ENGLISH | TELUGU  

మెగా హీరోల్లో టాప్ ప్లేస్ ఎవరిది?

on Sep 28, 2019

 

ఇది చాలా ఆశ్చర్యం కలిగించే అంశం. ఇమేజ్ పరంగా టాప్‌లో ఉన్నవాళ్లతో పోలిస్తే, తక్కువ ఇమేజ్, స్టార్‌డం ఉన్నవాళ్ల సినిమాలు బాక్సాఫీస్ పరంగా టాప్‌లో ఉండటం ఆశ్చర్యం కలిగించకుండా ఉంటుందా? మనం ఇప్పుడు మెగా కాంపౌండుకు సంబంధించిన స్టార్స్ గురించే మాట్లాడుకోబోతున్నాం. ఆ మెగా హీరోల సినిమాలు సాధించిన కలెక్షన్స్‌కూ, వాళ్ల స్టార్‌డంకూ సంబంధం లేకపోవడం మనం గమనించవచ్చు.

మెగా కాంపౌండ్ అనే మాట పుట్టింది మెగాస్టార్ చిరంజీవి వల్లే అని మనందరికీ తెలుసు. అమితమైన దీక్షా దక్షతలతో, ఎంతో హార్డ్‌వర్క్‌తో, స్వయంకృషితో 'మెగాస్టార్'గా చిరంజీవి ఎదిగారు. రెండు దశాబ్దాల కాలం పైగా టాలీవుడ్‌లో తిరుగులేని స్టార్‌గా చలామణీ అయ్యారు. ఆయన వేసిన బాటలో ఆయన చిన్న తమ్ముడు పవన్ కల్యాణ్, కొడుకు రాంచరణ్, మేనల్లుడు అల్లు అర్జున్, తమ్ముడి కొడుకు వరుణ్ తేజ్, మరో మేనల్లుడు సాయిధరం తేజ్ వంటివాళ్లు హీరోలుగా పరిచయమై, రాణిస్తున్నారు. పవన్ కల్యాణ్ పవర్ స్టార్‌గా నీరాజనాలు అందుకున్నారు. చిరంజీవి తర్వాత అంతటి ప్రేక్షాదరణ పొందిన హీరోగా పేరు పొందారు. కొంతకాలం క్రితం క్రియాశీల రాజకీయాల్లో అడుగుపెట్టి, సినిమాలకు విరామం ప్రకటించారు.

ఇక తర్వాతి తరం వాళ్లలో అల్లు అర్జున్, రాంచరణ్ హీరోలుగా పరిచయమై, స్టార్లుగా ఎదిగి మెగా కాంపౌండుకు మరింత బలం చేకూర్చారు. సాయిధరం తేజ్ హీరోగా కొన్ని సక్సెస్‌లు సాధించినా, స్టార్‌డం సాధించే క్రమంలో తప్పటడుగులు వేస్తున్నాడు. ఇక ఊహించిన దానికి మించి నటుడిగా ఎదిగి, స్టార్‌గా మారాడు వరుణ్ తేజ్. విచిత్రమేమంటే, బాక్సాఫీస్ దగ్గర అల్లు అర్జున్ కంటే వరుణ్ తేజ్ ఆధిక్యంలో నిలవడం. అవును.. బ్లాక్‌బస్టర్ మూవీ 'ఎఫ్ 2'తో వరుణ్ ఈ ఘనతను సాధించాడు. కాకపోతే ఈ మూవీలో వరుణ్ సోలో హీరో కాడు. సీనియర్ స్టార్ వెంకటేశ్ అందులో ప్రధాన పాత్ర పోషించాడు. అయితే ఆ మూవీలో వరుణ్ సైతం హీరోయే కాబట్టి అతని ఖాతాలోనూ ఈ సినిమా ఉన్నట్లే.

'ఎఫ్ 2' మూవీ వరల్డ్ వైడ్‌గా 81 కోట్ల షేర్ కలెక్ట్ చేయగా, బన్నీ కెరీర్ బెస్ట్ ఫిల్మ్ అయిన 'సరైనోడు' 71 కోట్ల షేర్ వసూలు చేసింది. అంటే.. బాక్సాఫీస్ పరంగా బన్నీ కంటే వరుణ్ 10 కోట్ల రూపాయల ఆధిక్యంలో ఉన్నాడన్న మాట. ఆ మాటకొస్తే.. పవన్ కల్యాణ్ కంటే కూడా అతను ఎత్తులో ఉన్నట్లు లెక్క. ఎందుకంటే పవర్ స్టార్ కెరీర్ టాప్ ఫిల్మ్ 'అత్తారింటికి దారేది' వరల్డ్ వైడ్‌గా రాబట్టిన షేర్ 75 కోట్ల రూపాయలు! ఆ ప్రకారం చూస్తే.. వరుణ్ కంటే పవన్ ఇంకా 6 కోట్ల రూపాయల దూరంలో ఉన్నాడు.

ఇక మెగా హీరోల్లో అగ్రస్థానం చిరంజీవిది కాదు.. ఆయన తనయుడు రాంచరణ్‌ది. ఆయన హీరోగా నటించిన 'రంగస్థలం' మూవీ దాదాపు 120 కోట్ల షేర్ సాధించి నంబర్ వన్ పొజిషన్‌లో ఉండగా, రెండున్నరేళ్ల క్రితం మెగాస్టార్ సెకండ్ ఇన్నింగ్స్‌కు వేదికగా నిలిచిన 'ఖైదీ నంబర్ 150' మూవీ 102 కోట్ల షేర్ కలెక్ట్ చేసి సెకండ్ ప్లేస్‌లో నిలిచింది. అక్టోబర్ 2న రానున్న 'సైరా.. నరసింహారెడ్డి' సినిమాతో చిరంజీవి అగ్ర స్థానం దక్కించుకోవడం ఖాయం.

ఇప్పటివరకూ హయ్యెస్ట్ షేర్ సాధించిన సినిమాల పరంగా చూసుకుంటే రాంచరణ్ టాప్‌లో ఉండగా, రెండో స్థానంలో చిరంజీవి నిలిచారు. తర్వాతి స్థానాల్లో వరుసగా వరుణ్ తేజ్, పవన్ కల్యాణ్, అల్లు అర్జున్ ఉన్నారు. రానున్న రోజుల్లో అల్లు అర్జున్ తన ఇమేజ్‌కు తగ్గ భారీ విజయం సాధించి, ఈ కమర్షియల్ లెక్కల్ని మారుస్తాడని, మెగా హీరోల్లో కనీసం మూడో స్థానంలో నిలుస్తాడని ఆశించవచ్చు.


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.