చరణ్ చేయాల్సింది... చిరు చేస్తున్నారు!
on Oct 12, 2018
కొరటాల శివ దర్శకత్వంలో రామ్చరణ్ కథానాయకుడిగా ఓ సినిమా చేయాల్సింది! కాని చేయలేదు. చేయలేదు అనడం కంటే కుదరలేదు అనడం సబబుగా వుంటుందేమో! 'మిర్చి'తో కొరటాల శివ దర్శకుడిగా పరిచయమయ్యారు. 'మిర్చి' తరవాత కొరటాల దర్శకత్వంలో రామ్చరణ్ హీరోగా నిర్మాత బండ్ల గణేష్ ఓ సినిమా ప్రారంభమైంది. పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. ఎందుకో ఆ సినిమా పట్టాలు ఎక్కలేదు. తరవాత కొరటాల 'శ్రీమంతుడు', 'జనతా గ్యారేజ్', భరత్ అనే నేను' సినిమాలు తీశారు. గతేడాది మరోసారి రామ్చరణ్, కొరటాల కాంబినేషన్లో సినిమా తెరపైకి వచ్చింది. కొరటాల శివ చిన్ననాటి స్నేహితుడు మిక్కిలినేని సుధాకర్ నిర్మాణంలో ఆ సినిమా వుంటుందని ప్రకటించారు. ఈసారీ సినిమా పట్టాలెక్కలేదు. రామ్చరణ్ బదులు చిరంజీవిని దర్శకత్వం వహించే అవకాశం కొరటాలకు దక్కింది.
చిరంజీవి కథానాయకుడిగా కొరటాల దర్శకత్వంలో వచ్చే ఏడాది ప్రారంభంలో ఒక సినిమా మొదలు కానున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్, మిక్కిలినేని సుధాకర్ మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తామని తాజాగా ప్రకటించారు. మిక్కిలినేని సుధాకర్ నిర్మాణంలో రామ్చరణ్ చేయాల్సిన సినిమాను చిరంజీవి చేస్తున్నారన్నమాట. అదే విధంగా ఈ సినిమా నిర్మాణంలో ఇతరులు భాగస్వామిగా వ్యవహరిస్తున్నారని వచ్చిన వార్తలు అవాస్తవాలని చిత్రబృందం తెలిపింది.