హలో బ్రదరూ... సవ్యసాచి!
on Oct 25, 2018
కింగ్ నాగార్జున ఎవర్గ్రీన్ హిట్ సినిమాల్లో 'హలో బ్రదర్' ఒకటి. నాగార్జున డ్యూయల్ రోల్ చేసిన సినిమా లిస్టు తీస్తే ముందుగా చెప్పుకోవలసినది. అందులో తన ప్రమేయం లేకుండా జరిగే పనుల వలన... అదేనండీ ట్విన్ బ్రదర్స్ రిఫ్లెక్షన్ మెంటాలిటీ వలన నాగార్జున పాత్రలు చేసే పనులు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి. ఇప్పుడీ సినిమా ప్రస్తావన ఎందుకంటే... నాగార్జున పెద్ద కుమారుడు నాగచైతన్య నటించిన తాజా సినిమా 'సవ్యసాచి' సినిమా ట్రైలర్ చూస్తే 'హలో బ్రదర్' గుర్తుకు వస్తుంది. గుర్తుకు రావడం గ్యారెంటీ.
'సవ్యసాచి' టీజర్లో కాన్సెప్ట్ ఏంటనేది దర్శకుడు చందూ మొండేటి చెప్పాడు. ఎడమ చెయ్యి తన అధీనంలో లేని ఓ యువకుడి కథే ఈ సినిమా. 'చావు అయినా నిన్ను చేరాలంటే అది నీ ఎడమ చెయ్యి దాటి రావాలి' అని రావు రమేశ్ చేత ట్రైలర్లో చెప్పించారు. ఈ పాయింట్ నుంచి కావాల్సినంత యాక్షన్ మాత్రమే కాదు... రొమాన్స్ అండ్ కామెడీనీ చందూ మొండేటి రాబట్టాడని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ట్రైలర్లో కనిపించినది కాసేపే అయినప్పటికీ.. హీరో హీరోయిన్ ట్రాక్ 'హలో బ్రదర్'ను గుర్తు చేసింది. బహుశా.. నాగార్జునకు, నాగచైతన్యకు ఈ పాయింట్ నచ్చి సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారేమో! ఈ రోజు ఉదయం ట్రైలర్ గురించి ట్వీట్ చేసిన నాగార్జున 'హలో బ్రదర్' అన్నారంటే, ఆ సినిమా ఇంపాక్ట్ ఈ ట్రైలర్లో ఎంత కనిపించిందో అర్థం చేసుకోవచ్చు. కాకపోతే... రెండిటికీ చిన్న తేడా వుంది. 'హలో బ్రదర్'లో నాగార్జున డ్యూయల్ రోల్ చేశారు. ఇందులో నాగచైతన్య డ్యూయల్ షేడ్స్ వున్న క్యారెక్టర్ చేస్తున్నాడు. విక్రమ్ ఆదిత్యగా కనిపించనున్నాడు. ఇందులో నిధి అగర్వాల్ హీరోయిన్. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది.