ఎన్టీఆర్‌కి 30 కోట్లు... రామ్‌చరణ్‌కి 30 కోట్లు!?
on Oct 26, 2018
రాజమౌళి సినిమా అంటే మాటలు కాదు. ఏళ్లకు ఏళ్లు సినిమాను చెక్కుతూ వుంటారు. రాజమౌళి ఎన్ని సంవత్సరాలు సినిమాను చెక్కితే... హీరో అన్ని సంవత్సరాలు సినిమాకు అంకితం కావలసిందే! ప్రభాస్ 'బాహుబలి'కి సుమారు నాలుగేళ్లు రాసిచ్చాడు. ఈలోపు నాలుగైదు సినిమాలు చేసుకోవచ్చు. అయితే.. ప్రభాస్ అన్ని సంవత్సరాలు కష్టపడినందుకు తగ్గ ప్రతిఫలం దక్కింది. పేరుకు పేరు, డబ్బుకు డబ్బు వచ్చాయి. 'బాహుబలి' తరవాత జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా డివివి దానయ్య నిర్మాణంలో రాజమౌళి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. త్వరలో ఈ సినిమా పట్టాలు ఎక్కనుంది. అదేనండీ... సినిమా షూటింగ్ స్టార్ట్ కానుంది. సుమారు ఏడాది పాటు షూటింగ్ వుంటుందని టాక్. హీరోలు ఇద్దరూ 200 డేస్ కాల్షీట్ రాసిచ్చార్ట. 200 వర్కింగ్ డేస్ అంటే షూటింగ్ కంప్లీట్ కావడానికి ఏడాది టైమ్ పట్టేట్టుంది. మధ్యలో సెలవులు, పండగలు, ఆర్టిస్టుల డేట్స్ అడ్జస్ట్ కాకా షూటింగ్ చేయని రోజులను కలుపుకోవాలి కదా! ఈలోపు అటు ఎన్టీఆర్ ఓ మూడు సినిమాలు, రామ్ చరణ్ ఒక మూడు సినిమాలు చేసుకోవచ్చు. ఒక్కో సినిమాకు పది కోట్ల రూపాయల రెమ్యునరేషన్ వేసుకున్నా... ఒక్కొక్కరి ఖాతాలో 30 కోట్లు పడతాయి. రాజమౌళి సినిమాకూ అంతే అమౌంట్ హీరోలకు వస్తుందట. నిర్మాత డివివి దానయ్య హీరోలు ఇద్దరికీ అడ్వాన్సులు ఇచ్చారు. ఎంత ఇచ్చారనేది బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారు. రెమ్యునరేషన్‌తో పాటు సినిమా లాభాల్లో వాటా ఇవ్వడానికి నిర్మాత అంగీకరించార్ట. రాజమౌళి సినిమా కనుక ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరిగే అవకాశం వుంది. రెమ్యునరేషన్, ప్రాఫిట్ షేర్ కలుపుకుంటే ఎన్టీఆర్‌కి రూ. 30 కోట్లు, రామ్‌చరణ్‌కి రూ. 30 కోట్లు అందుతాయని టాక్.