మెగాస్టార్ ఇమేజ్ తెలిసిన మ్యూజిక్ డైరెక్టర్ అయితే?
on Oct 2, 2019
'సైరా నరసింహారెడ్డి' సినిమా విడుదలైంది. సమీక్షలు వచ్చేశాయి. సగటు ప్రేక్షకులు, మెగాస్టార్ చిరంజీవి అభిమానులు కూడా సోషల్ మీడియాలో తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఓ రకంగా సినిమాపై అవీ ప్రభావం చూపిస్తాయి. ఎవరి సమీక్ష ఏంటనేది పక్కన పెడితే... ప్రేక్షకులు, విమర్శకులు అనే వ్యత్యాసం లేకుండా సర్వత్రా 'సైరా' సంగీతానికి మైనస్ మార్కులు పడుతున్నాయి.
మెగాస్టార్ ఇమేజ్ తెలిసిన మ్యూజిక్ డైరెక్టర్ అయితే బావుండేదని మెగాభిమానులు లోలోపల బాధ పడుతున్నారు కూడా. హీరోయిజమ్ ఎలివేట్ చేసే సన్నివేశాల్లో ఆశించిన రీతిలో రీరికార్డింగ్ లేదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. హిందీలో సల్మాన్ ఖాన్ సినిమాలు కొన్నిటికి రీరికార్డింగ్ చేసిన జూలియస్ ప్యాకియం 'సైరా'కు రీ రికార్డింగ్ చేశారు. అతడికి మెగాస్టార్ ఇమేజ్ తెలిసినా లేదా తెలుగు ప్రేక్షకుల పల్స్ తెలిసినా రీ రికార్డింగ్ వేరేలా ఉండేది. ఇక, పాటలు కూడా చార్ట్ బస్టర్స్ కాదు. మాస్ ప్రేక్షకులను ఊపేసేలా లేవు. ఇండియా అంతటా సినిమాను విడుదల చేసే దృష్టితో, హిందీ ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి అక్కడ యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అమిత్ త్రివేదిని తీసుకున్నారు. అతడు హాలీవుడ్ స్టైల్ లో పాటలు కంపోజ్ చేశాడు. అదే తెలుగు ప్రేక్షకుల పల్స్ తెల్సిన కీరవాణి, దేవిశ్రీ ప్రసాద్, తమన్ వంటి మ్యూజిక్ డైరెక్టర్స్ చేతిలో పాటలు, రీ రికార్డింగ్ పెడితే వేరే లెవెల్ లో 'సైరా' మ్యూజిక్ ఉండేది.