బాలకృష్ణ పెద్ద కమెడియన్!
on Dec 10, 2018
తెలుగు ప్రేక్షకులు అందరికీ తెలిసిన హీరోల్లో నందమూరి బాలకృష్ణ ఒకరు. కానీ, ఆయన ఎవరో తనకు తెలియదని మెగా బ్రదర్ నాగబాబు లేటెస్ట్ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఈ స్టేట్మెంట్ విని ఇంటర్వ్యూ చేసిన జర్నలిస్ట్ అవాక్కయ్యారు. పాత తరం నటుల్లో బాలకృష్ణ అని ఒక నటుడు వున్నారని చెప్పుకొచ్చారు. అప్పుడు ఇంటర్వ్యూ చేస్తున్న వ్యక్తి నందమూరి బాలకృష్ణ గురించి ఈ ప్రశ్న అని మరోసారి ప్రస్తావన తీసుకురాగా... "ఆయనెవరో నాకు తెలియదు. అయామ్ సారీ" అని నాగబాబు స్పష్టంగా చెప్పారు. నాగబాబు మాటలపై ఆదివారం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో మెగా బ్రదర్ మరోసారి సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశారు.
బాలకృష్ణ ఎవరో తనకు తెలియదని చెప్పడం తప్పని నాగబాబు తాజా వీడియోలో పేర్కొన్నారు. వీడియో చూస్తున్నవారు బాలకృష్ణకు నాగబాబు సారీ చెబుతారేమో అనుకునేట్టు మాట్లాడారు. తరవాత అందరికీ మైండ్ బ్లాంక్ అయ్యే ట్విస్ట్ ఇచ్చారు. బాలకృష్ణ పెద్ద కమెడియన్ అని నాగబాబు కూసింత వ్యంగ్య ధోరణిలో మాట్లాడారు. ఆ తరవాత అసలు ట్విస్ట్ ఇచ్చారు. పాత కాలం నటుల్లో అంజిగాడుగా ప్రసిద్ధి చెందిన వల్లూరి బాలకృష్ణ ఫొటో బయటకు తీశారు. సూపర్ స్టార్ కృష్ణ నటించిన 'అసాధ్యుడు' సినిమాలో ఆయన చక్కటి హాస్యం పండించారని పేర్కొన్నారు. అప్పటివరకూ బాలకృష్ణ బాలకృష్ణ అని నాగబాబు అంటుంటే అందరూ నందమూరి బాలకృష్ణ గురించి మాట్లాడుతున్నారని అనుకున్నారు. చివరికి పెద్ద ట్విస్ట్ ఇచ్చారు.
నందమూరి బాలకృష్ణ హీరో మాత్రమే కాదు... ఎమ్మెల్యే కూడా. తండ్రి ఎన్టీఆర్ వారసత్వంతో తెలుగు తెరపై అడుగుపెట్టిన ఆయన వందకుపైగా సినిమాలు చేశారు. అలాగే, తండ్రి ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రాజకీయాల్లో ఒక్కప్పటి తమ మిత్రుడు, ప్రస్తుత శత్రువు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఎవరో తనకు తెలియదని ఈ ఏడాది ప్రారంభంలో బాలకృష్ణ వ్యాఖ్యానించారు. అందుకు బదులుగా నాగబాబు ఇప్పుడు కౌంటర్ ఇచ్చారు.