బిగ్‌బాస్-3 హోస్ట్ గా ఎన్టీఆర్.. త్వరలోనే షూటింగ్ స్టార్ట్!!
on Jan 26, 2019
బిగ్‌బాస్ రియాలిటీ షో. తక్కువ కాలంలో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన షో. బిగ్‌బాస్ సీజన్-1 కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించారు. తన కామెడీ టైమింగ్, చలాకీతనంతో ఎన్టీఆర్ మొదటి సీజన్ ని పెద్ద హిట్ చేసారు. శని, ఆది వారాల్లో ఎన్టీఆర్ కోసం, ఎన్టీఆర్ మాటల కోసం ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూసేవారు. మొత్తానికి ఎన్టీఆర్ తన మార్క్ తో బిగ్ బాస్ సీజన్ 1 ని హిట్ చేసారు. తరువాత రెండో సీజన్ కి నేచురల్ స్టార్ నాని హోస్ట్ చేసారు. మొదట్లో ఎన్టీఆర్ తో పోలుస్తూ కొందరు విమర్శలు చేసినా.. నాని కూడా తనదైన శైలిలో హోస్ట్ గా అలరించారు. రెండో సీజన్ కూడా ప్రజాదరణ పొందింది. ఇప్పుడు మూడో సీజన్ వంతు వచ్చింది.
బిగ్‌బాస్ సీజన్-3కి చకచకా సన్నాహాలు జరిగిపోతున్నాయనే విషయం తెలిసిందే. కొద్ది రోజుల క్రితం పార్టిసిపెంట్స్ పేర్లు కూడా బయటకు వచ్చాయి. అయితే వారిలో ఎవరుంటారు? ఎవరుండరు? అనే విషయాల్లో స్పష్టత లేదు. ఇకపోతే ఇప్పుడు నడుస్తున్న పెద్ద చర్చ ఏంటంటే.. ‘బిగ్‌బాస్-3’కి హోస్ట్ ఎవరు? చిరంజీవి అని కొందరు.. వెంకటేష్ అని మరికొందరు ఇలా తోచిన పేర్లు వారు ఊహిస్తున్నారు. కానీ తాజాగా ఎన్టీఆర్ పేరు తెరపైకి వచ్చింది. బిగ్ బాస్ ప్రజల్లోకి ఇంతలా వెళ్ళడానికి ఒకరకంగా మొదటి సీజన్ హోస్ట్ చేసిన ఎన్టీఆరే కారణం. అందుకే సీజన్ -3కి హోస్ట్‌గా ఎన్టీఆర్‌ను తీసుకోవాలని నిర్వాహకులు భావిస్తున్నారట. ఈ మేరకు ఆయనను ఒప్పించేందుకు చేసిన ప్రయత్నాలు కూడా సఫలమయ్యాయట. ఎన్టీఆర్ సీజన్-3 చేసేందుకు ఒప్పుకున్నాడట. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మల్టీస్టారర్‌లో ఎన్టీఆర్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఆ షూటింగ్‌కి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా నిర్వాహకులు ఏర్పాట్లు చేయనున్నారని సమాచారం. అంటే ఎన్టీఆర్ మరోసారి బుల్లితెరమీద సందడి చేయబోతున్నారన్నమాట.