అల్లు అర్జున్... ప్యాక్ యువర్ బ్యాగ్స్!
on Sep 28, 2019
‘ప్యాక్ యువర్ బ్యాగ్స్’ – ‘అల... వైకుంఠపురములో’ అల్లు అర్జున్ పని చేసే మల్టీ నేషనల్ కంపెనీ (ఎంఎన్‌సి) పేరు. ప్యాక్ యువర్ బ్యాగ్స్ అంటే తెలుగులో ‘మీ బ్యాగులు సర్దుకోండి’ అని మీనింగ్. మరి, సినిమాలో అల్లు అర్జున్ ఎవరిని బ్యాగులు సర్దుకోమంటాడో చూడాలి. అది టబు కంపెనీ అనీ, అందులో అల్లు అర్జున్ పని చేస్తున్న సమయంలో హీరోయిన్ పూజా హెగ్డేతో ప్రేమలో పడతాడనీ టాక్. సినిమాలో హీరో, హీరోయిన్ క్యారెక్టర్లను రొటీన్‌గా కాకుండా ఏదో ఒక ట్విస్ట్‌తో డిజైన్ చేయడం త్రివిక్రమ్‌కు అలవాటు. ‘జల్సా’లో పవన్‌కల్యాణ్‌ను కాలేజీలో చేరిన నక్సలైట్‌గా చూపించారు. ‘అతడు’లో మహేష్‌బాబును, ‘అరవింద సమేత వీరరాఘవ’లో ఎన్టీఆర్‌ను హత్యలు జరిగిన తర్వాత పరాయి ఇంట్లో తల దాచుకుంటున్న వ్యక్తులుగా చూపించారు.
‘అత్తారింటికి దారేది’లో వేల కోట్లకు వారసుడు అయిన పవన్‌కల్యాణ్‌ను డ్రైవర్‌గా చూపించారు. అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్లో రెండు సినిమాలు వచ్చాయి. మొదటి సినిమా ‘జులాయి’లో టైటిల్‌కి తగ్గట్టు జులాయి, తర్వాత ఘరానా బ్యాంకు దొంగ ఆట కట్టించిన తెలివైనవాడిగా చూపించారు త్రివిక్రమ్. ‘సన్నాఫ్ సత్యమూర్తి’లో తండ్రిని గౌరవించి, ఆయన మాటకు కట్టుబడిన కొడుకుగా చూపించారు. ‘అల... వైకుంఠపురములో’ ఎలా చూపిస్తారో? సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా పబ్లిసిటీ ఇప్పటి నుండి మొదలుపెట్టారు. తొలి పాట ‘సామజవరగమన’ విడుదల చేశారు.