వెండితెరపై చిరంజీవికి ఇది కొత్త జన్మ!
on Oct 2, 2019
మెగాస్టార్ అంటే మాస్ ప్రేక్షకుల చేత విజిల్స్ వేయించే డ్యాన్సులు... మెగాస్టార్ అంటే థియేటర్లలో ప్రేక్షకులు అందరూ మూకుమ్మడిగా క్లాప్స్ కొట్టే ఫైట్స్... ఇక మెగాభిమానులు అయితే మళ్ళీ మళ్ళీ చూసేలా, వాళ్ళకు కిక్ ఎక్కించేలా పంచ్ డైలాగులు. వీటికి కామెడీ సీన్స్ ఎక్స్ట్రా. మాస్ థియేటర్లలో మెగాస్టార్ సినిమా ఫస్ట్ డే మార్నింగ్ షోలు చూస్తే... అభిమానులు గోల గోల చేస్తూ చూస్తారు. ముప్ఫై ఏళ్ళుగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో తన స్థానాన్ని మెగాస్టార్ కాపాడుకుంటున్నారంటే కారణం అదే. 'ఖైదీ నంబర్ 150' కూడా అటువంటి చిత్రమే. ప్రేక్షకులు గోల గోల చేస్తూ చూశారు.
ఒకవేళ అలా గోల గోల చేయలేదంటే సినిమా బాలేదని కారణం. అటువంటి డ్యాన్సులు, ఫైటులు, పంచ్ డైలాగులు ఏవీ 'సైరా నరసింహారెడ్డి'లో లేవు. ఫ్యాన్స్ సినిమా చూస్తున్నారు. గోల గోల చేయడం లేదు. అలాగని, ఎవరూ సినిమా బాలేదని చెప్పడం లేదు. బావుందంటున్నారు. బాగా సంతోషంలో ఉన్నారు. కామన్ ఆడియన్స్ లోనూ 'సైరా'కు నెగిటివ్ టాక్ లేదు. ప్రతి ఒక్కరూ తీసి పారేసే సినిమా కాదని అంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి సినిమాను ప్రేక్షకులు ఇలా చూడటం ఇదే మొదటిసారి. మెగాస్టార్ కూడా తన ఇమేజ్ నుండి బయటకొచ్చి చేసిన మొట్టమొదటి సినిమా ఇది. బహుశా... వెండితెరపై చిరంజీవికి ఇది కొత్త జన్మ అనుకోవాలి. ప్రయోగాలు చేయడానికి. కొత్త కథలు చేయడానికి ముందడుగు వేయడానికి చిరంజీవికి ధైర్యాన్ని ఇచ్చే సినిమా 'సైరా'. సినిమాలో మైనస్ పాయింట్స్ లేవని కాదు. కానీ, మెజార్టీ ప్రేక్షకులను మెప్పించేలా ఇటువంటి సినిమా తీయడం గొప్పే.