ఆర్ఆర్ఆర్ సెట్టే రాజమౌళి ఇల్లు!
on Nov 13, 2018
రాజమౌళి ఆశ, శ్వాస, ధ్యాస సినిమాయే. తన ప్రయాణంలో కుటుంబ సభ్యులనూ భాగస్వామ్యుల్ని చేస్తారు. రాజమౌళి కుటుంబమంతా ఆయన సినిమాకు పని చేస్తారు. సినిమా జీవితాన్ని, వ్యక్తిగత జీవితాన్ని ఆయన వేరు చేసి చూడరు. అందుకని, సినిమా సెట్లోనే ఒక ఇల్లు కట్టించుకున్నారు. హైదరాబాద్ శివార్లలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో 'ఆర్ఆర్ఆర్' కోసం భారీ సెట్ వేశారు. అందులో రాజమౌళి కోసం ఒక ఇల్లు కట్టారు. దాన్నే ఆయన ఆఫీసుగా వాడుకోనున్నారు. ఆ ఇంటిలో ఎడిటింగ్ కోసం ఒక గది, కాస్ట్యూమ్స్ కోసం మరో గది, ఆఫీసు కోసం ఇంకో గది ఏర్పాటు చేశారని తెలిసింది. ఆయనతో పాటు రామ్ చరణ్, ఎన్టీఆర్ కోసం ప్రత్యేకంగా రెండు గదులు ఏర్పాటు చేశారు. వాటిని హీరోలు తమ ఆఫీసులుగా ఉపయోగించుకుంటారు. 'రామ రావణ్య రాజ్యం' టైటిల్ పరిశీలనలో వున్న ఈ సినిమా చిత్రీకరణ ఈ నెల 19 నుంచి మొదలు కానుంది. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకు ఎంఎం కీరవాణి సంగీత దర్శకుడు.