ప్రొడ్యూసర్ టెన్షన్స్... 'ఆర్ఆర్ఆర్'కు రామ్చరణ్ బ్రేక్!
on Oct 3, 2019
'సైరా నరసింహారెడ్డి' సినిమాతో తనకు ప్రొడ్యూసర్ టెన్షన్స్ ఎలా ఉంటాయో తెలిసిందని రామ్చరణ్ అన్నాడు. తండ్రి చిరంజీవి హీరోగా ఆయన నిర్మించిన 'సైరా' బుధవారం సినిమా విడుదలైంది. ప్రేక్షకుల నుండి రెస్పాన్స్ బాగుంది. తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ. 85 గ్రాస్ కలెక్ట్ చేసిందని డిస్ట్రిబ్యూటర్ కమ్ నిర్మాత ప్రొడ్యూసర్ 'దిల్' రాజు సక్సెస్ మీట్ లో చెప్పారు. ఇంకెందుకు టెన్షన్? ఎవరి మదినైనా తొలిచే ప్రశ్న ఇదే. విడుదల తర్వాత కాదు, విడుదల ముందు రామ్చరణ్ చాలా టెన్షన్ పడ్డాడట. ఆ టెన్షన్స్ వల్ల 'ఆర్ఆర్ఆర్' షూటింగుకు బ్రేక్ కూడా ఇచ్చేశాడు.
"ఎందుకో తెలియదు నెలన్నరగా సరిగా నిద్ర పట్టలేదు. సాధారణంగా షూటింగ్ లేకపోతే నేను ఉదయాన్నే నిద్రలేవను. కొంచెం కంఫర్టబుల్ గా నిద్ర లేస్తాను. 'సైరా' పనులతో రాజమౌళిగారి దర్శకత్వం చేస్తున్న 'ఆర్ఆర్ఆర్' షూటింగ్ నుండి బ్రేక్ అడిగాను. అయినా... రాత్రిపూట మూడున్నర గంటలకు ఉలిక్కిపడి లేచేవాడిని. బహుశా... మన ఇండస్ట్రీలో ఉన్న నిర్మాతలు అందరూ అలా ఉలిక్కిపడి లేస్తారేమో. అప్పుడప్పుడూ సెట్ లో రాజమౌళి, తారక్ 'ఏంటబ్బాయ్! స్ట్రెస్ గా ఉన్నావ్?' అని అడిగేవారు. నేను ఉండి ఉండవచ్చు. లేదా లేకపోవచ్చు. నేను నిర్మాతలను ఇబ్బందిపెట్టే యాక్టర్ కాదు. కానీ, ఒక్కసారి నా నిర్మాతలు అందరూ నాకు గుర్తొచ్చారు" అని 'సైరా' సక్సెస్ మీట్ లో రామ్ చరణ్ అన్నాడు.