నక్సలైట్ అవతారం ఎత్తనున్న మెగాస్టార్ !
on Aug 3, 2019
'సైరా.. నరసింహారెడ్డి' సినిమాలో నటిస్తున్న మెగాస్టార్ చిరంజీవి ఆ సినిమా షూటింగ్ పూర్తవడంతో, కొరటాల శివ డైరెక్షన్లో చేసే సినిమా కోసం సిద్ధమవుతున్నారు. ఈ సినిమా చిరంజీవి పుట్టినరోజు అయిన ఆగష్టు 22న అఫీషియల్ గా ప్రారంభం కానుందని ప్రచారం జరుగుతోంది. ఇంకా ఈ విషయం మీద క్లారిటీ రాలేదు కానీ ఈ సినిమాలో చిరు పాత్రకు సంబంధించి ఒక ఆసక్తికర విషయంపై ఫిలింనగర్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
అదేంటంటే.. ఈ సినిమాలో చిరు డబుల్ రోల్లో కనిపించనుండగా అందులో ఒకటి నక్సలైట్ పాత్ర అని ప్రచారం జరుగుతోంది. న్యాయం కోసం పోరాడే నక్సలైట్ పాత్రలో చిరంజీవి కనిపిస్తారని టాక్. ఈ క్యారెక్టర్ కోసం చిరంజీవి బరువు తగ్గుతున్నారని, దాని కోసం ఆయన కేరళకు వెళ్లనున్నారని చెబుతున్నారు. ఇక నక్సలైట్ పాత్ర కోసం చిరు అక్కడక్కడా నెరిసిన జట్టుతో కనిపిస్తారని సమాచారం.
తన ప్రతి సినిమాలో ఏదో ఒక సామాజిక సందేశాన్ని ఇచ్చే కొరటాల.. చిరు కోసం అదిరిపోయే స్క్రిప్ట్‌ను సిద్ధం చేశాడని టాక్. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాలో చిరు సరసన మరోసారి కాజల్ ని ఫిక్స్ చేసినట్లుగా చెబుతున్నారు. అంతేకాక ఐశ్వర్య రాయ్ గెస్ట్ అప్పీరియన్స్ కూడా ఈ సినిమాలో ఉంటుందని అంటున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించనున్న ఈ సినిమాని వచ్చే ఏడాది వేసవికి రిలీజ్ చేసే అవకాశాలున్నాయి.