చిరు.. బాలయ్య ముసలోళ్ళు... నాగ్ హాట్ కామెంట్
on Sep 24, 2018
- ‘దేవదాస్’... మల్టీస్టారర్ సినిమా! ఇందులో నాగార్జున ఓ హీరో... నాని మరో హీరో!
- ‘వెంకీమామా’... మల్టీస్టారర్ సినిమాయే! వెంకటేశ్, నాగచైతన్య హీరోలుగా నటించనున్న ఈ సినిమా త్వరలో సెట్స్‌కి వెళ్లనుంది!
- ఇటీవల తెలుగులో వచ్చిన మల్టీస్టారర్ సినిమాలు ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘మసాలా’, ‘మనం’, ‘గోపాల గోపాల’... ఎందులో చూసిన ఒక సీనియర్ హీరో, మరో యంగ్ హీరో చేశారు. సేమ్ ఏజ్ గ్రూప్‌లో ఉన్న హీరోలు మల్టీస్టారర్ సినిమాలు చేసిన సందర్భాలు తక్కువ. ‘సీనియర్, జూనియర్ హీరోలు కలవడం తప్పితే... ఒకే వయసున్న ఇద్దరు హీరోలు సినిమా చేయరా?’ అనే ప్రశ్న ‘దేవదాస్’ విడుదల సందర్భంగా మీడియా ముందుకొచ్చిన నాగార్జునకు ఎదురైంది. ‘చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్...’ వీళ్లతో మీరు మల్టీస్టారర్ సినిమాలు చేసే అవకాశాలు లేవా?’ అని మీడియా అడిగింది. అందుకు నాగార్జున ఏం చెప్పారో తెలుసా?
‘‘మా సీనియర్ హీరోలు ఇద్దరు కలిసి సినిమా చేస్తే ముసలోళ్ళ సినిమా అనేస్తారండీ’’ అని సరదాగా స్పందించారు. దాంతో ఒక్కసారిగా అందరూ నవ్వేశారు. నాగార్జున కూడా నవ్వేస్తూ... ‘‘ఎవరూ కథలు తీసుకురాలేదు. వస్తే నా వయసున్న హీరోలతో కూడా నటించడానికి సిద్ధమే’’ అన్నారు. ఇంకా మల్టీస్టారర్ సినిమా గురించి మాట్లాడుతూ ‘‘ఇండస్ట్రీలో 32 ఏళ్ల నుంచి సినిమాలు చేస్తున్నా. ఇప్పుడు డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయాలనుంది. సోలో హీరోగా చేయడం అంత సులువు కాదు. తమిళంలో ధనుష్ దర్శకత్వంలో చేయనున్నదీ... హిందీలో చేస్తున్న ‘బ్రహ్మాస్త్ర’ కూడా మల్టీస్టారర్ సినియాలే. అలాగని, మల్టీస్టారర్స్ సేఫ్ అనుకోవడం లేదు. మల్టీస్టారర్స్ సేఫ్ అని ఎవరూ పుస్తకం రాయలేదు. కాకపోతే దర్శక రచయితలకు సులువుగా ఉంటుంది. కథలు రాసుకోవడానికి. అయితే... సినిమా బాగా రాకపోతే ‘ఇద్దరు హీరోలు కలిసి హిట్ కొట్టలేకపోయారు’ అని అంటారు. ఆ విధంగా మరో రకమైన ఒత్తిడి ఉంటుంది’’ అన్నారు.