హీరోలు దమ్ము కొడితే తప్పు లేదా?
on Aug 6, 2019
'మన్మథుడు 2' టీజర్ చూశారా? సినిమాలో హీరోయిన్ పాత్రను పరిచయం చేస్తూ ప్రత్యేకంగా ఒకటి విడుదల చేశారు. ఆ టీజర్ చివరిలో రకుల్ ప్రీత్ సింగ్ దమ్ము కొడుతూ కనిపించారు. ఆ సన్నివేశం గురించి ఆమె వద్ద ప్రస్తావిస్తే... "నిజ జీవితంలో నేను సిగరెట్లు కాల్చను. ఆ పాత్ర ప్రకారం ఒకటి రెండు సన్నివేశాల్లో దమ్ము కొట్టాల్సివచ్చింది. దమ్ము కొట్టడం గురించో, మరొక అంశం గురించో సినిమా తీయలేదు. సినిమాలో అంతకు మించి విషయం ఉంది. కుటుంబ అనుబంధాలు, విలువల గురించి చెప్పిన చిత్రమిది. అయినా... హీరోలు దమ్ము కొడితే ఎవరు అడగరు. హీరోయిన్ దమ్ము కొడితే మాత్రం అందరూ అడుగుతారు" అని అన్నారు. హీరోలు దమ్ము కొడితే తప్పులేదన్నట్టు మాట్లాడతారని అన్నట్టు ఒక లుక్ ఇచ్చారు. ఈ చిత్రంలో నటించాక నాగార్జునపై గౌరవం పెరిగింది అని ఆమె అన్నారు. యూనిట్ సభ్యులందరికీ ఆయన ఎంతో గౌరవం ఇస్తారు అని చెప్పుకొచ్చారు. 'మన్మథుడు 2'లో తాను పోషించిన అవంతిక తరహా పాత్ర ఇప్పటివరకు చేయలేదని రకుల్ ప్రీత్ సింగ్ తెలిపారు. కథ ప్రకారం హీరో హీరోయిన్ల మధ్య వయసులో పాతికేళ్ల వ్యత్యాసం ఉంటుందని... వారిద్దరూ ఎలా ప్రేమలో పడ్డారో ఆగస్టు 9న థియేటర్లలో చూడమని చెప్పారు.