మందు బాటిల్ ఒక్కటే కామన్... మిగతాది వేరు!
on Sep 24, 2018
‘శివ’... నాగార్జునకు స్టార్డమ్ తెచ్చిన సినిమా. దానికి రామ్‌గోపాల్ వర్మ దర్శకుడు. ఇండస్ట్రీ ట్రెండ్ సెటర్‌గా ‘శివ’ చరిత్ర సృష్టించింది. ఆ సినిమా తరవాత నాగార్జున, వర్మ కాంబినేషన్లో సినిమాలు వచ్చాయి. అయితే... సుమారు 28 ఏళ్ళ విరామం తరవాత వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా ‘ఆఫీసర్’. అట్టర్‌ఫ్లాప్ అయ్యింది. డిజాస్టర్ సినిమాల్లో రికార్డు సృష్టించింది. దీనిపై తాజా ఇంటర్వ్యూలో నాగార్జున స్పందించారు. ఆ సినిమా చేసినందుకు రిగ్రేట్‌గా ఫీలవుతున్నారా? అని అడిగితే... లేదని చెప్పారు. ‘‘జీవితంలో కొన్నిసార్లు పొరపాట్లు చేస్తాం. వాటికి రిగ్రేట్ ఫీలవడం ఎందుకు? నాకు ఏమీ పశ్చాత్తాపం లేదు. ఎందుకంటే... ఆ సినిమాను నమ్మి చేశా. కాని రిజల్ట్ అనుకున్నట్టు రాలేదు. అందరూ సక్సెస్ అవుతామని ఏదో ఒక ప్రయత్నం చేస్తారు. ఉదాహరణకు... 95 పర్సెంట్ స్టార్టప్‌లు సక్సెస్ కావు. కొన్నిసార్లు తప్పులు జరుగుతాయి’’ అన్నారు. ‘దేవదాస్’ గురించి మాట్లాడుతూ ‘‘నాన్నగారు నటించిన పాత ‘దేవదాసు’కు, మా ‘దేవదాస్’కు ఎలాంటి సంబంధం లేదు. ఒక్క మందు బాటిల్ మాత్రమే కామన్. పాత దేవదాసు లవ్ అండ్ ట్రాజెడీ దేవదాసు. మా దేవదాస్ లాఫింగ్ దేవదాస్. రెండున్నర గంటలు ప్రేక్షకుల్ని నవ్విస్తుంది. హిందీ దర్శకుడు రాజ్‌కుమార్ హిరాణీ సినిమాల్లో వున్నట్టు అంతర్లీనంగా ఒక సందేశం ఉంటుంది’’ అన్నారు.