సుకుమార్‌తో బన్నీ మూడో సినిమాకి ముహూర్తం కుదిరింది
on Sep 6, 2019
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించే సినిమాకు ముహూర్తం కుదిరింది. అక్టోబర్ 3న ఈ సినిమా లాంఛనంగా ప్రారంభం కానున్నది. అక్టోబర్ 20న సెట్స్‌పైకి వెళ్లనున్నది. బన్నీ, సుక్కు కాంబినేషన్లో ఇది మూడో సినిమా. ఇదివరకు ఆ ఇద్దరి కాంబినేషన్లో 'ఆర్య', 'ఆర్య 2' సినిమాలు వచ్చాయి. వీటిలో 'ఆర్య' (2004).. డైరెక్టర్‌గా సుకుమార్ ఫస్ట్ ఫిల్మ్. బ్లాక్‌బస్టర్ అయినా ఆ సినిమాతో రాత్రికి రాత్రే సుక్కు టాప్ డైరెక్టర్స్ లీగ్‌లోకి వెళ్తే, బన్నీ స్టార్‌గా మారాడు. ఆ తర్వాత వాళ్ల కలయికలో వచ్చిన 'ఆర్య 2' మూవీ ఆంధ్రా, రాయలసీమ ఏరియాల్లో బయ్యర్లకు లాభాలు పంచి, నైజాంలో తెలంగాణ ఉద్యమమంలో భాగంగా జరిగిన థియేటర్ల సమ్మె వల్ల నష్టపోయింది.
ఆ సినిమా వచ్చి పదేళ్లవుతోంది. ఇన్నాళ్లకు మళ్లీ వారి జోడీ కుదిరింది. నిజానికి ఈ జోడీ కుదరడానికి కారణం మహేశ్. 'మహర్షి' మూవీ తర్వాత సుకుమార్ డైరెక్షన్లో చెయ్యడానికి రెడీ అయిన మహేశ్, తర్వాత 'క్రియేటివ్ డిఫరెన్సెస్' కారణంగా ఆ సినిమా నుంచి తప్పుకున్నాడు. సుకుమార్ అంటే తనకు ఎంతో గౌరవమనీ, అతని డైరెక్షన్లో తను చేసిన '1.. నేనొక్కడినే'ని క్లాసిక్‌గా తాను భావిస్తాననీ, భవిష్యత్తులో సుకుమార్‌తో కలిసి పనిచేస్తాననీ వివరణ కూడా ఇచ్చాడు. అలా మహేశ్‌తో ప్లాన్ చేసిన స్టోరీని బన్నీకి వినిపించాడు సుకుమార్. బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆ ప్రాజెక్ట్ వాస్తవ రూపంలోకి వస్తోంది. ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది.
బన్నీ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో 'అల.. వైకుంఠపురములో..' సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.