృదంగం', 'త్రినేత్రుడు', 'కొండవీటి దొంగ', 'అంజి', 'మృగరాజు', 'ఖైదీ నంబర్ 150' సినిమాల్లో ఆ సోదరులిద్దరూ కలిసి నటించారు. కొడుకు రాంచరణ్ హీరోగా నటించిన రెండు సినిమాల్లో చిరంజీవి గెస్ట్ రోల్స్‌లో నటించారు. ఆ రెండు.. 'మగధీర', 'బ్రూస్ లీ' సినిమాలు. బావ బావమరుదులు చిరంజీవి, అల్లు అరవింద్ 'చంటబ్బాయ్' సినిమాలో కలిసి నటించారు. అందులో వాళ్లిద్దరి మధ్య వచ్చే ఫైట్లు కడుపుబ్బ నవ్వించాయి. ఇక తన మామ అల్లు రామలింగయ్యతో కలిసి చిరంజీవి నటించిన సినిమాలెన్నో. చిరంజీవి హీరోగా చేసిన యావరేజ్ మూవీ 'డాడీ'లో బాల నటుడిగా అల్లు అర్జున్ కనిపించాడు. అలాగే 'సైరా' మూవీలో నాగబాబు కుమార్తె నిహారికను ఒక చిన్న పాత్రలో చూశాం. పవన్ కల్యాణ్ సినిమా 'అన్నవరం'లో నాగబాబు పోలీసాఫీసర్ కేరెక్టర్‌లో కనిపిస్తాడు. వరుసకు మేనమామ, మేనల్లుళ్లు అయ్యే నాగబాబు, అల్లు శిరీష్ 'ఏబీసీడీ' సినిమాలో తండ్రీ కొడుకులుగా నటించడం గమనార్హం. అలాగే మేనల్లుడు సాయిధరం తేజ్‌తో కలిసి నాగబాబు 'సుబ్రమణ్యం ఫర్ సేల్' సినిమాలో నటించాడు. వరుసకు బావ బావమరుదులయ్యే రాంచరణ్, బన్నీ 'ఎవడు' మూవీలో నటించారు. అందులో బన్నీది చిన్న పాత్ర. పైగా ఆ ఇద్దరి కాంబినేషన్‌లో సన్నివేశాలుండవు.

ఇవాళ పాన్ ఇండియా స్టార్‌గా పేరు తెచ్చుకున్న ప్రభాస్.. తన పెదనాన్న రెబల్ స్టార్ కృష్ణంరాజుతో రెండు సినిమాల్లో నటించాడు. వాటిలో 'బిల్లా' యావరేజ్‌గా అడగా, 'రెబెల్' మూవీ ఫ్లాపయింది. అన్నదమ్ములైన ఆర్యన్ రాజేశ్, అల్లరి నరేశ్ కలిసి ఒక సినిమాలో హీరోలుగా నటించారు. వాళ్ల తండ్రి ఇ.వి.వి సత్యనారాయణ డైరెక్ట్ చేసిన ఆ మూవీ 'నువ్వంటే నాకిష్టం'. బాక్సాఫీస్ దగ్గర ఆ మూవీ సరిగా ఆడలేదు. సంఖ్యాపరంగా చూసినప్పుడు ఒక కుటుంబసభ్యులు, దగ్గరి చుట్టాలు కలిసి నటించిన సినిమాల్లో కొన్ని మాత్రమే బాక్సాఫీస్ దగ్గర సక్సెసవడం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో విడుదలవుతున్న 'వెంకీ మామ' మూవీ ఎలా ఆడుతుందో చూడాలి.


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.